ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

26 Mar, 2018 01:14 IST|Sakshi

వరద గుడి – షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి: 24 ని. 25 సె. ::: హిట్స్‌: 82,550

భాండశుద్ధి లేని పాకమేల అంటారు పెద్దలు. చిత్తశుద్ధి లేని శివపూజలేల అని కూడా అన్నారు. స్వధర్మం, గృహధర్మం పాటించలేని వ్యక్తి ఎదుటివారికి ధర్మపన్నాలు వల్లించడం ఎంత సమంజసం? భార్యపట్ల, సంతానం పట్ల ఎటువంటి ధర్మాన్ని కలిగి ఉండాలో బోధ చేస్తూ తాను మాత్రం ఆ బోధ తప్పితే? అలాంటి భర్తకు బుద్ధి చెప్పి తిరుగుబాటు చేసిన ఒక భార్య కథ ‘వరద గుడి’.

పాటిబండ్ల రజని కథ ‘సత్యవ్రతం’ ఆధారంగా అంజనీ యలమంచలి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతిభావంతంగా రూపకల్పన చేశారు. నటి అర్చన ప్రధాన పాత్ర. ఎం.వి.రఘు కెమెరా. ప్రముఖ లలిత సంగీత గాయకులు మల్లాది సూరిబాబు ఈ షార్ట్‌ఫిల్మ్‌ కోసం టైటిల్‌ సాంగ్‌ ఆలపించారు. తెలుగు సాహిత్యంలోని మంచి కథలకు దృశ్యరూపం ఇచ్చే ఈ పరంపర కొనసాగాలని కోరుకుందాం.

ఏక్‌ దో తీన్‌ – రీమిక్స్‌ సాంగ్‌
నిడివి: 1 ని. 37 సె. ::: హిట్స్‌: 3,18,93,40

నటి మాధురి దీక్షిత్‌ని రాత్రికి రాత్రి సూపర్‌స్టార్‌ చేసిన పాట ‘ఏక్‌ దో తీన్‌’. ఎన్‌.చంద్ర దర్శకత్వం వహించిన ‘తేజాబ్‌’ (1988)లో వచ్చిన ఈ పాట దేశం మొత్తం ఊపేసింది. ముప్పై ఏళ్ల తర్వాత ఈ పాటను మళ్లీ రీమిక్స్‌ చేశారు టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘భాగీ2’ కోసం. నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ పాటలో హుషారైన స్టెప్స్‌ వేస్తూ కనిపించింది.

గతంలో ఈ పాటను అల్కా యాగ్నిక్‌ పాడగా ఇప్పుడు రీమిక్స్‌ కోసం శ్రేయా ఘోషల్‌ గొంతు విప్పడం సంగీతాభిమానులకు ఇరువురిలో ఎవరు బాగా పాడారని బేరీజు వేసుకునే సరదా కలిగిస్తుంది. ‘భాగీ 2’ మన తెలుగు సినిమా ‘క్షణం’కు రీమేక్‌. తెలుగులో హిట్టయిన ఆ సినిమాకు మార్పుచేర్పులు చేసి హిందీకి తగినట్టుగా టైగర్‌ ఇమేజ్‌కు తగినట్టుగా మార్చి రిలీజ్‌ చేస్తున్నారు. మార్చి 30 విడుదల. ఏక్‌ దో తీన్‌ పాట ఈ సినిమా ఘన విజయానికి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

బేవఫా బ్యూటీ – ఐటమ్‌ సాంగ్‌
నిడివి: 2 ని. 05 సె. ::: హిట్స్‌: 39,29,460

ఒకప్పుడు ‘రంగీలా’, ‘అనగనగా ఒకరోజు’, ‘ఏక్‌ హసీనా థీ’ వంటి సినిమాలతో ఎంతో బిజీ హీరోయిన్‌గా వెలిగిన ఊర్మిళా మంటోడ్కర్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఈ ఐటమ్‌ నంబర్‌తో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. ఏదైనా మంచి పాత్రతో కాక ఐటమ్‌ గర్ల్‌గా ఆమె రీఎంట్రీ ఇవ్వడం కుతూహలం రేపే అంశమే. ‘బ్లాక్‌ మెయిల్‌’ సినిమాలో ‘బేవఫా బ్యూటీ’ అంటూ ఊర్మిళ చేసిన ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌లో మంచి హిట్లు సాధిస్తోంది.

వంగపండు రంగు చమ్కీల చీరలో ఈ వయసులో కూడా మంచి శారీరక పటిమతో ఆమె సత్తా చాటుకునేలా ఉంది. ‘బ్లాక్‌ మెయిల్‌’ సినిమాలో హీరో ఇర్ఫాన్‌ ఖాన్‌. తన భార్య మరొకరితో సంబంధం కలిగి ఉండటం చూసి ఇర్ఫాన్‌ ఖానే వాళ్లను ‘ఈ సంగతి నీ భర్తకు చెప్పేస్తాను’ అంటూ అజ్ఞాత వ్యక్తిగా బ్లాక్‌మెయిల్‌ చేయడానికి పూనుకోవడం కథ. ‘ఢిల్లీ బెల్లీ’ వంటి పెద్ద హిట్‌ ఇచ్చిన దర్శకుడు అభినయ్‌ డియో ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అందరి అంచనాలు దీని మీద పెరిగాయి.

>
మరిన్ని వార్తలు