స్త్రీలోక సంచారం

6 Oct, 2018 00:15 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

ప్రియాంకా చోప్రా క్షణం తీరిగ్గా ఉండడం లేదు! ఎమ్మీ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో తనే. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ తొలి వరుసలో తనే. బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌ బర్త్‌డేలో ఎలాగూ తనే. బాలీవుడ్‌లో ఒక మూవీలో నటిస్తోంది.. అక్కడా తనే. ఫారిన్‌కి, ఇండియాకు మధ్య ఇష్టంగా సతమతమౌతున్నారు ప్రియాంక. ఇప్పుడిక ఒక డేటింగ్‌ కంపెనీలో డబ్బులు పెట్టి, ఆ పనీపాటా చూసుకోబోతున్నారు. ‘బంబుల్‌’ అనే ఆ సోషల్‌మీడియా డేటింగ్‌ యాప్‌లో ప్రియాంక కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారని వార్త! ఈ బంబుల్‌ (‘అయోమయం’ అని అర్థం) వ్యవస్థాపకురాలు విట్నీ ఉల్ఫ్‌ హెర్డ్‌ అనే అమెరికన్‌ మహిళ. ఆమెకు చేదోడుగా ప్రియాంక ఇందులో పెట్టుబడి పెట్టారు. దీనికన్నా ముందు ఒక కోడింగ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్మ్‌లో డబ్బులు పెట్టేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లి, అక్కడి హాల్బెర్టన్‌ స్కూల్‌ అంతా కలియదిరిగి, ముచ్చటపడి, మనసు పారేసుకుని, వాళ్లక్కొంత డబ్బు ఇచ్చి, సేమ్‌ అలాంటి స్టార్టప్‌ కంపెనీనే తను కూడా ప్రారంభించాలని ప్రియాంక ఆశపడుతున్నారు. కోడింగ్‌ ఎడ్యుకేషన్‌ అంటే టెక్నాలజీ బేస్డ్‌. టెక్నాలజీ అంటే ప్రియాంకకు మహా ఇష్టం. టెక్‌ ఇన్వెస్టర్‌గా మిస్‌ అంజుల అచారియా (సౌత్‌ ఏషియన్‌)కు మించి పేరును తెచ్చుకోవాలని ప్రియాంక ప్రయత్నమట. 

మోడల్‌ జెస్సికా లాల్‌ను మను శర్మ అనే వ్యక్తి హత్య చేశాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థిని ప్రియదర్శినీ మట్టూను సంతోష్‌ సింగ్‌ అనే అతడు రేప్‌ చేసి, చంపేశాడు. సుశీల్‌ శర్మ అనే మనిషి తన భార్యను చంపేసి, ఆమె మృతదేహాన్ని తండూరి పొయ్యిలో పడేశాడు. ఇవన్నీ ఏళ్ల క్రితం జరిగిన హత్యలు. ఈ ముగ్గురూ ప్రస్తుతం తీహార్‌ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వీళ్లు, వీళ్లతో పాటు మరో 86 మంది.. ఇంతకాలం శిక్ష అనుభవించాం కనుక తమను విడుదల చేయాలని పెట్టుకున్న దరఖాస్తులలో 22 మంది అభ్యర్థనను మన్నించిన ‘సెంటెన్స్‌ రివ్యూ బోర్డు’ (ఎస్‌.ఆర్‌.బి.) ఈ ముగ్గురినీ విడుదల చేయకూడదని నిర్ణయించింది. మనుశర్మ, సుశీల్‌శర్మల విడుదలకు గత జూలైలో వారినుంచి విజ్ఞాపన అందినప్పుడు కూడా బోర్డులోని అధికశాతం సభ్యులు వ్యతిరేకించడంతో వారికి విముక్తి లభించలేదు. 1996లో ప్రియదర్శిని మట్టూపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేసినందుకు సంతోశ్‌ సింగ్‌కు 2006లో మరణశిక్ష పడగా, ఆ శిక్షను 2010లో సుప్రీంకోర్టు యావజ్జీవంగా మార్చింది. జస్సికాలాల్‌ను మనుశర్మ 1999లో హత్య చేయగా అతడికి 2006లో యావజ్జీవం పడింది. నైనా సహానీని అతడి భర్త సుశీల్‌ శర్మ 1995లో హత్య చేయగా అతడికీ 2006లోనే యావజ్జీవ శిక్ష విధించారు. 

జపాన్‌లోని ఒసాకా నగరం.. యు.ఎస్‌.లోని శాన్‌ఫ్రాన్సిస్కోతో గత 60 ఏళ్లుగా తనకున్న ‘సిస్టర్‌ సిటీ’ అనుబంధాన్ని తెంచేసుకుంది. యుద్ధకాలంలో మహిళలను జపాన్‌కు లైంగిక బానిసలుగా çపంపిన సందర్భాన్ని సంకేతపరుస్తూ గత ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థానిక కొరియన్లు, చైనీయులు, ఫిలిప్పీన్‌లు కలిసి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఒకాసా మేయర్‌ హిరోఫ్యూమి యొషిమురా.. గతవారం శాన్‌ఫ్రాన్సిస్కోకు ఒక లేఖ రాస్తూ.. ‘మన అనుబంధం నుంచి మేము వైదొలగుతున్నాం’ అని స్పష్టం చేశారు. యుద్ధకాలంలో ఆసియాలోని వేలాది మంది మహిళల్ని జపాన్‌ సైనికుల దేహ అవసరాల కోసం బలవంతంగా సెక్స్‌ బానిసలుగా మార్చారన్నదాంట్లో నిజం లేదని, అది తమపై ఒక అపవాదు మాత్రమేని మేయర్‌ వ్యాఖ్యానించారు.
  

మరిన్ని వార్తలు