బతుకు ‘పూల’బాట | Sakshi
Sakshi News home page

బతుకు ‘పూల’బాట

Published Sun, Feb 21 2016 1:26 PM

బతుకు ‘పూల’బాట - Sakshi

వాడిన పూలు వికసిస్తాయో లేదో గానీ, వాటితోనే బతుకును ‘పూల’బాటగా మార్చుకున్నారు ఆ ఇద్దరు మిత్రులు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉండే అంకిత్ అగ్రవాల్, కరణ్ రస్తోగీ బాల్యమిత్రులు. గంగానది దగ్గర్లోనే ఉండటంతో చిన్నప్పటి నుంచి నది ఒడ్డున ఆటలాడుతూ పెరిగారు. ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో పూజలు, ప్రార్థనల్లో ఉపయోగించిన తర్వాత వాడిపోయిన పూలను జనాలు ఇష్టానుసారం గంగానదిలో పారేస్తూ ఉండటాన్ని చిన్నప్పటి నుంచీ చూశారు. ఊహ తెలిశాక దేశంలో పలు ప్రదేశాలను సందర్శించారు.

ఎక్కడ చూసినా వాడిపోయిన పూలను నదుల్లో, చెరువుల్లో పడేసి నీటిని కలుషితం చేస్తుండటాన్ని గమనించారు. ఇద్దరూ కూడబలుక్కుని ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని కోసం ముందుగా పూల వినియోగంపై క్షుణ్ణంగా సమాచారం సేకరించారు. దేశవ్యాప్తంగా ఏటా 80 లక్షల టన్నులకు పైగా వాడేసిన పూలను నదులు, చెరువులు, ఇతర జలాశయాల్లో పారవేస్తున్నట్లు తెలుసుకున్నారు.

వాడేసిన పూలతో పనికొచ్చేలా ఏదైనా చేయాలనుకుని 2012 నుంచి ప్రారంభించిన వారి ప్రయత్నాలు... 2014 నాటికి ఒక కొలిక్కి వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఆలయాలకు వెళ్లి, అక్కడ పారేసిన వాడిన పూలను, వాటి వ్యర్థాలను తరలించుకు రావడం ప్రారంభించారు. అప్పట్లో కర్మాగారం లేకపోవడంతో రోజుకు ఐదువందల కిలోల వరకు మాత్రమే సేకరించేవారు. బాగా వాడిపోయిన పూలను ఆవుపేడలో కలిపి ఎరువుగా తయారు చేసి విక్రయించేవారు.

దీని తయారీలో వాడేసిన కాఫీ పొడి వంటి పదార్థాలూ కలిపేవారు. త్వరలోనే చిన్న కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకుని, వాడేసిన పూలతో అగరొత్తుల తయారీని కూడా ప్రారంభించారు. ఈ అగరొత్తులు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కర్మాగారంలో వీరు దాదాపు వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

Advertisement
Advertisement