రాజకీయ సునామీలో సేన్!

29 Jul, 2013 18:13 IST|Sakshi
రాజకీయ సునామీలో సేన్!

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధాని కావడం తనకిష్టం లేదంటూ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ రాజకీయ సునామీలో చిక్కుకున్నారు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించిన ఆయనపై రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందించాయి. ఆయనకు ఇచ్చిన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ వాదిగా మాట్లాడుతున్న సేన్ నుంచి భారతరత్న తీసేసుకోవాలని కాషాయ పార్టీ ఎంపీ ఒకరు గొంతెత్తారు. ప్రతిష్టాత్మక పురస్కారాన్ని వెనక్కిచ్చేందుకు వెనుకాడబోనంటూ సేన్ దీటుగా స్పందించడంతో సదరు ఎంపీ తోక ముడిచారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి లౌకిక విలువలు లేవని, అందువల్ల ఆయన ప్రధాని కావాలని తాను కోరుకోవడం లేదని అమర్త్యసేన్ అనడంతో దుమారం రేగింది. సేన్ వ్యాఖ్యలపై బీజేపీ అగ్ర నాయకులెవరూ స్పందించలేదు. అయితే ఎంపీ చందన్ మిత్రా మాత్రం సేన్పై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు.  ఎన్డీఏ అధికారంలోకి వస్తే, అమర్త్య సేన్‌కు ఇచ్చిన ‘భారతరత్న’ను వెనక్కు తీసుకోవాలని ‘ట్విట్టర్’లో డిమాండ్ చేశారు. ‘భారతరత్న’ అంటే యావద్దేశానికీ ఆభరణం వంటి వారని, భారతరత్న అవార్డు పొందిన వారు ఏ పార్టీకైనా, ఏ నాయకునికైనా వ్యతిరేకంగా మాట్లాడరాదని, అమర్త్య సేన్ కాంగ్రెస్ రాజకీయ బృందంలో చేరితే మంచిదని పేర్కొన్నారు.

మిత్రా డిమాండ్పై అమర్త్యసేన్ దీటుగా స్పందించారు. ‘భారతరత్న’ను పొందినంత మాత్రాన భావప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేనని, అప్పట్లో తనకు అవార్డును అందజేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయి కోరుకున్నట్లయితే, ‘భారతరత్న’ను వెనక్కిచ్చేస్తానని స్పష్టం చేశారు. మోడీపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కుండబద్దలు కొట్టారు. మిత్రా అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవేనని, వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించరాదని బీజేపీ స్పష్టం చేసింది. అయితే మిత్రాతో జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యం స్వామి గొంతు కలిపారు. అమర్త్యసేన్ భారతీయుడే కాదని ఆరోపించారు. తన బెంగాలీ భార్యను వదిలేసి ఇద్దరు విదేశీ మహిళలను వివాహం చేసుకున్నప్పుడే ఆయన భారతీయత మంటగలిసిందని, ఆయన ఎక్కువగా విదేశాల్లోనే ఉంటూ, ఒకటి రెండు నెలలు మాత్రమే భారత్‌లో ఉంటారని స్వామి విమర్శించారు.

అమర్త్యసేన్ నుంచి ‘భారతరత్న’ను వెనక్కు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ డిమాండ్‌పై కాంగ్రెస్ మండిపడింది. ఇది ఆ పార్టీ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టింది. ఇలాంటి ధోరణి భావప్రకటనా స్వేచ్ఛకే భంగకరమని వ్యాఖ్యానించింది. మోడీ రోజుకో ప్రకటన చేస్తున్నా, ఆయన భావప్రకటనా స్వేచ్ఛను వెనకేసుకు వచ్చే బీజేపీ, తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ విమర్శించారు.

రాజకీయాల్లో వేలు పెట్టకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిదని అమర్త్యసేన్కు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సలహాయిచ్చారు. అసహనానికి బీజేపీ ప్రతిరూపమని బీహార్ సీఎం నితీష్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని బీజేపీ నుంచి బహిష్కృతడయిన రాంజెఠ్మలానీ పేర్కొన్నారు. అధిష్టానం అండ లభించకపోవడంతో చందన్ మిత్రా వెనక్కు తగ్గారు. అమర్త్యసేన్ నుంచి ‘భారతరత్న’ను వెనక్కు తీసుకోవాలన్న వ్యాఖ్యలపై విచారం వెలిబుచ్చారు. తాను అతిగా స్పందిచానని లెంపలేసుకున్నారు. ఇక తనకు మోడీ లేదా రాహుల్ గాంధీపై ప్రత్యేకమైన అభిమానం లేదని మరో ఆర్థికవేత్త జగదీష్ భగవతి పేర్కొన్నారు. దీనిపై నేతాగణం ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు