శయన హనుమానుడు... కోరికలు తీర్చే కరుణా సాగరుడు

20 May, 2017 23:35 IST|Sakshi
శయన హనుమానుడు... కోరికలు తీర్చే కరుణా సాగరుడు

బడే హనుమాన్‌ జీ మందిర్‌
నిలువెత్తు హనుమంతుడు నిలబడి ఉన్న విగ్రహాన్నే చూస్తాం ఎక్కడైనా ఆంజనేయస్వామి గుడి అంటే. లేదంటే రాములవారి పాదాల చెంత ఉన్న విగ్రహాన్ని చూడచ్చు. కానీ శయనించి ఉన్న హనుమంతుడు, ఆయనకు ఇరుపక్కలా రామలక్ష్మణులు, పాదాల చెంత రావణాసురుడు ఉన్న విగ్రహాన్ని ఎక్కడైనా చూడగలమా? అలాంటి అపురూపమైన శయన హనుమంతుని కళ్లనిండుగా చూసి, ఆ అద్భుతమైన రూపాన్ని గుండెలనిండా నింపుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ వెళ్లవలసిందే.

అలహాబాద్‌లోని సంగం వద్ద బడే హనుమాన్‌ జీ ఆలయం ఉంది. నిత్యం వందలాది మంది భక్తుల సందర్శనంతో కిటకిటలాడే ఈ ఆలయం ఎంతో పరిశుభ్రంగా, పరమ ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో, అడుగు పెట్టగానే అన్ని బాధలూ తీరిపోతాయన్న నమ్మకం కలిగేలా ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహాన్ని చూడటం కోసం మన కనులు అన్వేషణ మొదలు పెడతాయి.

అయితే ఆలయంలో ఒక నేలమాళిగ వంటి దానిలో స్వామి వారు శయనించి ఉన్న భంగిమలో సాక్షాత్కరిస్తారు. ఆయన ఛాతీకి ఇరువైపులా రామలక్ష్మణులు, పాదాల చెంత రావణాసురుడు కనిపిస్తారు. అలసటతో గాఢనిద్దురలోకి చేరుకున్న స్వామి ఏ క్షణంలోనైనా కన్నులు విప్పారుస్తాడేమో అన్నట్లుగా ఉంటాడు. ఆయనకు నిద్రాభంగం కలుగకుండా ఆలయ అర్చకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పడుకుని ఉండగానే ఆయనకు నిత్యపూజలు, నివేదలర్పిస్తారు హారతులిస్తారు.

కోరిక కోర్కెలను తీర్చే బడే హనుమాన్‌జీ... భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చే పెద్ద హనుమంతుడిగా స్వామికి పేరు. అవివాహితులకు వివాహాన్ని, సంతానార్థులకు సంతానాన్ని, దీర్ఘరోగులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు స్వామి. జీవితంలో ఏవిధమైన కష్టాలు, నష్టాలు వచ్చినా స్వామిని సేవించుకుని సమస్యల నుంచి బయట పడుతుంటారు భక్తులు. అసలు ఆలయంలోకి అడుగు పెట్టగానే  సానుకూల తరంగాలు శరీరాన్ని తాకుతాయి.

స్థలపురాణం: రావణాసురుడి పినతండ్రి కొడుకు, మహా మాయావి అయిన మైరావణుడు ఆంజనేయుడి కన్నుగప్పి రామలక్ష్మణులను అపహరించి వారిని పాతాళంలో దాచిపెడతాడు. వారికోసం అన్వేషిస్తూ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయి ఏమి చేయాలో పాలుపోక అలాగే పడుకుని ఉన్న ఆంజనేయుడి వద్దకు గంగమ్మ వచ్చి తన పావన స్పర్శతో అలసట పోగొడుతుంది. తేరుకున్న హనుమ గంగమ్మకు  నమస్కరిస్తాడు. అప్పుడు గంగ హనుమా! నీవు ఇక్కడే, ఇదే ఇక్కడే వెలిసి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉండు’’ అని కోరింది.

మరో కథనం ప్రకారం రావణ వధానంతరం రామలక్ష్మణులు హనుమంతుడితో కలసి అయోధ్యకి వెళుతుంటారు. మార్గమధ్యంలో తీవ్రమైన దప్పికతో హనుమ అల్లల్లాడు తుండటాన్ని చూసిన రామలక్ష్మణులు సంగమస్థానం వద్ద విమానాన్ని నిలుపు చేస్తారు. గంగనీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న హనుమ అక్కడే కాసేపు శయనిస్తాడు. అదే భంగిమలో ఇక్కడ వెలిశాడు. గంగానది ప్రతి రెండేళ్లకోసారి ఆలయంలో ప్రవేశిస్తుంది. దాంతో హనుమంతుని విగ్రహం జలనిక్షిప్తం అవుతుంది. ఆ సమయంలో మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో విగ్రహానికి పూజాదికాలు నిర్వహిస్తారు.

ఇతర సందర్శనీయ స్థలాలు: బడేహనుమాన్‌ జీ మందిరాన్ని సందర్శించేవారు అలహాబాద్‌లోనే గల సంకట మోచన్‌ హనుమాన్‌ మందిరానికి కూడా వెళ్లడం ఆనవాయితీ. అన్నింటికన్నా ముందు సకల పాపాలూ హరించే త్రివేణీ సంగమంలో స్నానం చేయడం గొప్ప అనుభూతి.

అలహాబాద్‌లో గల ఆనంద భవన్, ఆల్‌ సెయింట్స్‌ కాథడ్రల్, ఖుశ్రో బాగ్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పార్క్, న్యూ యమునా బ్రిడ్జ్, అలహాబాద్‌ యూనివర్శిటీ, అలహాబాద్‌ మ్యూజియం, వేణి మాధవుని ఆలయం, అలోపి దేవి మందిరం, అలహాబాద్‌ హై కోర్టు, మాంకామేశ్వర్‌ టెంపుల్, కల్యాణి దేవి టెంపుల్, అక్షయ వట్, లలితా దేవి మందిరం, పాతాళపురి మందిరాలను కూడా సందర్శించవచ్చు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

ఎలా వెళ్లాలంటే..
బడే హనుమాన్‌ జీ మందిరానికి వెళ్లాలంటే ముందుగా అలహాబాద్‌ వెళ్లాలి. దేశంలోని ఇంచుమించు అన్ని ప్రధాన నగరాలనుంచి అలహాబాద్‌కు రైళ్లున్నాయి. అక్కడినుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో గల బడే హనుమాన్‌ జీ మందిరానికి వెళ్లడం చాలా సులువు. అలహాబాద్‌లో అన్ని తరగతుల వారికీ సరిపడే హోటళ్లున్నాయి. సత్రాలున్నాయి
కాబట్టి భోజన వసతి సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

మరిన్ని వార్తలు