తాపీ లేని మేస్త్రీ

28 Dec, 2014 21:19 IST|Sakshi

స్టార్ రిపోర్టర్ - చంద్రబోస్

పిడికిళ్లు బిగించి పలుగు, పార పట్టుకున్నా.. వారి చేతి గీత మారింది లేదు. చెమట నీరు చిందించి చలువరాతి మేడను కట్టినా.. వారి నుదుటి రాత బాగుపడ్డదీ లేదు. యజమానికి నచ్చినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా ఇళ్లు కట్టే భవన నిర్మాణ కూలీలు భారంగా బతుకీడుస్తున్నారు. పనులన్న రోజుల్లో మస్తుగా ఉండటం.. లేకుంటే పస్తులుండటం వాళ్లకు మామూలే. సిమెంట్, ఇసుక, నీళ్లు సమపాళ్లలో కలిపి ఇంటికి దృఢత్వం తీసుకువచ్చే వీరికి మాత్రం కష్టాల పాళ్లే ఎక్కువ. తాపీతో మెరిసిపోయే ఫినిషింగ్ ఇచ్చే ఈ మేస్త్రీల జీవితాలు మాత్రం తాపీగా సాగడం లేదు.ఈ కష్టజీవులను సాక్షి సిటీప్లస్ తరఫున సినీగీత రచయిత చంద్రబోస్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు.
చంద్రబోస్: ‘ఈ పేటకు నేనే మేస్త్రీ.. నిరుపేదల పాలిట పెన్నిధి..’ పాట మీరు వినే ఉంటారు. మేస్త్రీ అనే పదం చాలా బలమైనది. ఎంతో బాధ్యత కలది. మీకు గూడు లేకపోయినా మాకు ఇల్లు నిర్మించి ఇస్తారు. మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది.
వెంకటేష్: మాక్కూడ చాలా ఆనందంగా ఉంది సార్.
 
చంద్రబోస్: చెప్పు వెంకటేష్ ఎన్నాళ్లయింది ఈ వృత్తిలోకి వచ్చి ?
వెంకటేష్: 30 ఏళ్లవుతుంది సార్.
 
చంద్రబోస్: అమ్మో..! ఎంత సంపాదించావ్..?
వెంకటేష్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ప్రస్తుతం దారుణంగా ఉంది సార్. ఆర్నెళ్ల నుంచి రియల్‌ఎస్టేట్ పడిపోయింది. కట్టే బిల్డింగులు కూడా ఆపేశారు. చేతికి పనిలేదు.. నోటికి బువ్వ లేదు.
 
చంద్రబోస్: అవును కన్స్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కొంత డల్ అయినట్టు నేనూ గమనించాను.
రాజు: అందుకే.. మీరు ఇంటర్వ్యూ చేస్తారనంగనే.. ఐదుగురిని పిలిస్తే యాభైమంది వచ్చిండ్రు. అందరూ ఖాళీగా రోడ్లెంట తిరుగుతుండ్రు.
 
చంద్రబోస్: ఓకే భయ్యా.. అప్పటికీ, ఇప్పటికీ మేస్త్రిల్లో వచ్చిన తేడా ఏంటి?
రాజు: తేడా మాలో రాలేదు సార్. యజమానుల్లో వచ్చింది. ఒకప్పుడు మేస్త్రీ్తక్రి బోలెడంత విలువ ఉండేది. నిర్మాణాలకు తరతరాలుగా ఒకే మేస్త్రి కుటుంబాన్ని పిలిచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మమ్మల్ని కూడా మిషన్లను చూసినట్టు చూస్తున్నారు.
 
చంద్రబోస్: ఈ వృత్తిలోనే కాదు.. అన్ని రంగాల్లో అనుబంధాలు తగ్గాయి. సరే.. మీ సంపాదన ఎలా ఉంటుంది?
మన్నెంకొండ: మగవారికి రోజుకు రూ.450, ఆడవాళ్లకు రూ.250 ఇస్తారు. వారంలో నాలుగైదు రోజులకంటే ఎక్కువ పని చేయలేం. నెలలో అన్ని రోజులు పని ఉంటుందని గ్యారెంటీ లేదు. అప్పుల తిప్పలు తప్పవు సార్.
 
చంద్రబోస్: మీ పనికి శరీరం బాగా అలసిపోతుంది. ఆ బడలిక తీర్చుకోవడానికి మీరు మందు, గుట్కాలను ఆశ్రయిస్తారని విన్నాను. నిజమేనా..?
 శ్రీనివాస్: అందరూ అలా ఉండరు. కానీ బాగా కష్టమైనపుడు ఒక చుక్క వేయక తప్పదు సార్.
 
చంద్రబోస్: అందరూ పిల్లల్ని చదివిస్తున్నారా?
వెంకటేష్: ఎక్కడ చదువులు సార్. పనులు బాగున్నప్పుడు మంచి స్కూళ్లల్లో చేర్పించాం. ఇప్పుడు పనుల్లేవు, డబ్బు లేదు. అలాగే స్కూల్లో ఫీజులడగడం మానరు కదా! ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. మావోళ్లు చాలామంది పిల్లల్ని స్కూల్‌కు పంపడం ఆపేశారు.
 
చంద్రబోస్: అయ్యో...అంత పని చేయకండి. మీరు ఇంత పని చేసేది మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా!
రమేష్: ఏం చేస్తాం. ఊళ్లకు తిరిగి పోదామంటే అక్కడ పంటలూ లేవు.. పనులూ లేవు.

