మియ్యాం.. మియ్యాం..మేడ్ ఇన్ ఫారెన్

8 Aug, 2014 01:39 IST|Sakshi
మియ్యాం.. మియ్యాం.. మేడ్ ఇన్ ఫారెన్

నేడు పిల్లుల దినోత్సవం
పెట్ కార్నర్ : పిల్లి కొందరికి అపశకునం. మార్జాల ప్రేమికులకు మాత్రం అది ముద్దుల పెంపుడు జంతువు. పిల్లుల పెంపకం ఇప్పుడొక భారీ వ్యాపారం. ఆన్‌లైన్‌లో పిల్లుల వ్యాపారం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా సాగుతోంది. పర్షియన్, హిమాలయన్ వంటి విదేశీ మార్జాలాలకు రూ.5 వేల నుంచి రూ. 30 వేల వరకు ధర పలుకుతోంది. నగరంలో కుక్కలను పెంచుకునేవారు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే పిల్లులను పెంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫక్తు సంప్రదాయవాదులు సైతం పిల్లుల పెంపకానికి ముందుకొస్తున్నారంటే, ‘పెట్’బడిదారుల ట్రెండ్‌లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు.
 
 ఫారిన్ క్యాట్స్‌పై మక్కువ చూపుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పిల్లుల పోషణ కూడా ఇప్పుడు లాభసాటి వ్యాపారంగా మారింది. వేల రూపాయలు వెచ్చించి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాటి పోషణకూ నెలకు వేలల్లోనే ఖర్చుపెడుతున్నారు. పిల్లుల పెంపకం కొందరికి హాబీ అయితే, హోదా చిహ్నాలను కలిగి ఉండటమే గర్వకారణమనుకునే వారికి ఇది లేటెస్ట్ ఫ్యాషన్. డబ్బుకు వెనుకాడకుండా వివిధ జాతుల విదేశీ పిల్లికూనలను తెచ్చుకుంటున్నారు. వాటి సంరక్షణ కోసం కూడా ధారాళంగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో పిల్లికి నెలకు కనీసం మూడువేల రూపాయలకు పైగా కూడా ఖర్చుపెట్టే వారు ఉన్నారు.

 వర్ణ వివక్ష...
 పిల్లుల పెంపకంలో కాసింత వర్ణవివక్ష లేకపోలేదు. వీటిని పెంచుకోవాలనుకునే వారు ఎక్కువగా తెలుపు రంగు పిల్లులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం బ్రౌన్ కలర్ పిల్లులది. నగరంలో ఎక్కువగా పర్షియన్, హిమాలయన్ జాతుల మార్జాలాలను పెంచుకుంటున్నారు.
ఈ జాతుల పిల్లికూనలను నెలకు కనీసం పది వరకు విక్రయిస్తుంటామని బంజారాహిల్స్‌లోని ‘ఫర్ అండ్ ఫెదర్స్’ పెట్స్ షాపు మేనేజర్ ఎండీ నవీన్ చెబుతున్నారు. పర్షియన్ బ్రీడ్ పిల్లులు చూడచక్కగా ఉంటాయి. మనుషులకు తేలికగా మచ్చికవుతాయి. ఒకసారి మచ్చికయ్యాక యజమానుల పట్ల వాటి శైలిలో ప్రేమాభిమానాలు చూపుతాయి. అందుకే ఎక్కువ మంది వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
 
 మార్జాల మమకారం...
 మ్యావ్.. మ్యావ్‌మనే పిల్లి అరుపు వింటేనే సహించలేరు కొందరు. అలాంటిది, నిత్యం పిల్లుల కూతతోనే తాము మేలుకుంటామని సోమాజిగూడకు చెందిన మహబూబ్ బాషా, జుబేరా దంపతులు చెబుతున్నారు. రెండేళ్లుగా వీరు పర్షియన్ జాతి షార్ట్‌లెగ్ పిల్లులను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం వారింట్లో ఐదు పిల్లులు ఉన్నాయి. పిల్లులతో ఆడుకోవడానికి అసలు టైమే సరిపోవడం లేదని, వాటితో విడదీయలేని బంధం ఏర్పడిందని చెబుతున్నారు ఈ దంపతులు. పిల్లుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న వీరు తమ పిల్లులు పెట్టే పిల్లికూనలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటారు. అయితే, పెట్ లవర్స్‌కు మాత్రమే తాము పిల్లులను విక్రయిస్తామని, అది కూడా నమ్మకం కుదిరితేనేనని వీరు చెబుతున్నారు.
 - మహి

మరిన్ని వార్తలు