టార్గెట్‌కు టాలెంట్.. యాడ్‌ చేశాడు

10 Jun, 2015 00:01 IST|Sakshi
టార్గెట్‌కు టాలెంట్.. యాడ్‌ చేశాడు

సినిమాలో కన్నా అర నిమిషం యాడ్‌లో కనిపిస్తే వచ్చే గుర్తింపు చాలా ఎక్కువ. అదీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు టీవీ ప్రకటనల్లో కనిపిస్తే.. సూపర్ పాపులారిటీ. అలాంటిది పెప్సీ, కోక్, స్ప్రైట్.. ఇలా ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యాడ్స్‌లో చేస్తే.. ఆ కిక్కే వేరు. ఇప్పుడు ఇదే కిక్కును.. లక్కును అందుకున్నాడు మన సిటీ కుర్రాడు కృష్ణ సుహాన్ (క్రిష్). చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఇతడు ఇప్పుడు ‘స్ప్రైట్’ యాడ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు.
 
ఓ కుర్రాడు బైక్‌పై కూర్చుంటాడు.. మరో స్నేహితుడు వచ్చి ఆ బైక్ ఇమ్మని అడుగుతాడు.. అలాగేనంటూ.. పెట్రోలు ఇద్దరం కలిసి పోయిద్దామంటాడు. కలిసి శుభ్రం చేద్దామంటాడు.. ఈఎంఐ కూడా కలికి కడదామంటాడు.. ఇక ఆ స్నేహితుడికి ప్లాన్ అర్థమై.. బైక్ ఎవరి వద్ద ఉంటేనేంటి.. అంటూ తాళం తిరిగి ఇచ్చేస్తాడు. లేటెస్ట్ ‘స్ప్రైట్’ యాడ్ ఇది. ఇందులో బైక్ అడిగిన స్నేహితుడే.. క్రిష్. ఇతడి ‘యాడ్’ జర్నీ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..                      - సాక్షి,హైదరాబాద్

 
తొలి అడుగు ఇలా పడింది..
‘పాండవులు’ అనే టెలీఫిలిం నుంచి కెరీర్ మొదలెట్టా. 15 ఏళ్ల వయసులో సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా 2004 నుంచి ‘చంటి- ది హీరో, సోగ్గాడు, స్వరాభిషేకం, గోల్కొండ హైస్కూల్, వేట’.. ఇలా చాలా చిత్రాల్లో నటించాను. 2007లో పెప్సీ యాడ్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. అది ఒక చిన్న  ఇంటర్నెట్ సెంటర్. ఓ చిన్న హ్యాండీకామ్‌తో పెప్సీ బాటిల్ ఇచ్చి ఏదో చెప్పమన్నారు. అస్సలు నమ్మకంగా అనిపించలేదు.
 
స్టార్ క్రికెటర్స్‌తో వర్క్..
నెక్ట్స్ డే కాల్ చేసి తాజ్ బంజారాకి రమ్మన్నారు. యాడ్ ఫిలింలో పెద్ద క్రికెటర్స్ ఉంటారు అన్నారు. డూప్స్‌తో యాక్ట్ చేయిస్తారు అనుకున్నా. సంక్రాంతికి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్. ఫస్ట్ డే స్పాట్‌కి వెళితే 260 మంది పోలీసులు, లెక్కలేనంత జనం, మధ్యలో సచిన్ టెండూల్కర్, ధోనీ, సెహ్వాగ్, ద్రవిడ్, యువరాజ్.. ఐదుగురు రియల్ స్టార్ క్రికెటర్స్. ఫస్ట్‌టైం వాళ్లని చూసి సూపర్ ఎక్సైట్ అయ్యాను. జనం వాళ్ల ఆటోగ్రాఫ్ దొరికితే చాలు అనుకుంటారు. అలాంటిది వాళ్లతో కలిసి పనిచేశాను.

ఫస్ట్ యాడ్ అంత పెద్ద బ్రాండ్. ఇండియాలో ఐదుగురు క్రికెటర్స్ చేసిన ఫస్ట్ యాడ్ కూడా అదే. తర్వాత 2008లో ‘కోక్’ దివాళి యాడ్‌కి పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ 2015లో స్ప్రైట్‌కి వర్క్ చేశాను. అయితే ఈ యాడ్ కోసం మొదటి సారి ముంబై వెళ్లి అక్కడి వాళ్లతో పనిచేశాను. అక్కడి పనితీరు బాగా నచ్చింది. షాట్ మధ్యలో గ్యాప్ వస్తే ఆర్టిస్ట్ అలసిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. మన బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా యాక్ట్ చేసే ఫ్రీడం ఇస్తారు. స్ప్రైట్ యాడ్ హిందీ, తెలుగు రెండు భాషల్లోనే షూట్ చేశారు. తెలుగు వెర్షన్‌లో నేను యాక్ట్ చేశాను. వాటిని తర్వాత వేరే భాషల్లో డబ్ చేశారు. తెలుగులో వాయిస్  కూడా నాదే. చూసిన ప్రతివాళ్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దీని తర్వాత కొన్ని వేరే బ్రాండ్స్ వాళ్లు ఆడిషన్‌కి పిలిచారు.
 
ఈ క్రెడిట్ పేరెంట్స్‌దే..
‘పుట్టింది.. పదో తరగతి వరకు చదువుకున్నది గుంటూరులో. స్కూల్లో చదువుతున్నప్పుడే డాన్స్ బేబీ డాన్స్‌లో చేశా. ఇది చూసిన ఇంటి చుట్టుపక్కలవారు.. ‘మీ పిల్లాడిలో చాలా టాలెంట్ ఉంది, హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుంది’ అని పేరెంట్స్‌కి సలహా ఇచ్చారు. అలా ఇంటర్ టైంకి హైదరాబాద్‌కు వచ్చేశాం. సిటీలోనే ఇంటర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ 82 శాతం మార్కులతో పూర్తి చేశా. కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లలకు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఉంటాలి, వాటిని ఎంకరేజ్ చెయ్యాలి అని మా పేరెంట్స్ నమ్మి, సపోర్ట్ చేయడం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. ఈ గుర్తింపుకి పూర్తిగా మా పేరెంట్స్ ప్రోత్సాహమే కారణం’ అని చెప్పాడు క్రిష్.
 
గొప్ప సినీ స్టార్ అవ్వాలి..
చిన్నప్పటి నుంచి ప్రొఫెషనల్ డాన్సర్‌ని అలా 700కి పైగా పెర్‌ఫార్మెన్స్‌లు ఇచ్చాను. ‘శిఖరం, మనసు మమత, అగ్నిపూలు, శశిరేఖా పరిణయం’ సీరియల్స్‌లో నటించాను. ఏఐఆర్- రెయింబోలో ఆర్‌జేగా కూడా చేశాను. కొన్ని చానెల్స్‌లో యాంకర్‌గా లైవ్‌షోలు చేశాను. మంచి పర్‌ఫార్మెన్స్‌తో సినిమా హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోవలన్నదే నా గోల్.

మరిన్ని వార్తలు