చంద్రబోస్: మీది ఏ జిల్లా?
రమేష్: మహబూబ్‌నగర్. మాలో చాలామంది ఆ జిల్లా నుంచి వచ్చిన వారే ఉన్నరు.
 
చంద్రబోస్: అవును మన రాష్ట్రంలో వలసల జిల్లా అదే. నేను చాలాసార్లు చూశాను, అడ్డంగా కట్టిన ఓ కర్రపై నిలబడి తాపి పని చేస్తుంటారు. పదుల అంతస్తుల పైన మీ పనులు చూస్తుంటే మాకే కళ్లు తిరుగుతుంటాయి. మీ పరిస్థితి ఏంటి..?
వెంకటేష్: ఏం చేస్తాం. మా పనే అట్లాంటిది.

చంద్రబోస్: భయం వేయాదా?
మన్నెంకొండ: ఎందుకు వేయదు సార్. కాకపోతే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. మనసు కాస్త అటుఇటూ అయిందా.. ప్రమాదం తప్పదు.
 
చంద్రబోస్: అంటే ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. లేకపోతే క్షణం చాలు కదా కాలు జారడానికి, పట్టు తప్పడానికి.
రాజు: ఎంత జాగ్రత్తగా చేసినా ఒకోసారి ప్రమాదాలు తప్పవు సార్. దెబ్బలతో ఆగవు ప్రాణాలే పోతుంటాయి.
 
చంద్రబోస్: మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి?
రాజు: ఈ మధ్యనే ఇక్కడ ఒక అపార్ట్‌మెంట్‌లో కూలీలు పని చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల కుర్రాడు ఇసుక బస్తా మోస్తూ వెనక్కిపడిపోయాడు. ఆ బస్తా గుండెపై పడటంతో గుండె ఆగి చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు. మేమే తలో ఐదువందలు, వెయ్యి వేసుకుని లక్ష న్నర రూపాయలు జమ చేసి అతని కుటుంబానికి సాయం చేశాం. 
చంద్రబోస్: శభాష్ భయ్యా.. పనికి పోతేగానీ పొట్ట నిండని మీరు ఇంత పెద్ద మనసు చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండదా ?
శ్రీనివాస్: ఒక్క పైసా రాదు సార్. అసలు మమ్మల్ని ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు. అన్ని వృత్తుల వారికీ హెల్త్ కార్డులు, ఇళ్లు కట్టిస్తున్నారు. మాకు మాత్రం ఏం లేదు.
 
చంద్రబోస్: అవును నేను కూడా ఎక్కడో విన్నాను. సర్కస్‌లో పని చేసేవారు, భవన నిర్మాణ కూలీలు ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం కూడా లేదట.
వెంకటేష్: మా కష్టాలకు అంతెక్కడుంది సార్. కొందరు అందంగా ఇల్లు కట్టించుకుంటరా..! పని అయిపోయాక పైసలు మాత్రం సరిగా ఇవ్వరు. మా తరఫున అడిగేటోళ్లు ఎవరుంటరు సార్. అందుకే మేమే సొంతంగా ఓ యూనియన్ పెట్టుకున్నం.
 
చంద్రబోస్: గుడ్.. యూనియన్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. కష్టం వస్తే ఆదుకోవడం ఒక్కటే కాదు.. మీ మధ్య అనుబంధాలు కూడా పెరుగుతాయి. అమ్మా.. మీరు మౌనంగా వింటున్నారు. భవన నిర్మాణంలో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మీరు మాల్ అందిస్తేనే మేస్త్రీ ఇటుక పేర్చగలడు. ఏమంటారు?
లక్ష్మమ్మ: ఔ సార్.
 
చంద్రబోస్:
లక్ష్మమ్మ.. ఇటుకలు, ఇసుక, మాలు అన్నీ బరువైనవే. అలాంటివి నెత్తిపై పెట్టుకుని మెట్లెక్కుతారు. ఆరోగ్య సమస్యలు రావా?
లక్ష్మమ్మ: ఎందుకు రావు సార్. ఊకె తలనొస్తది, నడుంల నొస్తది, కాళ్లు గుంజుతయి. అట్లాని.. పనికి రాకుంటే రోజెట్ల ఎల్తది సార్.
 
చంద్రబోస్:
మా ఇంటి పక్కన బిల్డింగ్ కడుతుంటే చూశాను.. గర్భవతులు కూడా వచ్చి ఈ బరువైన పనులు చేస్తుంటారు. చాలా ప్రమాదం కదమ్మా?
లక్ష్మమ్మ: పేదోళ్లకు ప్రమాదం ఏముంటది సార్. బిడ్డను కనే చివరి క్షణం వరకూ కష్టపడి బతికితేనే పుట్టే బిడ్డను పోషించగలదు. గవన్నీ మాకు మామూలే   

చంద్రబోస్: మీరు ఇన్ని కష్టాలు పడితే గానీ ఇంటికి ఓ రూపం రాదు. మిమ్మల్ని కూడా ఓ విభాగంగా గుర్తించి, ముఖ్యంగా ఆరోగ్య బీమా, హెల్త్‌కార్డ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాను... ఉంటాను...
 
 ..:: భువనేశ్వరి
 ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి

 

మరిన్ని వార్తలు