రెయిన్-బో హైదరాబాద్!

20 Feb, 2015 23:23 IST|Sakshi
రెయిన్-బో హైదరాబాద్!

నేను ఎర్రమంజిల్ రోడ్‌లో తిరుగుతూ ఏదో వెతుకున్నట్లుగా ఉండటం చూసి మా ఫ్రెండ్ అడిగాడు... ‘ఏమిట్రా వెతుకుతున్నావ్?’ అని.
 
 ‘ఇది ఎర్రమంజిల్ రోడ్డు కదా. ఎర్ర మంజిల్ అంటే ఎరుపు రంగులో ఉండే భవంతి కదా! అదెక్కడ ఉందా అని వెతుకుతున్నా’ అన్నాను నేను.
 
 అంతే... లెక్చర్ మొదలుపెట్టాడు నా ఫ్రెండ్.
 
 ‘ఒరే... పిచ్చోడా! అది ఎర్రమంజిల్ కాదురా. ఇర్రమ్ మంజిల్. అంటే స్వర్గంలో ఉన్న భవంతి అని అర్థం. అప్పట్లో సఫ్దర్‌జంగ్ ముషీరుద్దౌలా ఫఖ్రుల్ ముల్క్ అని నిజాంకు ఒక స్నేహితుడూ కమ్ సలహాదారు ఉండేవాడు. ఆయన భవంతి అది. అది ఎరుపు రంగులో ఉండదు. ఆ హెరిటేజ్ బిల్డింగ్‌ను మొదట్లో పీడబ్ల్యూడీకి ఇచ్చారు. ఆ తర్వాత అది ఇరిగేషన్ అనీ, ఆర్ అండ్ బీ అని విభజితమైంది. అప్పట్లో ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఉండేవారు. ఇప్పుడు వాళ్లు వేరే బిల్డింగ్ కట్టుకుని వెళ్లిపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంటు వాళ్లుంటున్నారట’ అని సమాచారం చెప్పాడు వాడు.
 
 ‘అరె... ఇంతకాలం నేను ఎర్రమంజిల్ అంటే రెడ్ కలర్ బిల్డింగేమో అని పొరబడ్డానే’ అని నేను అంటే... ‘ఇంకా నయం... ఎర్రగడ్డ అంటే ఆ ప్రాంతమంతా ఎర్రగా ఉంటుందేమో అనీ అనుకోలేదు’ అన్నాడు వాడు.
 
 ‘నువ్వేమైనా చెప్పరా. ఎర్రగడ్డ ఎరుపులో లేకపోవచ్చేమో గానీ... రెడ్ కలర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మనవాళ్లు. అమీర్‌పేట సెంటర్ నుంచి బేగంపేట పోయే రోడ్లో ఉన్న ఒక ల్యాండ్‌మార్క్ భవనం పేరేమిటో తెలుసా... లాల్ బంగ్లా’ అన్నాను నేను.
 
 ‘ఆ మాటకొస్తే గ్రీన్‌కూ చాలా ఇంపార్టెన్స్ ఉంది. బడీ చౌడీ పక్కనే ఉన్న మసీదు పేరేమిటో తెలుసా... హరీ మస్జిద్. ఇక్కడ హరీ అంటే ఉర్దూలో గ్రీన్ అని అర్థం. బడీచౌడీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే అది పేరుకు తగ్గట్టుగా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. నమాజ్ కోసం ముస్లింలు హరీ మస్జిద్ అని గ్రీన్ మసీదు నిర్మించుకుంటే ఇక నగేశ్ కుకునూర్ అనే డెరైక్టర్‌కు బ్లూ అంటే ఇష్టమేమో హైదరాబాద్ బ్లూస్ అనే సినిమాను సీక్వెల్‌తో పాటు రెండుసార్లు నిర్మించాడు’ అన్నాడు వాడు.
 ‘అబ్బా నిజంగా హైదరాబాద్ అంతా కలర్‌ఫుల్ రా’ అన్నాన్నేను ముచ్చటపడుతూ.  
 ‘ఒరేయ్... ఏదో లాల్‌బంగ్లా, హరీమసీద్‌ను బట్టి అన్నీ అలాగే అనుకోకు. ఇప్పుడు నల్లకుంట నల్లగా ఉండదు... తెల్లాపూర్ తెల్లగా ఉండదు. నీలాద్రీ నగర్ నీలంగా ఉండదు. ఏదో అప్పట్లో ఆ ఏరియాలకు అలా పేర్లు పెట్టారు’ అని చెప్పాడు వాడు.
 
 ‘నువ్వేమైనా చెప్పరా. అవి ఆయా రంగుల్లో ఉండకపోవచ్చుగానీ... హైదరాబాద్‌ను  చూస్తే నాకు ఇంద్రధనుస్సు గుర్తొస్తుంది. మామూలుగా అయితే ఇంద్రధనుస్సులో  సగమే మనకు కనపడుతుంది కదా. అదే విమానంలో వెళ్లేవాళ్లకు మొత్తం వృత్తాకారంలో కనిపిస్తూ ఉంటుందట. అలాగే... ఆ వృత్తాకారపు ఇంద్రధనుస్సు అంచులను ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనించి, కోయిన్‌సైడ్ అయ్యేలా నేల మీద పరిచామనుకో. అప్పుడు నేల మీద పరచిన ఇంద్రధనుస్సులాంటి అరౌండ్ అండ్ సరౌండ్స్ ఆఫ్ హైదరాబాద్. అవే నా కలర్స్ ఆఫ్ హైదరాబాద్. అదే నా రెయిన్‌బో హైదరాబాద్’ అన్నాన్నేను పరవశంగా.

మరిన్ని వార్తలు