మంచి కంచికి!

2 Apr, 2017 01:17 IST|Sakshi
మంచి కంచికి!

ఇంటింటికీ బుల్లితెరలు ఇంకా అందుబాటులోకి రాని బంగారు కాలం ఒకటి ఉండేది. అలాంటి బంగారు కాలంలో ఇళ్లలోని పెద్దలు తీరిక వేళల్లో చిన్నారి చిచ్చర పిడుగులను ఒళ్లో కూర్చోపెట్టుకుని ఓపికగా బోలెడన్ని కథలు చెప్పేవారు. అల్లరిలో ఆరితేరిన గడుగ్గాయిలు కూడా కథలు చెప్పే పెద్దల దగ్గర ఒద్దికగా కూర్చునే వారు. పెద్దలు కథలు చెబుతున్నంత సేపూ ఊ కొడుతూ ఆసక్తిగా ఆలకించే వారు. పిల్లలకు కొంత అక్షర జ్ఞానం అబ్బిన తర్వాత బొమ్మల పుస్తకాల్లోని కథలను చదివి వినిపించేవారు.

 బొమ్మల పుస్తకాల్లోని కథలను స్వయంగా చదివేలా పిల్లలను ప్రోత్సహించేవారు. ఆ కాలంలోనే పిల్లల పత్రికలు వెలువడటం మొదలైంది. ఇంటింటా పిల్లల పత్రికలు విరివిగా కనిపించేవి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే, అవి ఇంటింటా కనిపించడమే అరుదుగా మారింది. నేటితరం పిల్లలు పుస్తకాలకు దూరమై టీవీలకు, కంప్యూటర్లకు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ పరిణామానికి సాంకేతికతను తప్పుపట్టలేం గానీ, పిల్లలను పుస్తకాలకు చేరువ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని గుర్తించక తప్పదు.

బాలల పత్రికలు... గత వైభవం
తెలుగు నాట బాలసాహిత్యం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. విరివిగా వెలువడే బాలల పత్రికలు పిల్లల్లో చదివే అలవాటు పెంపొందడానికి ఎంతగానో దోహదపడ్డాయి. బాలమిత్ర, చందమామ, బాల, బాలకేసరి, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు, బాలజ్యోతి వంటి పిల్లల పత్రికలు విశేషాదరణ పొందాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ పత్రికలను ఆసక్తిగా చదివేవారు. తెలుగునాట బాలల పత్రికల్లో ‘చందమామ’ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ‘చందమామ’ కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా, ఏకంగా పది భాషలకు విస్తరించింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి 1947లో ప్రారంభించిన ఈ పత్రికకు కొడవటిగంటి కుటుంబరావు వంటి సాహితీ ఉద్దండుడు తొలి సంపాదకుడిగా వ్యవహరించారు. తెలుగులోని బాలల పత్రికల్లో ‘చందమామ’ను ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా చెప్పుకోవచ్చు. ‘చందమామ’ కంటే ముందే బాలమిత్ర (1914), బాలభారతి (1924), బాల (1940), బాలకేసరి (1940) వంటి పత్రికలు ఉండేవి.

వాటిలో పిల్లలకు అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న సామాజిక, జానపద, పౌరాణిక కథలు, పద్యాలు, పాటలు, గేయాలు, సీరియల్స్, వింతలు విడ్డూరాలు వంటివి ఉండేవి.  పిల్లల పదసంపదను మెరుగుపరచే పజిల్స్, వారి మెదడుకు పదును పెట్టే పొడుపు కథలు వంటివి ఉండేవి. నెల నెలా క్రమం తప్పకుండా వచ్చే ఈ పత్రికల కోసం పిల్లలు మాత్రమే కాదు, ఇంటిల్లిపాదీ ఆత్రంగా ఎదురు చూసేవారు. తెలుగులో పిల్లల పత్రికలు ఇప్పుడు కూడా వెలువడుతున్నాయి. అయితే, వాటి కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూసే పరిస్థితులే కనిపించడం లేదు.

పంచతంత్రమే బాలసాహిత్యంలో ఆదిగ్రంథం
మన దేశంలో బాలసాహిత్యానికి ఆదిగ్రంథం పంచతంత్రమే. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. పంచతంత్రం కథలలో పశుపక్ష్యాదులే పాత్రలు. అయితే, అవన్నీ మానవ స్వభావానికి ప్రతీకలు. లోకం పోకడను పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించిన పంచతంత్రం కథలు బాల సాహిత్యానికే తలమానికంలాంటివి. ముద్రణ యంత్రం అందుబాటులోకి వచ్చి, పుస్తక ప్రచురణ మొదలైన తర్వాత ‘పంచతంత్రం’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై భాషల్లోకి అనువాదం పొందింది. భాగవతంలోని శ్రీకృష్ణుడి బాల్యలీలలు, రామాయణంలోని బాలకాండలోని గాథలు కూడా మన బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి.

ఆధునిక బాలసాహిత్యం
పంచతంత్రాన్ని మినహాయిస్తే ప్రాచీన సాహిత్యంలో పూర్తిస్థాయి బాలసాహిత్య గ్రంథమేదీ లేదు. ఆధునిక కాలంలో ముద్రణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలాకాలం పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా ఎలాంటి పుస్తకాలూ వెలువడలేదు. దాదాపు పద్దెనిమిదో శతాబ్ది వరకు బాల సాహిత్యమంతా మౌఖిక సంప్రదాయంలోనే కొనసాగేది.

 ఇళ్లలోని పెద్దలు తీరిక వేళల్లో పిల్లలను కూర్చోబెట్టుకుని జానపద కథలు, పాటలు, పద్యాలు, గేయాలు వంటివి చెబుతూ వచ్చేవారు. యూరోప్‌లో పదిహేడో శతాబ్ది చివరి నాటికి పిల్లల కోసం ప్రత్యేకమైన పుస్తకాలను ముద్రించడం ప్రారంభమైంది. అప్పటికే బాగా ప్రచారంలో ఉన్న జానపద గాథలు, నీతి కథలు, వీరగాథలు, చారిత్రక, శాస్త్ర సాంకేతిక విశేషాలను పిల్లలకు అర్థమయ్యేలా రాసేవారు. వాటిని ఆకర్షణీయమైన బొమ్మలతో ముద్రించేవారు. తెలుగులో బాలసాహిత్యాన్ని జనానికి చేరువ చేసిన ఘనత పత్రికలకే దక్కుతుంది.

 తొలిసారిగా ‘జనవినోదిని’ (1875) ‘చిట్ల పొట్లకాయ’, ‘రుంగు రుంగు బిళ్ల’ వంటి బాలల గేయాలను ప్రచురించింది. ఈ పత్రికను మద్రాసు స్కూల్‌ బుక్‌ సొసైటీ ప్రచురించేది. ఆ తర్వాత గుంటూరులోని క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో వెలువడే ‘వివేకవతి’ (1908) పత్రికలో పిల్లల కోసం సరళమైన భాషలో, ఆకర్షణీయమైన బొమ్మలతో చక్కని కథలు ప్రచురించేవారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 1908లో ప్రారంభించిన ‘ఆంధ్రపత్రిక’ వారపత్రికలో కూడా పిల్లలకు సంబంధించిన రచనలను విరివిగా ప్రచురించేవారు. తర్వాతి కాలంలో వచ్చిన సాధారణ పత్రికలు కూడా పిల్లల రచనలకు తగినంత చోటు ఇచ్చేవి. ఇవి ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకునేవి.

పెద్ద రచయితలూ... పిల్లల రచనలూ
ఇప్పటి పాపులర్‌ తెలుగు రచయితలెవరూ పిల్లల కోసం రచనలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు గానీ, ఆధునిక తెలుగు రచయితల్లోని తొలితరం రచయితలు దాదాపు అందరూ పిల్లల కోసం ప్రత్యేకంగా రచనలు చేసినవారే. సాహిత్య దిగ్గజాలుగా పేరుపొందిన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వేంకట పార్వతీశ్వర కవులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చింతా దీక్షితులు, గిడుగు వెంకట సీతాపతి, కరుణశ్రీ, ముళ్లపూడి వెంకటరమణ, నార్ల చిరంజీవి, న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి, వెలగా వెంకటప్పయ్య, మహీధర నళినీమోహనరావు, నండూరి రామమోహనరావు, బోయి భీమన్న, కె.వి.రమణారెడ్డి, రావూరి భరద్వాజ,

 దాశరథి, సి.నారాయణరెడ్డి, బాలాంత్రపు రజనీకాంతరావు, మిరియాల రామకృష్ణ, తురగా జానకీరాణి, ఇల్లిందల సరస్వతీదేవి వంటి వారు బాలల కోసం ప్రత్యేకంగా గేయాలు, శతకాలు, కథలు, నాటికలు, నాటకాలు రచించారు. బాల సాహిత్య సృజన అంత తేలికైన పనేమీ కాదని, అంతకంటే ఉద్గ్రంథాలు రచించడం తేలికని చాలామంది పెద్దల అభిప్రాయం. సుప్రసిద్ధ రచయిత చలం కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘పిల్లలకు పాటలు రాయడమంటే సామాన్యమైన పనికాదు. మహాకవి కావడం దానికన్నా సులభం’ అన్నారాయన.

ప్రసిద్ధ రచయితల్లో చాలామంది పిల్లల కోసం స్వతంత్ర రచనలు చేశారు. నేదునూరి గంగాధరం వంటి వారు తరతరాలుగా ప్రచారంలో ఉన్న పిల్లల గేయాలను, పద్యాలను సేకరించి, పుస్తకరూపంలో వాటిని అందుబాటులోకి తెచ్చారు. పిల్లల్లో ఆలోచనను, సృజనాత్మక శక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని, నైతిక వర్తనను, భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో సుప్రసిద్ధులు రాసిన పిల్లల రచనలు ఎంతగానో దోహదపడ్డాయి. అంతేకాదు, పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంలోనూ ఈ రచనలు తమవంతు పాత్ర పోషించాయి.

పిల్లల కథలు, నవలలు...
కథలు, నవలలు, నాటికలు, నాటకాలు వంటి ప్రక్రియలను పిల్లలు కూడా ఇష్టపడతారు. కాల్పనిక సాహిత్యం ద్వారా పిల్లల్లో పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించవచ్చని కందుకూరి వీరేశలింగం వంటి వైతాళికులు గుర్తించారు. అందుకే ఆయన ఈసోప్‌కథలను ‘నీతికథా మంజరి’ పేరిట రెండు సంకలనాల్లో ప్రచురించారు.

 నార్ల చిరంజీవి, భమిడిపాటి కామేశ్వరరావు, వేంకట పార్వతీశ్వర కవులు, చింతా దీక్షితులు వంటి వారు పిల్లల కోసం నీతికథలు రాశారు. జయంతి జగన్నాథరావు ‘నారదుని కథలు, నండూరి విఠల్‌ ‘బైబిల్‌ కథలు’ పిల్లల కోసం ప్రత్యేకంగా రాశారు. పురాణగాథలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాసి, ఆకర్షణీయమైన బొమ్మలతో పుస్తకంగా అందిస్తే బాగుంటుందనే సంకల్పంతో మాగంటి బాపినీడు 1948లో మొదటిసారిగా పిల్లల బొమ్మల భారతాన్ని ప్రచురించారు.

ఆ తర్వాత అదే ఒరవడిలో చాలామంది పిల్లల కోసం రామాయణ, భాగవతాలను కూడా బొమ్మలతో ప్రచురించారు. నీతికథలు, పురాణగాథలే కాకుండా, పిల్లల కోసం అద్భుతరస ప్రధానమైన కాల్పనిక నవలలు, కథలు కూడా అప్పట్లో విరివిగా వచ్చేవి. ‘పేదరాశి పెద్దమ్మ కథలు’, ‘ఇంద్రజాల కథలు’, ‘మాయగంట’, ‘అల్లావుద్దీన్‌ అద్భుతదీపం’, ‘ఆలీబాబా నలభై దొంగలు’, ‘పరమానందయ్య శిష్యుల కథలు’, ‘తెనాలి రామలింగడి కథలు’ ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’, ‘సింద్‌బాద్‌ సాహసగాథలు’ వంటి కథలు, నవలలు కొన్ని తరాల పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించాయి.

 చింతా దీక్షితులు రాసిన ‘బంగారు పిలక’, ‘గోపీ మోహిని’, చాపరాల సరళ తిలక్‌ రాసిన ‘చిన్నారి గూఢచారి’, రావూరి భరద్వాజ రాసిన ‘పితృహృదయం’, మునిమాణిక్యం వారి ‘గాలి పిల్లలు’ వంటి నవలలు పిల్లలను విపరీతంగా ఆకట్టుకునేవి. ఇక ముళ్లపూడి వెంకటరమణ సృష్టించిన ‘బుడుగు’ పాత్రకు బాపు రూపురేఖలు తీర్చిదిద్దారు. ‘బుడుగు’ పూర్తిగా అచ్చ తెలుగు కామిక్‌ హీరో. ఈ చిచ్చర పిడుగుకు అనతికాలంలోనే ఆబాలగోపాలం అభిమానులుగా మారారు.

బాలల కోసం విజ్ఞాన సాహిత్యం
కాల్పనిక సాహిత్యం పిల్లల్లో ఊహాశక్తికి పదును పెడుతుంది. నీతికథలు వారిలో సత్ప్రవర్తనకు తోడ్పడతాయి. పురాణ గాథలు, చరిత్ర కథలు మన సాంస్కృతిక వారసత్వంపై అభిమానాన్ని పెంపొందిస్తాయి. వీటన్నింటితో పాటే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కూడా పెంపొందిస్తేనే వారు ఆదర్శవంతులైన భావి పౌరులుగా అన్ని రంగాల్లోనూ రాణించగలరని భావించారు మన ముందు తరం రచయితలు.

అలాగని పాఠంలా చెబితే శాస్త్ర సాంకేతిక అంశాలను పిల్లలు తేలికగా ఆకళింపు చేసుకోలేరు. అర్థం కావడంలో ఆదిలోనే ఇబ్బందులు ఎదురైతే వాటిని చదవాలంటేనే భయపడే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే మన రచయితల్లో శాస్త్రీయ పరిజ్ఞానం గల కొందరు శాస్త్ర సాంకేతిక అంశాలను తేలికైన భాషలో కథలుగా, గేయాలుగా మలచి పిల్లలకు అందించారు.

జనమంచి రామకృష్ణ ‘అడగండి చెబుతాను’ (1955), వేమరాజు భానుమూర్తి ‘భూమి కథ’, ‘సైన్సు కథ’ (1957), వారణాసి సుబ్రహ్మణ్యం ‘జంతుప్రపంచం’ (1957),  విస్సా అప్పారావు ‘ఆకాశం’ (1960), ఏవీఎస్‌ రామారావు ‘విశ్వ రహస్యం’(1965) వంటి రచనలను అందించారు. తర్వాతి కాలంలో మహీధర నళినీమోహనరావు వంటి రచయితలు కూడా పిల్లల కోసం విరివిగా విజ్ఞాన సాహిత్యాన్ని వెలువరించారు.

హ్యారీపోటర్‌... బాల సాహిత్యంలో మైలురాయి
ప్రపంచ బాలసాహిత్యంలో హ్యారీపోటర్‌ ఒక మైలురాయి. బాలసాహిత్యానికి ఆదరణ తగ్గుముఖం పడుతున్న దశలో బ్రిటిష్‌ రచయిత్రి జె.కె.రౌలింగ్‌ తన కలాన్నే మంత్రదండంగా చేసుకుని ‘హ్యారీపోటర్‌’ నవలల సిరీస్‌ను వెలువరించారు. అద్భుతరస ప్రధానంగా సాగే ‘హ్యారీపోటర్‌’ సిరీస్‌ పుస్తకాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.

 ప్రపంచవ్యాప్తంగా 67 భాషల్లోకి అనువాదం పొందిన ‘హ్యారీపోటర్‌’ పుస్తకాలు దాదాపు 40 కోట్లకు పైగానే అమ్ముడై రచయిత్రికి, ప్రచురణకర్తలకు కాసుల వర్షం కురిపించడమే కాదు, బాలసాహిత్యానికి మళ్లీ బంగారు రోజులు మొదలయ్యాయనే భరోసా కలిగించాయి. హ్యారీపోటర్‌కు ముందు కొన్ని దశాబ్దాల కిందట పాశ్చాత్య ప్రపంచంలో బాలసాహిత్యం విరివిగానే వచ్చేది. అమెరికా, యూరోప్‌లలో పిల్లల పుస్తకాలకు మంచి ఆదరణ ఉండేది.

 ఫ్రెంచి రచయిత ఆంటోనీ డి సెయింట్‌ ఎక్సుపెరీ రాసిన ‘లె పెటైట్‌ ప్రిన్స్‌(ది లిటిల్‌ ప్రిన్స్‌)’(1943) వివిధ భాషల్లోకి అనువాదం పొంది, తొలితరం పిల్లల పుస్తకాల్లోని బెస్ట్‌సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. పాశ్చాత్య దేశాల్లో కామిక్‌ బుక్స్‌ కూడా బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మొదలైన కామిక్‌ బుక్స్‌ ప్రచురణ అనతికాలంలోనే భారీస్థాయిలో విస్తరించింది. అనితర సాధ్యమైన సాహస విన్యాసాలతో ఆకట్టుకునే సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, కెప్టెన్‌ అమెరికా వంటి కామిక్‌ హీరోలకు దేశదేశాల్లోని చిచ్చరపిడుగులందరూ అభిమానులుగా మారారు.

ఇక మనదేశంలో ‘అమర్‌ చిత్రకథ’ కామిక్స్‌ కూడా విశేష పాఠకాదరణ పొందాయి. పురాణాలు, చారిత్రక గాథలు, బహుళ ప్రచారంలో హాస్యకథలు, నీతికథలు వంటి వాటిని సరళమైన ఇంగ్లిష్‌లో కామిక్స్‌గా వెలువరించిన ‘అమర్‌ చిత్రకథ’ పుస్తకాలు చాలామంది పిల్లలను పుస్తకపఠనం వైపు మళ్లించాయి. ‘అమర్‌ చిత్రకథ’ పుస్తకాలే చిన్నప్పుడు తనకు చాలా స్ఫూర్తినిచ్చాయని ప్రముఖ దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం.

డిజిటల్‌ మాయాజాలంలో బాల్యం
కేబుల్‌ టీవీలు, ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పిల్లలు డిజిటల్‌ మాయాజాలంలో చిక్కుకున్నారు. వినోదం కోసం, విజ్ఞానం కోసం పుస్తకాలు చదివే అలవాటుకు పిల్లలు పూర్తిగా దూరం కాకపోయినా, ఆ అలవాటు మాత్రం తగ్గుముఖం పడుతోందనేది వాస్తవం.

 బ్రిటన్‌కు చెందిన ‘స్కాలస్టిక్‌’ ద్వైవార్షిక పత్రిక గత ఏడాది విడుదల చేసిన సర్వే ఫలితాలలో వినోద, విజ్ఞానాల కోసం పుస్తకాలు చదివే అలవాటుకు పిల్లలు దూరమవుతున్నట్లు తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 2010 సంవత్సరంలో 37 శాతం మంది పిల్లలు వినోదం కోసం బాలసాహిత్యం చదివేవారు కాగా, 2016 నాటికి వీరి సంఖ్య 32 శాతానికి పడిపోయింది. మన దేశానికి సంబంధించి ఇలాంటి గణాంకాలేవీ అందుబాటులో లేవు. అయితే, డిజిటల్‌ మాయాజాలం మొదలైన తర్వాత మన దేశంలోనూ పిల్లలు పుస్తకాలకు దూరమవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 ఒకవైపు స్కూళ్లలో చదువుల ఒత్తిడి మితిమీరి పెరుగుతుండటం వల్ల కూడా పిల్లలకు వినోదం కోసం పుస్తకాలు చదివేటంత తీరిక లభించడం లేదని చాలామంది తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో స్టోరీ టెల్లింగ్‌ యాప్స్‌ వస్తున్నాయి. వాటికి ఆదరణ కూడా లభిస్తోంది. కనీసం ఈ రకంగానైనా పిల్లలు మళ్లీ బాలసాహిత్యంవైపు మొగ్గుచూపుతారని ఆశిద్దాం.

సకల గుణాభిరాముడు
ఆయన మానవుడిగా పుట్టిన దేవుడు. ఆ మానవుడే దేవుడిగా పూజలందుకున్న రాముడయ్యాడు. సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. శౌర్యపరాక్రమాలలో సాటిరాగలవాడెవ్వడూ ేæడనిపించుకున్నాడు. తండ్రి మాట జవదాటలేదు అబద్ధం ఆడలేదెన్నడూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. మిత్రులను ప్రాణంగా చూసుకున్నాడు. శత్రువులను చీల్చి చెండాడాడు. శరణ మన్నవారికి అభయమిచ్చాడు. ఆదుకున్నాడు.  భార్యను ఎంతగా ప్రేమించాలో, సోదరులకు ఎంతగా అనురాగం పంచాలో, తల్లిదండ్రులను ఎంతగా గౌరవించాలో అన్నింటినీ అ„ý రాలా పాటించాడు. రాజుని అనే దర్పాన్ని, అధికారాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు.శీలసంపదను కాపాడుకున్నాడు.

తన మాటను ప్రజలు వినడం కాదు.. తానే ప్రజల మాటను విన్నాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగుపాదాలా నడిచింది. ఇన్ని సుగుణాలున్నాయి కనుకనే ఆయన సుగుణాభిరాముడయ్యాడు. ప్రజలు ఆయనను దేవుడిగా గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. కథలు కథలుగా చెప్పుకుని తరిస్తున్నారు.

మరిన్ని వార్తలు