కొవ్వుకోట్లు కరిగిస్తున్నారు

26 Mar, 2018 01:17 IST|Sakshi

ట్రీట్‌మెంట్‌కు నగరంలో ఏటా రూ.275 కోట్లు వెచ్చిస్తున్న ఒబేసిటీ బాధితులు

ఏటేటా పెరిగిపోతున్న స్థూలకాయం సమస్య 

బాధితుల్లో ఎక్కువ మంది టెకీలే..  

పెళ్లికి ముందు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్న యువత 

చికిత్సకు వేల నుంచి లక్షల్లో ప్యాకేజీలు 

రాజశేఖర్‌.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌.. వయసు 29.. మంచి జీతం.. అంతా బాగానే ఉంది.. పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారు.. పెళ్లి చూపులకెళ్లారు.. అయితే అక్కడ అమ్మాయికి రాజశేఖర్‌ నచ్చలేదు! కాస్త లావుగా ఉండటమే అందుకు కారణం. ఎలాగైనా లావు తగ్గా లన్న ఉద్దేశంతో రాజశేఖర్‌ ఒబేసిటీ ట్రీట్‌మెంట్‌కు వెళ్లాడు. ఇలా ఆయన ఒక్కరే కాదు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో 14 శాతం మంది యువకులది ఇదే బాధ. ఒబేసిటీ కారణంగా వారంతా పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తాజాగా ఆరోగ్య సంస్థలు చేసిన అధ్యయనంలో బయటపడింది. 

సాక్షి, హైదరాబాద్‌  : స్థూలకాయం నగరవాసులకు పెద్ద ఇబ్బందినే తెచ్చిపెట్టింది. పెళ్లి జరగాలంటే బరువు తగ్గించుకోవాల్సిందేనని కండిషన్లు పెట్టే స్థాయికి చేరింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో టెకీలు బరువు పెరిగిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో సుమారు 150 వరకు ఒబేసిటీ క్లినిక్‌లున్నాయి. ఒక్కో క్లినిక్‌కు నిత్యం 25 నుంచి 30 మంది వస్తున్నారు. ఈ లెక్కన 3,700 నుంచి 4,500 మంది వరకు ఒబేసిటీ చికిత్స కేంద్రాలను సంప్రదిస్తున్నారు. వీరిలో 65 శాతం మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే ఉన్నారని, వారిలోనూ పెళ్లికి ముందు బరువు తగ్గించుకోవాలనుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. కొన్ని ప్రముఖ క్లినిక్‌లు వారం నుంచి పదిహేను రోజులు, నెల నుంచి రెండు నెలల పాటు ఉండే ట్రీట్‌మెంట్‌కు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏటా హైదరాబాద్‌లోనే ఒబేసిటీ ట్రీట్‌మెంట్‌కు బాధితులు రూ.243 నుంచి రూ.275 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. 

లావైపోతున్నారు.. 
ఒబేసిటీ సమస్య ఏటేటా పెరిగిపోతున్నట్టు 2015–16లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’లో తేలింది. తెలంగాణలో 32 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 2005–06లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనంలో 17.7 శాతం మంది మహిళలు, 17.6 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. 


మా మరదలే అయినా
చిన్నప్పట్నుంచి నాతో పాటు కలిసి పెరిగిన మా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎంఎస్‌ పూర్తిచేసి బెంగళూరులో పనిచేస్తున్నా. అయితే పెళ్లికి మరదలు ఒప్పుకోవడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే.. లావుగా ఉన్నానని చెప్పింది. దీంతో ఓ హోమియోపతి ఒబేసిటీ సెంటర్‌కు వెళ్లి రూ.1.6 లక్షల ప్యాకేజీతో 4 నెలల కోర్సుకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా.      – రవిశంకర్, నిజామాబాద్‌ 

ఇంటర్‌ నుంచి బరువు పెరిగా
నేను వరంగల్‌లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో బరువు పెరిగాను. ఇంజనీరింగ్, తర్వాత స్పెషలైజేషన్‌ కోర్సు పూర్తయ్యే సరికి 90 కేజీలకు చేరా. ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బరువు తగ్గేందుకు వారం క్రితమే మాదాపూర్‌లోని ఓ ఒబేసిటీ క్లినిక్‌ను సంప్రదించా. మూడు నెలల ట్రీట్‌మెంట్‌ కోర్సుకు రూ.1.2 లక్షలు తీసుకున్నారు. – శృతి, మాదాపూర్‌

మరిన్ని వార్తలు