ముగ్గురు నేతల ముచ్చట్లు

22 Aug, 2013 11:56 IST|Sakshi
ముగ్గురు నేతల ముచ్చట్లు

మామూలుగా ఇద్దరు మాట్లాడుకుంటే అందులో విచిత్రం ఏమీ ఉండదు. అదే ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారంటే మాత్రం దానిపై ఎక్కడలేని ఆసక్తి పుట్టుకొస్తుంది. అదే, నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న వాళ్లు ఇప్పుడు ఉన్నట్లుండి ఆప్యాయంగా మంతనాలు జరుపుకొంటున్నారంటే... ఇక దాని సంగతి చెప్పనే అక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు గుప్పించుకోవటం... ఆనక మిత్రులుగా మారటం పరిపాటే.  

విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో చెప్పలేనన్ని మార్పులు సంభవించాయి. తాజాగా ముగ్గురు నేతలు విడివిడిగా సాగిస్తున్న భేటీలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో భేటీ అయితే... ఇటీవలే 'కారు' దిగి హస్తానికి స్నేహహస్తం చాచిన ఎంపీ విజయశాంతి రక్షణ మంత్రి ఏకే అంటోనీతో సమావేశమయ్యారు. మరోవైపు తెలంగాణ విషయంలో తెర వెనక నుంచి రాజకీయాలు నడుపుతున్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో భేటీ అయ్యారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానంపైనే ఆమె నివాసంలోనే కలిసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని గురించి చర్చించినట్లు సమాచారం. రాయలసీమలోని రెండు జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించి యూపీఏ కూటమి నుంచి వైదొలగిన మజ్లిస్‌ అధినేతతో సోనియా ప్రత్యేకంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక కాంగ్రెస్ పార్టీకి అత్యంత చేరువైపోయిన మెదక్ ఎంపీ విజయశాంతి.. రక్షణ మంత్రి, విభజన కమిటీ పెద్ద ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. రాష్ట్ర సంబంధిత అంశాలపై సుమారు 10 నిమిషాల పాటు చర్చించారు. విభజన నిర్ణయానంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు గురించి వివరించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. టీఆర్‌ఎస్ సహా ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి సానుకూల ఫలితాలు వస్తాయని విజయశాంతి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సీమాంధ్రలో ఆందోళనల కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై కూడా రాములమ్మ సూచనలు చేసినట్లు సమాచారం.


మరోవైపు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్రలో ఆందోళనలు, ఇతర రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ సోనియాగాంధీని కలిసిన తరుణంలో జైపాల్‌రెడ్డి గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్,  శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర పరిధిలోకి తేవటం  తదితర డిమాండ్ల నేపథ్యంలో.. వారి మధ్య ఈ అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.

ఈ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ.. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత జైపాల్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు