సింపుల్‌గా ఇంట్లో దొరికే వస్తువులతోనే ఫేస్‌ప్యాక్‌.. మొటిమలు, మచ్చలు మాయం

17 Nov, 2023 16:26 IST|Sakshi

మొటిమలు.. చాలామంది టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్‌లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్‌ ఫేస్‌ప్యాక్‌తో మొటిమలకు చెక్‌ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా.
 

బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది.

► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి.

► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి.

► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి

మరిన్ని వార్తలు