ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోకూడదా? ప్రమాదమా?

5 Nov, 2023 12:32 IST|Sakshi

 ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా?
– సి. వెంకటలక్ష్మి, బిచ్‌కుంద

ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్‌ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్‌ టైప్, తీవ్రతను బట్టి పెయిన్‌ స్కేల్‌ అసెస్‌మెంట్‌తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్‌ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్‌ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac  లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు.

ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్‌(డోలో, కాల్‌పాల్, క్రోసిన్‌) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్‌ ఉన్నప్పుడు డీప్‌ బ్రీతింగ్‌ టెక్నిక్స్, వేడి, ఐస్‌ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్‌ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్‌ కిల్లర్స్‌ అంటే  Morphine, Tramadol లాంటివి సూచిస్తారు.

లేబర్‌ పెయిన్‌ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్‌ పెయిన్‌ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్‌ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్‌ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.   
డాక్టర్‌ భావన కాసు గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?)

మరిన్ని వార్తలు