ఆ మాత్రలతో క్యాన్సర్‌ ముప్పు

19 Jan, 2018 08:57 IST|Sakshi

లండన్‌ : గ్యాస్‌, అజీర్తి సమస్యలతో నిత్యం యాంటాసిడ్‌ ట్యాబ్లెట్స్‌ వాడితే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఏడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్‌ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్‌ ముప్పు ఎనిమిది రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్‌ కణాలను పెంచే గ్యాస్ర్టిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ రిస్క్‌ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

గతంలోనూ యాంటాసిడ్స్‌ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అథ్యయనాలు వెల్లడించాయి. హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. ఏడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్‌ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.

వీటిని రోజూ వాడేవారిలో క్యాన్సర్‌ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలం వీటిని వాడటం మంచిది కాదని, వైద్యులు సైతం దీనిపై రోగులను అప్రమత్తం చేయాలని పరిశోధకులు సూచించారు.

మరిన్ని వార్తలు