జుకర్‌బర్గ్‌లాగే నాకూ ఓ కూతురు!

3 Dec, 2015 23:34 IST|Sakshi
జుకర్‌బర్గ్‌లాగే నాకూ ఓ కూతురు!

సామాన్యుడి మురిపెం
 
జుకర్‌బర్గ్ తన ఆస్తినంతా ఇతరులకోసం ఇచ్చేశాడేమో. కానీ నా బిడ్డే నా ఆస్తి. తానే నా కలిమి. ఇంచుమించు జుకర్‌బర్గ్ అంతటి సిరిగలవాణ్ణి. నన్ను పిసినారి అంటే అనండి. పీనాసి ముద్ర వేయండి. మీరేమన్నా ఎంతగా నిందించినా... నేను నా సంపదను ఎవరితోనూ షేర్ చేయను. ఎవరేమన్నా కేర్ చేయను.నేనెవరని అడుగుతున్నారా?  జుకర్‌బర్గ్‌లా అసామాన్యుడిని కాను.  అత్యంత సామాన్యుడిని!
 
కొండను అద్దంలో చూపడం ఎలాగో తెలియకపోవచ్చు. కొండ అద్దంతో కొద్దిగా ఎలా అవుతుందో ఎరగకపోవచ్చు. బంగారు కొండ ఉయ్యాల్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం రండి. కోటి వరాల కుప్ప... ఉయ్యాల్లో ఎలా పడుకుంది చెప్మా అంటూ అబ్బురం చూద్దాం రండి. మూసుకున్న ఆ కళ్లు చూడు. బిగుసుకున్న ఆ పిడికిళ్లు చూడు. కన్రెప్పల తియ్యటి చెరసాలలో కన్న తండ్రిని బంధించేసింది. కన్నపేగును గుప్పెట బిగించిపట్టింది. ఇక రేపును ఊహించుకుంటేనే సంబరాలు... సంభ్రమాలు.

జుట్టు దువ్వి నడినెత్తిన ఫౌంటెన్ షేపులో వచ్చేలా రబ్బర్‌బ్యాండ్ బిగించి కట్టడం ఊహించండి... నిత్యకాంతుల నల్లవెలుగుల చిచ్చుబుడ్డి కళ్లముందు కనిపిస్తుంది. చెరోవైపు రెండు పిలకలు వచ్చేలా పాపిట తీద్దామా? సంతోషాల నది రెండు పాయలేసినట్లుగా అనిపిస్తోంది. అవునూ... నది నల్లగా ఉండటం ఎవరైనా చూశారా? నా బిడ్డ జుట్టు చూడండి. కృష్ణవేణి అని ఒక నదికి పేరుపెట్టింది ఇది ఊహించేనేమో?
 కనుబొమలు మధ్య నల్లటి బొట్టు. రేపు కుంకుమో, తిలకమో పెట్టుకునే వరకూ నల్లబొట్టేనట. చరిత్రలో రాతియుగం, రాగియుగం అనే ఏవేవో ఉన్నాయట. కానీ ఎందుకో రాబోయేదంతా కాంతియుగం అనిపిస్తోంది. అది కచ్చితంగా స్వర్ణయుగం కానుంది. ఎందుకంటే బుజ్జిదానికి చెవిరింగులూ, చెంపస్వరాలూ, కాసులపేరూ, బంగారుగాజులూ చేయించాలి కదా. వెలుతురు కొండకు వెండిపట్టీలు వేస్తే వెలవెలబోతాయేమో? మేనిరంగు ముందు మేలిమి కాంతి వన్నె తగ్గుతుందేమో?

అన్నట్టు కనుబొమల మధ్యనున్న ఈ నల్లబొట్టు అచ్చం చందమామలా ఉందేమిటి? చూడాలి. ఈసారి పున్నమి చిన్నబోతుందేమో? జాబిల్లి నల్లకాంతులు వెదజల్లడం నా బిడ్డ నుదుటిమీద జరుగుతోంది. ఇదేమిటి? బిడ్డ చుట్టూ ఓ కాంతి వలయం ఏర్పడుతోంది. ఓ ఆరా ఆవరిస్తోంది? ఆఁ... అర్థమైంది. కూతుర్ని చూసుకుంటూ ఉంటే కళ్లలో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. చెమ్మగిల్లిన ఆ నయనాలతో చూస్తుంటే చంద్రధనుస్సు ఏర్పడుతోంది. వర్షం వచ్చాకే ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుందేమో... కానీ ఈ మూన్‌బౌ మాత్రం నిత్య వర్ణాలతో రాజిల్లుతోంది. సప్త వర్ణాలతో విరాజిల్లుతోంది.

మణికట్టు దగ్గర ఈ కనికట్టు ఏమిటి? నల్లటి చిన్న చిన్న పూసలు గుచ్చిన దారాలు ఎందుకు? దిష్టి తగలకుండానట. పెద్దవాళ్లు చెబుతున్నారు. మహా అయితే ఒక్కోచేతికి యాభై పూసలుంటాయా? రేపు నా బిడ్డ ఫొటో ఫేస్‌బుక్‌లో పెడితే వందల లైకులు పడతాయేమో? ఈ యాభై పూసలు ఏం సరిపోతాయి? ఆయనెవరో మహర్షి లోకకళ్యాణం కోసం వెన్నెముక తీసి ఇచ్చాట్ట. దిష్టిపూసలు సరిపోకపోవనుకుంటే... నా మణికట్టులోని అస్థిపూసలు ఇస్తా. నల్లరంగు పులిమి దిష్టిపూసలుగా వాడుతా.

ఆ కాళ్ల దారాలు చూడండి. నల్లటివే. వాటికి ఇంత పవరా? ఆమె కాళ్ల చుట్టూ కట్టిన ఆ దారాలు ఇంత బలమైన తాళ్లలా నా కాళ్లకు బంధాలు వేస్తున్నాయి. అనుబంధాల మోకుల్ని అల్లుతున్నాయి. ఆ అరికాలిలో దిష్టి చుక్క. తమలపాకుల్లో పండు వక్క. పండులాంటి బిడ్డకు దిష్టితీయడానికి గుమ్మడి పండు ఏం సరిపోతుంది. వనాలు పెంచాల్సిందే. బిడ్డపుట్టగానే అమ్మ గుండెల్లో పాలూరతాయట. అదేమిటీ... నాకు గుండె నిండుతోంది. ఆఁ... తేనెలూరే ఆ చిన్నతల్లిని చూసి మురిపాలూరుతున్నాయేమో? గుడి ముందరి చెలమల్లా ఎప్పటికీ ఆ ఊట ఆగదూ...  పొంగిపొర్లినా ఎప్పటికీ చెలియలి కట్ట మీరదు! మట్టం తగ్గదు!
 - యాసీన్
 

మరిన్ని వార్తలు