సలహాలు ఇవ్వడంలో ఆమెకు ఆమే సాటి

23 Aug, 2013 01:20 IST|Sakshi
సలహాలు ఇవ్వడంలో ఆమెకు ఆమే సాటి

ప్రముఖ రచయిత్రి మాలతీచందూర్ సుమారు ఆరు దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు సుపరిచితులు.  మద్రాసు వె ళ్తే ఏఎన్‌ఆర్, ఎన్‌టిఆర్ తో పాటు మాలతిగారిని చూడాల్సిందే.  26 నవలలు, మరెన్నో కథలు రాశారు.  ఆంధ్రప్రభ వారపత్రికలో మహిళల కోసం ప్రమదావనం నడిపారు. 55 సంవత్సరాచలపాటు ఓ శీర్షికను నడిపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కారు. ‘వంటావార్పు’తో ఎన్నో విధాలుగా మహిళలకు తోడునీడగా నిలిచారు. పాత కెరటాలతో స్వాతి పాఠకుల పరిచితులు. తుదిశ్వాస విడిచేవరకు పాఠకులతోనే  జీవితం గడిపారు.

 వివిధ సందర్భాలలో ఆమె మీడియాతో పంచుకున్న అనుభవాలకు అక్షరరూపమే ఈ వ్యాసం...

 చాలామంది భర్తలు పెళ్లయిన తర్వాత మొట్టమొదట భార్యకు ఇచ్చే ప్రజెంటేషన్ వంటావార్పు పుస్తకమే. ఆ విషయం పక్కనుంచితే... అమ్మమ్మల కాలం నుంచి ఆంధ్రప్రభ వారపత్రిక రాగానే మొట్టమొదటగా చదివే కాలమ్ ప్రమదావనం. అంతో ఇంతో చదువుకున్నవారు, నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రానివారికి కూడా ఈ శీర్షిక ద్వారా మానసిక వికాసం కలిగించారు మాలతిగారు. కొత్తగా రాస్తున్నవారిని ఎంకరేజ్ చేయడమంటే ఆమెకు ఎంతో ఇష్టం. వారి కోసం ఒక సంఘం కూడా నెలకొల్పారు. కొత్త రచయితలకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ‘ఏది రచించినా అది సాహిత్యానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాలి’ అని చెప్పేవారు

 ప్రమదావనం శీర్షికలో... స్త్రీల సమస్యలు, మానవ సంబంధాలు, గృహంలో ఉండే విషయాలను చర్చించారు. ఈ శీర్షిక రాయడానికి ప్రేరణ ఇంగ్లిషు పత్రికలని ఆమె చెప్పేవారు. ‘ప్రపంచ సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందాను. ఆంధ్రప్రభ వార పత్రికలో నన్ను ఫీచర్ రాయమని నార్లవారు కోరారు. మనకు తెలుగులో స్త్రీల కోసం ప్రత్యేకమైన శీర్షికలేమీ లేవు. నేను ఇంగ్లిషులో చదివిన మ్యాగజీన్ల నుంచి ప్రేరణ పొంది, ఇలాంటివి తెలుగులో స్త్రీల కోసం ఎందుకు రాయకూడదనే ఉద్దేశంతో ఈ శీర్షిక ప్రారంభించాను. మొదట్లో చాలా భయపడ్డాను. ఇరుగుపొరుగు వారికి, అమ్మనాన్నలకు చెబితే ఇబ్బంది కలుగుతాయనే విషయాలు నన్ను అడిగేవారు. అటువంటివారికి నేను ఈ శీర్షిక ద్వారా సలహాలు, సూచనలు అందించేదానిని. నేను ప్రమదావనం సమయంలో నేను మాత్రమే కాకుండా, చాలామంది చేత రాయించేదాన్ని’’ అని వివరించారు.

