హైదరాబాద్ యూత్... బైక్స్ ఆన్ ఫుట్‌పాత్!!

14 Mar, 2015 02:03 IST|Sakshi
హైదరాబాద్ యూత్... బైక్స్ ఆన్ ఫుట్‌పాత్!!

 హైదరాబాద్‌లో బైక్ నడిపే వారికి ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. అది మా రాంబాబుగాడికీ ఒంటబట్టింది. అదేమిటంటే.. చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత ముందన్నీ పెద్ద పెద్ద కార్లూ, ఎస్‌యూవీలూ అడ్డుగా ఉన్నప్పుడు తన ద్విచక్ర వాహనాన్ని ఫుట్‌పాత్ మీదికి ఎక్కిస్తాడు. ముందువరకూ వెళ్లి రైటుకు వెళ్లాలనుకుంటే ఎక్కడో ఒక చోట న్యాక్‌గా ఫుట్‌పాత్ దింపుతాడు. లేదా అలాగే ముందుకు వెళ్లి కాస్త రద్దీ తక్కువగా ఉన్న చోట బైక్‌ను పేవ్‌మెంట్ మీది నుంచి దింపేసి.. తన దారిన తాను వెళ్తుంటాడు.
 ఇలా ఒకసారి సిగ్నల్ పడి ముందున్న పెద్ద పెద్ద వాహనాలన్నీ ఆగగానే.. యథాప్రకారం బండిని ఫుట్‌పాత్ మీద నడిపేయడం మొదలుపెట్టాడు. ‘ఏమిట్రా ఇది... ఫుట్‌పాత్ అన్నది జనాలు నడవడం కోసం. ఇలా బండి నడపడం తప్పుకదూ’ అంటూ నేను వాణ్ణి
 మందలించా. అంతే వాడు రివర్స్‌లో నాకు క్లాస్ తీసుకున్నాడు.
 ‘ఒరేయ్.. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించరా. ఇలా ఫుట్‌పాత్ మీది నుంచి దూసుకుపోవడం ద్వారా నేను సామాజిక న్యాయం చేస్తున్నానురా’ అన్నాడు వాడు.
 ‘ఒరేయ్. ఫుట్‌పాత్ మీద బండి నడపడానికీ, సామాజికన్యాయానికీ ఏమైనా సంబంధం ఉందట్రా. పిచ్చివాగుడు వాగకు’ అంటూ బుద్ధి చెప్పబోయాను.
 ‘ఒక్కసారి ముందు చూడు. అన్నీ బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ, వోల్వో లాంటి పెద్దపెద్ద
 వాహనాలూ; సెగ్మెంట్ సీ కార్లూ; బొలేరో, సఫారీ, స్కార్పియోలాంటి ఎస్‌యూవీలు. ఇన్ని పెద్ద కార్లు మన ముందు ఉంటే.. ఈ పెత్తందారీ కార్లను దాటి మనలాంటి సన్న, చిన్నకారు ద్విచక్రవాహనదారులు ఎప్పటికి సిగ్నల్ దగ్గరికి చేరేనూ? ఎప్పటికి సిగ్నల్ దాటేను? మనమిలా ఫుట్‌పాత్ ఎక్కించకపోతే.. సిగ్నల్ దగ్గరికి వెళ్లేలోపు కనీసం మూడు, నాలుగుసార్లు ఎర్రలైటు వెలుగుతుంది. ఈ రష్‌లో, ఈ జామ్‌లో కారు వెళ్లాకే మనమూ వెళ్దామనుకుంటే కాలం పొద్దుగుంకిపోయి, జీవితం చీకటైపోతుంది. పైగా మనం లెఫ్ట్‌సైడ్‌కు వెళ్లాల్సిన
 సమయంలో మనకు ఫ్రీలెఫ్ట్ దారి కూడా వదలకుండా ఈ బూర్జువా పెత్తందారీ కార్లన్నీ మన దారికి అడ్డుగా నిలబడతాయి. లెఫ్ట్ వెళ్లాల్సిన మనకు దారి వదలాలన్న ధ్యాస కూడా ఉండదు. అందుకే తాజ్‌కృష్ణా నుంచి ఎర్రమంజిల్ చౌరస్తా దగ్గరా, చాదర్‌ఘాట్ నుంచి
 ఇమ్లీబన్‌కు వెళ్లేదారిలో, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో సిటీ సెంటర్‌కు కరెక్ట్‌గా ఆపోజిట్‌సైడ్‌లో.. ఇలా చాలా చోట్ల ద్విచక్రవాహనాలు ఫుట్‌పాత్‌ల మీదికి ఎక్కి, సిగ్నల్‌కు సమీపంగా వచ్చి.. సాఫీగా మొదటిసారే రెడ్ సిగ్నల్ మారే సమయంలో రోడ్డు దాటేస్తాయి. అంటే.. ఇది మనకు మనం చేసుకుంటున్న సామాజిక న్యాయమనే కదా అర్థం. అంతెందుకురా.. నగరం మధ్యనున్న ఎత్తయిన ట్రాక్‌లో  రెలైళ్తుంటే దాన్ని మెట్రోరైలు అన్నట్లే.. ఎత్తయిన ఫుట్‌పాత్ మీద బెకైళ్తుంటే దాన్ని ‘మెట్రోబైక్’ అని పిలుచుకుని, అభివృద్ధికి అదే ఆనవాలని అన్వయించి చూసుకుని, ఆనందించరా పిచ్చివాడా. ఒరేయ్ పూర్‌ఫెలో.. ఇకనైనా థింక్ పాజిటివ్ రా’ అంటూ తన క్లాసు ముగించాడు మా బాసు.

మరిన్ని వార్తలు