మనసా స్మరామి : నీ సుఖమే నే కోరుతున్నా...

3 Aug, 2013 00:32 IST|Sakshi
మనసా స్మరామి : నీ సుఖమే నే కోరుతున్నా...

విజయనగరం జిల్లాలోని తెర్లాంలో పుట్టాను. నా బాల్యం, విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. నేను ఎక్కువగా సినిమా పాటలు రేడియోలో వింటుండేవాడిని. సంగీతం మీద పట్టులేకపోయినా పాటలు బాగా వినేవాడిని. ఆ పాటలను ఒక కాగితం మీద రాసుకొని వాటి అర్థాలను తెలుసుకొని ఆ పాట భావాన్ని పూర్తిగా తెలుసుకునేవాడిని. అప్పటి పాటల్లో కొన్ని పాటలు బుద్ధిని తట్టిలేపితే, ఇంకొన్ని పాటలు మనసుకు హాయిని కలిగించేవి. కానీ మనసును, బుద్ధిని బేరీజు వేసి అక్షరాలను పేర్చి కూర్చి పాటను రచించి పాలించిన రారాజు ఆచార్య ఆత్రేయ.
 
 పాత తరాలకు దీటుగా, కొత్త తరాలకు దిక్సూచిగా, మన కవులలో మన‘సుకవి’గా, ప్రతి మనసులో నిత్య‘రవి’గా... పండితుల నుంచి పామరుల వరకు పాటను చేరవేసిన అమరకవి ఆత్రేయ. వారి పాటల సుగంధాల విరితోటలో ఎన్నో పారిజాత కుసుమాలు. వాటిలో మచ్చుకు ఓ నిత్య పుష్పం... ‘ఎక్కడవున్నా ఏమైనా... మనమెవరికి వారై వేరైనా’. ఈ పాట ‘మురళీకృష్ణ’ సినిమాలోనిది. ఇందులో అక్కినేని, జమున నాయికానాయకులుగా నటించారు.
 
 సమకాలీన పరిస్థితుల్లో సార్వజనీనంగా పాటకు అందాన్ని అర్థాన్ని చెప్తూ... నీ సుఖమే నే కోరుతున్నా... నిను వీడి అందుకే వెళుతున్నా... అంటూ ప్రేమను ప్రేమించడమే కాదు, అవసరమనుకున్నప్పుడు స్వచ్ఛమైన త్యాగం కూడా ఉండాలన్నదే ఈ రెండు వాక్యాల సారాంశం. అలా తన అక్షరం చరణంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అసమానమైన సైద్ధాంతిక వేదాంతం రాశారు. అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని/జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని... కాలం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని చెప్పకనే చెప్పారు. అది ప్రేమైనా... జీవితమైనా...


 పసిపాప వలె ఒడి జేర్చినాను / కనుపాప వలె కాపాడినాను / గుండెను గుడిగా చేశాను / నువ్వుండలేనని వెళ్ళావు... పసిపాపలాగ ఒడిలోకి చేర్చాను, కంటికిరెప్పలా కాపాడాను, నా గుండెను గుడిగా చేశాను... అని ప్రేమకు దైవత్వాన్ని ఆపాదించిన వారి ప్రేమానుభూతి ప్రపంచాన్ని దర్శించిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
 
 వలచుట తెలిసిన నా మనసునకు/ మరచుట మాత్రం తెలియనిదా/ మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా! ఈ వాక్యాలు చెప్పడం అంత సులువైన విషయం కాదు. కథానాయకుడి లక్షణాన్ని అవలీలగా ఒకే ఒక వాక్యంలో చెప్పారు. వలచినా, మరచినా అది ప్రేమకు ఎటువంటి ఇబ్బందినీ కలిగించకూడదన్న తత్వం. స్థితప్రజ్ఞత ఉంటేనే కథానాయకుడు. గుండెలో బడబాగ్ని ఉన్నా దానిని సున్నితంగా బయటపెట్టడం నాయకుడి లక్షణం.
 
 నీ కలలే కమ్మగ పండనీ/నా తలపే నీలో వాడనీ/కలకాలం చల్లగ వుండాలని/దీవిస్తున్నా నా దేవిని... ప్రేమ సత్యమైనదైతే అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందన్న అంశాన్ని ఉద్దేశించి, నిర్దేశించి, మంచి ప్రేమ తన బాధ కన్నా తను ప్రేమించిన వ్యక్తి సుఖాన్నే కోరుకుంటుందని, ప్రేమకు మరోసారి పట్టాభిషేకం చేసిన పాటల విరించి ఆత్రేయ. ప్రేమ చెదిరి, చెడిపోతే వచ్చే విరహాన్ని ప్రేమతో ప్రేమగా చెప్పడం వారికే చెల్లింది.
 
 ఇంత సహజంగా, అలతి పదాలతో ప్రాణం పోసుకున్న ఈ గీతం, ఇప్పటికీ చాలామంది సెల్‌ఫోన్లలో కాలర్ ట్యూన్‌గా మోగుతోందంటే, అది ఆత్రేయగారి గొప్పదనమని గర్వంగా చెప్పొచ్చు. దిక్కులు ఉన్నంతకాలం ఈ పాట సజీవంగా ఉంటుంది. మాలాంటి రచయితల శ్రేయోభివృద్ధికి కారకమైన వారి కలానికి... వారికి... శత సహస్ర వందన మందారాలు అర్పిస్తున్నాను.
 సంభాషణ : నాగేష్
 - బాలాజీ
 సినీ గేయ రచయిత

మరిన్ని వార్తలు