సజ్జన సాంగత్యం

10 Dec, 2017 00:18 IST|Sakshi

 పురానీతి

ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి విశ్వామిత్రుడు వచ్చి ఆదిశేషుడిని తనతో రమ్మన్నాడు. ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో ‘‘ఓ మహర్షీ! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరిస్తే, ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తథ్యం. అప్పుడు కోటానుకోట్ల జీవరాశులు నా మూలంగా నాశనమైపోతాయి’’ అన్నాడు.ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి ‘‘అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్శక్తితో దానిని ఆపుతాను’’ అన్నాడు.ఆదిశేషుడు అందుకు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయాడు. ఆదిశేషుడు భయపడి చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఆదిశేషుని వేయిపడగలపై భద్రంగా వున్న భూగోళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.

జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఃఖంతో ఆదిశేషుడు మాన్పడిపోగా, తప్పశ్శక్తి సంపన్నుడనన్న గర్వంతో విశ్వామిత్రుడు తన కమండలంలోని నీరు ధారపోసి ‘ఆగు’ అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భూగోళ పతనం ఆగకపోగా, మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో ‘‘నా తపశ్శక్తి అంతా ధారపోస్తున్నాను, వెంటనే ఆగు’’ అంటూ ఆజ్ఞాపించాడు. అయినా ఫలితం లేకపోయింది.దాంతో విశ్వామిత్రునికి అహంకార మైకం తొలగిపోయింది. భూమిని ఆపడానికి తన తపశ్శక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని ‘‘నీవు ఎప్పుడైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపోయి. భూపతనం ఆగిపోతుంది’’ అని చెప్పాడు.విశ్వామిత్రుడు ఆలోచనలో పడ్డాడు. తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు. సాటి ముని పుంగవులతోనూ తగవులే. సత్సంగం చేసింది లేదు. అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆదిశేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తలకు ఎత్తుకున్నాడు.మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు