రియల్ రియాలిటీ షోస్

2 Nov, 2014 00:59 IST|Sakshi
రియల్ రియాలిటీ షోస్

టీవీక్షణం: టీవీ వినోదం కోసమూ, విజ్ఞానం కోసమూ ఉందనుకుంటాం మనం. కానీ అది సమస్యల్ని కూడా పరిష్కరిస్తుందని తెలుసా?! కొన్ని చానెళ్లు సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రియాలిటీ షోలను రూపొందించాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపేందుకు నడుం కట్టాయి. అలాంటి ప్రతి షో విజయం సాధించింది. ఎందుకంటే... సమస్య లేని మనిషి ఉండడు కాబట్టి! సమస్య అంటూ ఉన్న తర్వాత పరిష్కారం కావాలి కాబట్టి!
 
 బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ ఓ సంచలనం. సమాజంలోని పలు సమస్యలను వెలికి తీసి, ఆ సమస్య బాధితులందరినీ ఒక వేదిక మీదికి తెచ్చి, సమస్య మూలాల్లోకి వెళ్లి కూలంకషంగా చర్చించి, చివరికి దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది ఈ ప్రోగ్రామ్. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ గొప్ప విషయం ఏమిటంటే... ఆమిర్‌ఖాన్ తన షో ద్వారా చూపించిన పరిష్కారాలను నాయకులు, అధికారులు అమలు చేస్తున్నారు!
 
 ఈ విధంగా సామాజిక సమస్యల మీద ఎలుగెత్తే కార్యక్రమాలు అరుదు. మొదట్లో కొన్ని ఇంగ్లిష్ చానెళ్లు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా, అవి న్యాయపరమైన సమస్యల చుట్టూనే ఎక్కువ తిరిగాయి. కోర్ట్ రూమ్, ఫేమస్ జ్యూరీ ట్రయల్స్, యువర్ విట్‌నెస్, గుడ్‌విల్ కోర్ట్ అంటూ పలు రకాల ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యాయి. అదే మన దేశంలో అయితే కుటుంబ సమస్యల ఆధారంగా తీసినవే ఎక్కువ. కలర్స్ చానెల్ వారు బాంధవ్యాల మధ్య వచ్చే వైరుధ్యాలను రూపుమాపేందుకు పెట్టిన షో ‘ఆమ్నా సామ్నా’. సమస్యల వెనుక కారణాలను అన్వేషించి, పరిష్కారాలను చూపెట్టేవారు. అవసరమైతే వైద్య, న్యాయ, చట్ట పరమైన సహకారాన్ని కూడా అందించేవారు. జీ తెలుగువారు ప్రసారం చేసిన ‘బతుకు జట్కా బండి’ కూడా ఇటువంటిదే. సుమలత హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. తెలుగు రియాలిటీ షోలలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.  సున్నితమైన సమస్యలను సుతిమెత్తగా డీల్ చేసిన విధానం ఆ షోకి అవార్డుల పంటను పండించింది.
 
 స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘ఆప్‌కీ కచేరీ’ని కిరణ్‌బేడీ నిర్వహించడంతో... అక్కడికి వెళ్తే సమస్య తీరుతుందన్న విశ్వాసం అందరిలో పెరిగింది. జీ తమిళ్ చానెల్ వారి ‘సొల్వతెల్లమై ఉన్నమై’ కూడా మంచి విజయం సాధించింది. నటి లక్ష్మీ రామకృష్ణన్ పక్షపాతం లేకుండా, నిజానిజాలను అంచనావేస్తూ, న్యాయబద్దంగా షోని నిర్వహించారు. తమ సమస్యల్ని కూడా పరిష్కరించమంటూ రోజుకు దాదాపు రెండు వేలమంది ఆ చానెల్ ఆఫీసుకు ఫోన్ చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు... ఆ షో ఎంతగా అందరి మనసులనూ చూరగొందో!
 
 అయితే ఈ కార్యక్రమాలు చూసేటప్పుడు ప్రేక్షకులకు చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది... పార్టిసిపెంట్స్ నిజంగా బాధితులేనా లేక కల్పిత పాత్రలా అని! నిజానికి కొన్ని షోలలో బాధితులు నిజమైనవారే అయినా, కొన్నింటిలో మాత్రం విచారణ వెనుక సాగించి, ఆ మొత్తం వ్యవహారాన్నీ నటులతో చిత్రించి, వాటిని ప్రసారం చేస్తుంటారు. బాధితుల గురించి అందరికీ తెలియడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఇలా చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా... ఇలాంటి షోల వల్ల ఎందరి సమస్యలకో పరిష్కారం దొరుకుతున్నట్లు అవుతోంది. తాము వేయాల్సిన అడుగు ఏమిటో అర్థమవుతోంది. అందుకే నిజ సమస్యల ఆధారంగా తెరకెక్కిన ప్రతి షో విజయవంతమవుతోంది!

మరిన్ని వార్తలు