రేవంత్ మల్కాజ్ 'గురి'

22 Mar, 2014 14:50 IST|Sakshi
రేవంత్ మల్కాజ్ 'గురి'

మల్కాజ్గిరిపై గురి పెట్టే రాజకీయ నేతల లిస్ట్ పెరిగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది.  రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన, ప్రతిష్ఠాత్మకమైన మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంపై వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కన్నేశారు. అక్కడ నుంచి పోటి చేస్తే గెలుపు నల్లేరు మీద నడేకనని నాయకులంతా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇటు తెలంగాణావాదులు , ఇటు సీమాంధ్ర నాయకులు భారీగా పోటీపడుతున్నారు. సెటిలర్లతో పాటు విద్యాధికులు ఎక్కువగా ఉండటంతో.. అన్నిపార్టీల నేతలు మల్కాజ్‌గిరి స్థానంపై కర్చీప్ వేసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఇప్పటికే లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశారు కూడా. మరోవైపు  ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హఠావో...దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీతో తెరమీదకు వచ్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా మల్కాజ్గిరి నుంచే పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

 తాజాగా కోడంగల్ టీడీపీ రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్‌ గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఎలా పోటీకి దిగుతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. స్థానికుడిగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగే అర్హత తనకే ఉందంటూ ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు.

కాగా రేవంత్‌తో పాటు ఈసారి ఎంపీ బరిలోకి దిగుదామనుకున్న మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కూడా  ఈ పోటీలో ఉన్నారు. అయితే గ ఇదే వ్యూహంతో గత రెండేళ్లుగా నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్‌ రెడ్డి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువనేత కావడం, తెలంగాణావాదాన్ని గట్టిగా వినిపించిన రేవంత్‌కి సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా సర్వే సత్యనారాయణ, ఇంకా చాలామంది ఈ స్థానం మీద కన్నేశారు. ఇక్కడ నుంచే ఓ దశలో చంద్రబాబు పోటీ చేస్తారని.... అలాగే విజయశాంతి, కేసీఆర్, జయసుధ కూడా మల్కాజ్గిరి నుంచే  బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది.

అయితే మల్కాజ్ గిరి స్థానం నుంచి విజయం సులువుగా దక్కుతుందా? మల్కాజ్ గిరి అంత హాట్ కేక్ గా ఎందుకు మారింది.. అనేదే రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో విద్యావంతులు, యువత, సెటిలర్స్, మహిళలు ఎక్కువగా ఉండడంతో వారిని ఆకట్టుకుంటే తమను ఆదరిస్తారని నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణా ఉద్యమ ప్రభావం ఉన్నా సరే.. సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆశావహుల చూపులన్నీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇంతమంది ఆశపడుతున్న మల్కాజ్గిరి, చివరకు ఎవరికి పట్టం కడుతుందో చూడాలి మరి!!


 

మరిన్ని వార్తలు