శతాబ్దాల సబ్బు

21 Feb, 2016 16:14 IST|Sakshi
శతాబ్దాల సబ్బు

ఫ్లాష్‌బ్యాక్
ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా రకరకాల సబ్బులను ఉపయోగిస్తున్నాం మనం. మన దేశంలో ఒకప్పుడు సబ్బుల వాడుక చాలా తక్కువ. పాశ్చాత్య వలస పాలకుల ద్వారానే ఇవి మనకు పరిచయమయ్యాయి. అలాగని సబ్బు ఆధునిక ఆవిష్కరణేమీ కాదు. క్రీస్తుపూర్వం నుంచే సబ్బు వంటి పదార్థాలు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన బాబిలోనియన్ ప్రజలు క్రీస్తుపూర్వం 2800 ఏళ్ల కిందటే సబ్బు వంటి పదార్థాన్ని వాడేవారు.

నీరు, క్షార పదార్థం, కాసియా నూనెలతో సబ్బు వంటి పదార్థాన్ని తయారు చేసే ఫార్ములా రాసి ఉన్న బాబిలోనియన్ల రాతి పలక ఒకటి తవ్వకాల్లో బయటపడింది. అది క్రీస్తుపూర్వం 2200 ఏళ్ల నాటిదని పరిశోధకులు అంచనా వేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు సైతం క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో  క్షార పదార్థాలు, శాకాహార నూనెలు, జంతువుల కొవ్వులు ఉపయోగించి సబ్బువంటి పదార్థాన్ని తయారు చేసేవారు. అప్పట్లో చైనా వారు సబ్బుల తయారీలో నూనెలు, కొవ్వులు, క్షారాలతో పాటు మూలికలను కూడా వాడేవారు.

క్రీస్తుశకం పదమూడో శతాబ్ది నాటికి పశ్చిమాసియా ప్రాంతంలో సబ్బుల తయారీ కుటీర పరిశ్రమ స్థాయికి ఎదిగింది. పదిహేనో శతాబ్ది ద్వితీయార్ధం నాటికి ఫ్రాన్స్‌లో సబ్బుల తయారీ పరిశ్రమ బాగా పుంజుకుంది. అయితే, పారిశ్రామిక విప్లవానికి ముందు సబ్బుల పరిశ్రమలు అక్కడక్కడా ఉన్నా, వాటి ఉత్పత్తి పరిమితంగానే ఉండేది.

పారిశ్రామిక విప్లవం తర్వాత 19వ శతాబ్దిలో పలు పరిశ్రమలు భారీస్థాయిలో సబ్బుల తయారీ ప్రారంభించాయి. అప్పటి నుంచే రకరకాల ఆకారాలు, రంగులు, పరిమళాలతో ఆకర్షణీయమైన ప్యాకింగులతో బ్రాండెడ్ సబ్బులు మార్కెట్‌ను ముంచెత్తడం మొదలైంది. విస్తృత వ్యాపార ప్రచారం కూడా తోడవడంతో సబ్బుల వాడుక వెనుకబడిన దేశాలకూ పాకింది.

మరిన్ని వార్తలు