 ఒక చిన్న పల్లెటూరులో ఇంటిని అందంగా సర్దుకున్న ఒక గృహిణిని, ఇలా సర్దడం ఎక్కడ నేర్చుకున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘‘నేనేమీ చదువుకోలేదండీ, మాలతీ చందూర్‌గారి వ్యాసాల ద్వారా నేర్చుకున్నాను’’ అని చెప్పేవారంటే, మాలతిగారి ప్రభావం వారి మీద ఎంతగా ఉందో, అర్థం చేసుకోవచ్చు. టేబుల్ మ్యానర్స్, అతిథులను గౌరవించడం, ఇంటికి ఎవరైనా వస్తే, చేస్తున్న పనులు ఆపి, వారితో మాట్లాడటం... వంటివన్నీ చిన్న చిన్న వ్యాసాలుగా రాశారు. ఎవరైనా సరే ఏ విషయమైనా సరే, మాలతిగారు చెప్పారంటే చాలా ఇష్టపడేవారు. ఆచరించడానికి ఆసక్తి చూపేవారు. ఆమె రచించిన ‘మగరాయుడు’ శీర్షికను మగవారు సైతం చదివేవారు.

 దాంపత్య జీవితం గురించి ఆవిడకు ఎంతో మంచి అభిప్రాయం ఉంది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలసి ఉండాలే కాని వ్యత్యాసాలు ఉండకూడదనేవారు. ‘‘విద్యనేర్చినవారికి వివేకం ఉండాలి. గర్వం, అహంకారం వంటివి విద్యవలన కలగకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. నేను సాహితీమూర్తిగా ఎదగడానికి మా శ్రీవారు ఎంతగానో సహకరించారు. ఆయన నన్ను రాయమని ప్రోత్సహించారు. నేను ఏవైనా తప్పులు చేసినప్పుడు ఆయన సరిదిద్దితే, నా మంచి కోసమే చెప్పారనుకునేదానిని. ఆయన నాకు మేనమామ కావడం వల్ల ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉండేది. నేను ఒకసారి ఆయనతో ‘‘ఎన్నో కథలు, నవలలు రాశాను కదా! అందరూ నన్ను మెచ్చుకుంటుంటే, మీరు నన్ను ఎందుకు పొగడటం లేదు’ అని అడిగితే, నాకు భారవి కథ చెప్పి, నువ్వు చిన్నదానివి కదా నిన్ను పొగడకూడదు’ అన్నారు. నాకు సంతోషం వేసింది. ఆయన భార్యను ఎదగనిచ్చారు. ఒక వాస్తవం చెబుతున్నాను. చాలామంది భర్తలు వారి వారి భార్యలను ఒక స్థితి దాకా మాత్రమే ఎదగనిస్తారు. కాని, నన్ను ఆయన ఏనాడూ నిరుత్సాహపరచలేదు, ఈర్ష్య పడలేదు. నేను ఏవి రాయాలో సూచించేవారు. ఆయన ఇచ్చిన సలహాలను స్వీకరిస్తూ, ఆయన ఇచ్చిన స్వేచ్ఛస్వాతంత్య్రాలను నిలుపుకున్నాను. 

 ఆయన గురించి వివరించండి అని అడగగానే, ఎంతో ఉత్సాహంగా, నిర్భయంగా, నిక్కచ్చిగా వర్ణించారు. ‘‘ఆయన చాలా అందంగా ఉంటారు. నీట్‌గా రెడీ అవుతారు. బట్ట నలగదు, జుట్టు చెదరదు. హ్యాండ్‌సమ్ ఆయన. ఆయనకు అస్సలు కోపం లేదు, నేనే కోపిష్ఠిని. నా కథ ఏదైనా తిరస్కరిస్తే ఆయన బాధపడేవారు. నేను ఆలోచించేదానిని కాదు’’ అంటూ వివరించారు.

 

 ఆమె రచించిన ఎన్నో కథలు, నవలలు... గుజరాతీ, హిందీ, ఇంగ్లిషు, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. పాతకెరటాలు... శీర్షికలో ఎందరో గొప్పగొప్పవారి నవలలను విశ్లేషణాత్మకంగా చెప్పేవారు. భారతీయ సాహిత్యంలో వేరే భాషలోవి కూడా పరిచయం చేశారు. ఆమె రాసిన పరిచయం చదివి, పూర్తి నవల చదవాలనుకునేవారు. ఇంగ్లిషు లిటరేచర్ చదివేవారికి ఈ శీర్షిక చాలా ఉపయోగపడిందని ఎందరో విద్యార్థులు మాలతిగారికి ఉత్తరాలు రాసిన సందర్భం కూడా ఉంది.

