వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!

5 Nov, 2023 12:11 IST|Sakshi

స్పష్టత లేని ప్రతి ఆధారం.. సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. అలాంటి అంతుబట్టిన ఆనవాళ్లు.. అంతుచిక్కని ఆకారాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అందులో ‘బోలాస్‌ డి పిడ్రా’ హిస్టరీ ఒకటి.

బోలాస్‌ డి పిడ్రా అంటే ‘అక్షరాలా రాతి బంతులు’ అని అర్థం. కోస్టారికా అనేక రహస్యాలకు అసలైన స్థావరం. ఈ దేశం.. సముద్రతీరాలకు, విశాలమైన వర్షారణ్యాలకు, జలపాతాలకు, అగ్నిపర్వతాలకు ఉనికిపట్టే కాదు, ఎన్నో మిస్టరీల సొత్తు. ‘యునైటెడ్‌ ఫ్రూట్‌’ అనే ఓ కంపెనీ.. 1930లో కోస్టారికా అటవీ ప్రాంతాన్ని కొంతభాగం శుభ్రపరచి.. అరటి తోటలు వేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో కొందరు కూలీలకు ఆ కాంట్రాక్ట్‌ని అప్పగించింది. అయితే కూలీలు చెట్లను కొట్టి.. చెత్తను శుభ్రపరుస్తున్న క్రమంలో పెద్ద పెద్ద గుండ్రాళ్లను కనుగొన్నారు.

నున్నగా గోళాకారంలో ఉన్న ఆ రాళ్లు ఒక్కొక్కటీ ఒక్కో పరిమాణంలో బయటపడ్డాయి. అవేంటో అర్థంకాని కొందరు కూలీలు.. ఆ పరిసరాలను మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే కొన్ని వందల సంఖ్యలో ఈ గోళాలు బయటపడ్డాయి. అయితే వాటిని స్థానికులు దేవుడు రాళ్లుగా భావించి పూజించడం మొదలుపెడితే.. కొందరుమాత్రం ఆ గోళాల్లో విలువైన బంగారం ఉంటుందనే పుకార్లను నమ్మి పగలగొట్టే పనిలో పడ్డారు. అయితే పగలగొట్టిన ఏ రాయిలోనూ ఒక్క విలువైన వస్తువూ దొరకలేదు. కానీ దొరికిన ప్రతి గోళం టన్నుల బరువుతో వింతగా తోచింది. కొన్నాళ్లకు ఆ నోటా ఈ నోటా సమాచారం అందటంతో ఈ రాళ్లపై దృష్టిసారించారు పురావస్తు శాఖవారు.

కొన్ని.. సెంటీ మీటర్ల పరిమాణంలో ఉంటే.. ఇంకొన్ని అడుగుల ఎత్తులో ఉన్నాయి. పెద్దపెద్ద గోళాలు.. సుమారు 6 అడుగుల కంటే ఎక్కువ వ్యాసార్ధంతో.. 15 టన్నుల బరువుతో కదిలించడానికి కష్టంగా ఉంటే.. కొన్ని అందులో సగం పరిమాణంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇవి తయారు చేసిన రాళ్లలా ఉన్నాయని కొందరు సైంటిస్టులు ఊహించారు. అవి  మానవ నిర్మితమా? కాదా? వాటి వెనుక ఉన్న కథేంటీ? అసలు ఎందుకు వాటిని ఒకే చోట ఉంచారు? వాటిని రూపొందించడంలో ఉన్న ఉద్దేశం ఏంటీ? వంటి సందేహాలన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. 

అయితే కొందరు పరిశోధకులు మాత్రం.. వాటిని క్రీస్తుపూర్వం 800 నుంచి 1500 మధ్య తయారుచేసి ఉంటారని నమ్మారు. ఈ రాళ్ల ఉనికి చుట్టూ అనేక అనేక కథలు వినిపించసాగాయి. ఇవి ఎత్తైన చోటు నుంచి దొర్లుకుంటూ వచ్చాయని కొందరు, వాటిని ప్రకృతే సృష్టించిందని మరికొందరు భావించారు. రాతి గోళాలు ‘తారా ఫిరంగి బంతులు’ అని స్థానిక పురాణం చెప్పుకొచ్చింది. గాడ్‌ ఆఫ్‌ థండర్‌.. గాలీ, తుఫానులను తరిమి కొట్టాడానికి బ్లోపైప్‌ సాయంతో ఈ బంతులను వినియోగించాడని చెప్పగా.. సౌరకుటుంబాన్ని ఊహాత్మకంగా ఈ గోళాలతో రూపొందించి ఉండొచ్చని, ఖగోళ పరిశీలనలు చేయడానికి లేదా దిక్సూచిగా ఉపయోగించుకోవడానికి వీటిని రూపొందించి ఉంటారని చాలామంది నమ్మారు.

ఈ రాళ్ల విషయంలో ఊహలు, నమ్మకాలు తప్ప సరైన సాక్ష్యాధారాలు లేవు. నిజానికి కూలీలు వీటిని కనుగొన్నప్పుడు.. ఉన్నచోట నుంచి తొలగించి మరోచోటకు మళ్లించినప్పుడు.. వాటి అసలు స్థానాలపై పరిశోధకులకు స్పష్టత లేకపోవడం కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోవడానికి ఒక కారణం. ఈ గోళాలను జాతీయ చిహ్నాలుగా.. కోస్టారికా సంస్కృతిలో భాగంగా పరిగణించారు. అందుకే ఇవి ప్రభుత్వ కార్యాలయాల్లో అలంకరణలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ మిస్టరీ గోళాలు.. చాలా వరకు అమెరికన్‌ మ్యూజియమ్స్‌లో దర్శనమిస్తుంటే.. కొన్ని వాగుల్లో, తీరాల్లో పర్యాటకులను అలరిస్తున్నాయి. 
సంహిత నిమ్మన 

(చదవండి: అద్భుతమైన డెవిల్స్‌ బ్రిడ్జ్‌! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!)

మరిన్ని వార్తలు