శరీరానికీ సమన్వయం

10 Nov, 2016 00:01 IST|Sakshi
శరీరానికీ సమన్వయం

1. వృక్షాసన వేరియంట్-1 సమస్థితిలో నిలబడాలి. కుడికాలు మడిచి కుడిపాదాన్ని ఎడమతొడకు లోపలివైపున నిలువుగా ఉంచి మడమకు కింది భాగానికి దగ్గరగా తీసుకువచ్చి కుడిమోకాలుకి కుర్చీ చేతిని ఆధారం చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ నమస్కార ముద్రలో ఉంచాలి. మెడనొప్పి లేదా స్పాండిలైటిస్ సమస్య ఉన్నట్లయితే చేతులు విడివిడిగా భుజాలకు సమాంతర దూరంలో ఉంచడం మంచిది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చేతుల్ని మణికట్టు దగ్గర రిలాక్స్‌డ్‌గా ఉంచి  కిందకు తేవాలి. ఇదే విధంగా కుడికాలుపై నిలబడి కూడా చేయాలి.

2. వృక్షాసన (వేరియంట్ 2) సమస్థితిలో నిలబడాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి చీలమండలాన్ని లేదా పాదాన్ని ఎడమ చేత్తో పట్టుకోవాలి. కాలి మడమను గట్టిగా పిరుదుల భాగానికి నొక్కుతూ కుడి చేతిని స్ట్రెచ్  చేస్తూ  నిదానంగా పైకి తీసుకెళ్లాలి. మడిచిన ఎడమ మోకాలికి కింద కుర్చీని సపోర్ట్‌గా ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ కుడిచేతిని పక్క నుంచి కిందకు నెమ్మదిగా తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమకాలి మీద నిలబడి చేయాలి.

3. వృక్షాసన వేరియంట్-3 సమస్థితిలో నిలబడాలి. మడిచిన కుడి కాలుని కుర్చీ పై నుంచి తీసుకువెళ్లి మోకాలు కుర్చీ మీద ఉంచాలి. కుడి చేతిని  వెనుక నుంచి తీసుకెళ్లి కుడి చేత్తో కుడిపాదాన్ని పట్టుకొనే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని పైకి తీసుకెళ్లి స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత ఎడమ చేతిని కిందకు, కుడికాలుని సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇలాగే రెండవ వైపున కూడా చేయాలి. మడిచి ఉంచిన కుడి పాదాన్ని కుడిచేత్తో పట్టుకోవడం సాధ్యపడకపోయినా నిరుత్సాహపడకుండా కుడిపాదాన్ని ఎడమచేత్తో పట్టుకుని గట్టిగా నాభి కింద భాగానికి పక్కగా నొక్కిపెడుతూ శ్వాస తీసుకుంటూ కుడి చేతిని పైకి తీసుకె ళ్లాలి.

 ఉపయోగాలు: కాలి కండరాలకు బిగువను కలుగు చేస్తుంది. తొడకండరాలని శక్తివంతంగా మారుస్తుంది. చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూండడం వలన వెన్నెముకకి, డిస్కుల వ్యాకోచత్వానికి వెన్నెముక అలైన్‌మెంట్‌కి ఉత్తమమైన ఆసనం.  కుడి ఎడమల మధ్య సరైన సమతుల్యం లోపించడం వల్లనే వృధ్ధాప్యంలో జారిపడిపోయే సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఆసనం సమన్వయాన్ని అందిస్తుంది.

 4. గరుడాసన సమస్థితిలో నిలబడాలి. ఎడమకాలుమీద స్థిరంగా నిలబడి ఎడమకాలుని కొంచెం వంచి కుడికాలుని ఎడమకాలు మీదుగా తీసుకెళ్లి కుడిపాదాన్ని ఎడమ మోకాలి కింది భాగంలో చుట్టి వెనుక నుంచి లాక్ చేసే ప్రయత్నం చేయాలి. రెండు కుర్చీల ఆధారంగా ఒక కాలును రెండవ కాలుతో చుట్టే ప్రయత్నం చేయడం కొంచెం తేలికే. పూర్తిగా బ్యాలెన్స్ చేసి నిలబడిన తర్వాత చేతులను కూడా ఎదురుగా ఉంచి కుడి మోచేతి కింద నుంచి ఎడమ చేయిని తీసుకెళ్లి  నమస్కారముద్రలో నిలబడే ప్రయత్నం చేయవచ్చు.

 ఉపయోగాలు: సయాటికా, రుమాటిజం వంటి సమస్యలకి, బ్యాలెన్సింగ్‌ను పెంపొందించడానికి  పిరుదులు, తొడలు, పిక్క కండరాల టోనింగ్‌కు ఉపకరిస్తుంది.

మరిన్ని వార్తలు