 కథలలో నాయిక వర్ణన.. ఆవిడ నవలలో ఏ హీరోయిన్‌నీ భౌతికంగా అందంగా ఉందని వర్ణించలేదు. ఒక్క ‘శిశిర వసంతం’లో మాత్రం కథానాయిక సంధ్యను అందంగా వర్ణించారు. ఆ అమ్మాయి తనకు వచ్చినజబ్బు వలన తన భౌతిక సౌందర్యం పాడైపోతుందని బాధపడదు. ఆమెలోని మాతృకాంక్షను చూపారు. నవలలను ప్రోగ్రెసివ్‌గా, అందరికీ ఉపయోగపడేలా పాజిటివ్‌గా రాసేవారు.

 ఎనిమిది పదులలో కూడా... వయసుతో సంబంధం లేకుండా ఆమె నిత్యం చలాకీగానే ఉండేవారు. అలాగే మాలతిగారికి ‘వాదాలు’ (ఇజమ్) అంటే ఇష్టం ఉండదు. తనది హ్యూమనిజమ్ అంటారు. ‘ నేను మానవతావాదిని. నాకు తటస్థపడ్డ, కొడవటిగంటి, నార్ల, గోపీచంద్... వీరందరి కథలలోనూ మానవతావాదం ఉంటుంది.

 నా జీవిత విధానం కూడా అలాగే ఉంటుంది. రామాయణ భారతాలలోని రాక్షసులు మనకు నేటికీ కనిపిస్తున్నారు. ఆ రెండు మానవేతి హాసాల గురించి పనిగట్టుకుని ఎవ్వరూ తిట్టాల్సిన అవసరం లేదు. ఎద్దేవా చేయనవసరం లేదు. దానివల్ల సెన్సేషన్ ఉంటుందే కాని మరేమీ కాదు. ప్రచురణకర్తలు కూడా దాని కోసమే ప్రచురిస్తారు. రూపాయి లెక్కలో మనం ఎతిక్స్ మర్చిపోతున్నాం. నేను అటువంటివాటికి దూరంగా ఉంటాను’’ అంటూ మానవతా వాదం గురించి చెబుతారు.

 తనకు వచ్చే ఆదాయం గురించి చమత్కారంగా, ‘‘అందరికీ పొలాల మీద ఆదాయం వచ్చినట్టుగా నాకు పబ్లిషర్స్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇంత అని డబ్బు వస్తుంది. నేను ఇప్పటికీ రాస్తున్నాను, చదువుతున్నాను. నేను 1949 నుంచి రాస్తున్నాను. నా మొట్టమొదటి నవల ‘చంపకం - చెద పురుగులు’. అది రాసేటప్పటి కి ఆంధ్రప్రభ వీక్లీ పుట్టలేదు. భగవంతుడు ఓపికి చ్చినంత కాలం ఏదో ఒకటి చేస్తుండాలి.

 ‘శిశిర వసంతం’ నవల చాలా బావుంటుంది. అనంత్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టరు. అతనికి డాక్టర్ కావడానికి కారణం అతని పిన తండ్రి భార్య క్యాన్సర్‌తో చనిపోవడమే. ఒకసారి అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని మనసులో ప్రతిష్టించుకుంటాడు. (అసలు మాలతిగారు ఏ నవలలోనూ నాయికను అందంగా వర్ణించరు. కాని ఈ అమ్మాయిని బాగా వర్ణించారు). నాలుగు రోజులు కనపడకపోయేసరికి ఏమైందా అనుకుంటాడు. ఒకరోజు ఆసుపత్రిలో మామోగ్రపీ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి చేయవలసి వస్తుంది. మానసికంగా అప్‌సెట్ అయిపోతాడు. వెంటనే రాజీనామా చేస్తానంటాడు. తను ఒక అమ్మాయికి దగ్గరయ్యాననీ, ఆ అమ్మాయికి నేను సేవ చేయాలనీ అంటాడు. అతను రాజీనామా చేయకుండా ఆ అమ్మాయి ఒప్పిస్తుంది. ఆ అమ్మాయికి సేవ చేస్తాడు. అతని సేవలో ఆ అమ్మాయి కోలుకుంటుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. శిశిరంలాగ క్యాన్సర్ వస్తుంది, వసంతంలాగ జీవితం చిగురిస్తుంది. ఇదీ ఈ కథ అంతరార్థం.

 -డా. పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు