ప్రాజెక్టులు కట్టింది ఇందిరమ్మ రాజ్యమే..

22 Nov, 2023 04:26 IST|Sakshi

వనపర్తి, నాగర్‌కర్నూల్,అచ్చంపేట సభల్లో రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ఫైర్‌

75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌/రహమత్‌నగర్‌: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల రాజ్యం కావాలో, ఇందిరమ్మ రాజ్యం కావాలో ఆలోచించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గడీల పాలన కావాలో, పేదల ప్రజాప్రభుత్వం కావాలో నాలుగు కోట్ల ప్రజలు నిర్ణయించాలని కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వం మిడతల దండులా పదేళ్లు దోచుకుందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు ద్రోహం చేసి, ఉద్యమకారులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ చీడను వదిలించుకోవాలన్నారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లాకేంద్రంతోపాటు, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రూ.2వేల పెన్షన్‌ అందుతోంది. ఈ నెలలో సీఎం కేసీఆర్‌ను బొందపెట్టండి.. వచ్చే నెలలో రూ.4వేల పెన్షన్‌ ఇస్తా’అని చెప్పారు. 

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష కాంగ్రెస్‌ పుణ్యమే.. 
కేసీఆర్‌ ఇందిరమ్మ రాజ్యం గురించి బరి తెగించి మాట్లాడుతున్నారని, నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు నిర్మించింది ఇందిరమ్మ రాజ్యమేనని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌కు మొదట సింగిల్‌విండో డైరెక్టర్, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష పదవులతో రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు.

ఆయన ఊరు చింతమడకలో రోడ్లు, బడి, సిద్దిపేటలో చదువుకున్న డిగ్రీ కళాశాల నిర్మించింది కాంగ్రెస్సేనని చెప్పారు. మంత్రి హరీశ్‌రావుకు 2004లో ఎమ్మెల్యే కాక ముందే మంత్రి పదవి ఇచ్చింది కూడా వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు. దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది, దేశాన్ని ప్రపంచంతోపాటు ఐటీ రంగంలో పోటీలో నిలిపింది ఇందిరమ్మ రాజ్యమేనని పేర్కొన్నారు. 

పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేస్తాం 
పాలమూరు జిల్లాను నమూనాగా చూపుతూ నిధులు పొంది రూ.వేలాది కోట్లు ఇతర జిల్లాలకు బదిలీ చేశారని రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పాలమూరు పూర్తి కావాలంటే మన బిడ్డనే గెలిపించాలని కోరారు. ఒకనాడు నిజాం విముక్తి పోరాటం తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందన్నారు.

కాంగ్రెస్‌లో ఎంతో మంది ఉద్దండులు ఉండగా, యువకుడైన తనకు టీపీసీసీ అధ్యక్షుడిగా సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని చెప్పారు. ‘నాగర్‌కర్నూల్‌ గడ్డనుంచి శపథం చేస్తున్నా.. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలంతా ఏకమై డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం. నేను నల్లమలలోనే పుట్టాను. మీ బిడ్డగా వచ్చాను ఆశీర్వదించండి’ అని పేర్కొన్నారు.

బహిరంగసభల్లో కర్ణాటక మంత్రి సుధాకర్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట కాంగ్రెస్‌ అభ్యర్థులు తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులను కొంత మంది రౌడీలు బెదిరిస్తున్నారని, అధికారంలోకి రాగానే వారి భరతం పడ్తామని చెప్పారు. 

కేసీఆర్‌కు అర్హత లేదు: కోదండరాం 
సీఎం కేసీఆర్‌ పురాణాల్లోని భస్మాసురుడిలా మారి తనను గెలిపించిన ప్రజలపై చేయిపెట్టేందుకు బయలుదేరాడని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కేసీఆర్‌కు సీఎం కుర్చీలో మళ్లీ కూర్చునే అర్హత లేదని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి 10 గంటల కరెంటు మాత్రమే అందుతోందన్నారు. 24 గంటల కరెంటు కొని మిగతా కరెంటును ఎవరికి అమ్ముతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  

మరిన్ని వార్తలు