Perfume Movie Review: ఫర్‌ఫ్యూమ్‌ మూవీ.. ఎలా ఉందంటే?

24 Nov, 2023 14:19 IST|Sakshi
Rating:  

టైటిల్ :  ఫర్‌ఫ్యూమ్
నటీనటులు:  చేనాగ్, ప్రాచీ థాకర్,  అభినయ ఆనంద్, భూషణ్ బాబా మీర్, కేశవ్ దీపక్, తదితరులు
దర్శకత్వం: జేడీ స్వామి
నిర్మాతలు: సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని
నిర్మాణ సంస్థలు:  శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్
సంగీతం: అజయ్ అరసద
సినిమాటోగ్రఫీ: రామ్ కే మహేశ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేదీ: నవంబర్ 24,2023

చిన్న చిత్రాలు, కొత్త కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ చిత్రమే ఇప్పుడు వచ్చింది. స్మెల్లింగ్ అబ్‌సెషన్ అనే కాన్సెప్ట్ మీద తీసిన చిత్రం పర్‌ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

అసలు కథేంటంటే..

హైద్రాబాద్‌‌లో ఓ విచిత్ర వ్యక్తి వ్యాస్ (చేనాగ్) అమ్మాయిల వాసన వస్తే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. అమ్మాయిల వాసనతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించే వ్యాస్‌ను పట్టుకునేందుకు ఏసీపీ దీప్తి (అభినయ) ప్రయత్నాలు చేస్తుంటుంది. అదే సమయంలో వ్యాస్‌ను లీలా (ప్రాచీ థాకర్) చూస్తుంది. చూడగానే అతడిని ఘాడమైన ముద్దు ఇస్తుంది. దీంతో వ్యాస్ ఆమె ధ్యాసలోనే ఉంటాడు. కానీ ఆమె మాత్రం వ్యాస్‌ను అవమానిస్తుంది. ఆ అవమానానికి పగ తీర్చుకోవాలని ఆమెను కిడ్నాప్ చేస్తాడు వ్యాస్? ఆ తరువాత వ్యాస్ ఏం చేస్తాడు? అసలు వ్యాస్‌కు లీలా ఎందుకు ముద్దు పెట్టింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు పోలీసులు వ్యాస్‌ని ఏం చేశారు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త అరుదుగా జరుగుతుంటాయి. ప్రయోగాత్మక చిత్రాలకు ఓ సెక్షన్ నుంచి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఈ పర్‌ఫ్యూమ్ కూడా ఓ సెక్షన్‌ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే నచ్చే అవకాశం ఉంది. పాయింట్ కొత్తదే అయినా.. తెరకెక్కించడంలో, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఎమోషనల్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్, హీరోకి గల సమస్యను చక్కగా వివరించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే కథ, కథనాలు మాత్రం ఊహకందవు. ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సీన్లు ముందుకు సాగవు. ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే..

మొదటి సినిమానే అయినా.. కొత్త వాడే అయినా కూడా చేనాగ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎక్కడా బెరుకు లేకుండా నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఇది వరకు దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం కూడా తోడవ్వడంతో తెరపై అవలీలగా నటించేసినట్టు అనిపిస్తుంది. లీల కారెక్టర్‌లో ప్రాచీ ఓకే అనిపిస్తుంది. ఏసీపీ దీప్తిగా అభినయ కనిపించినంతలో మెప్పించింది. బాబా, తాజ్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికపరమైన విషయానికొస్తే.. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటల ద్వారా నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరా వర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు