బలిపశువు

28 Jan, 2018 00:56 IST|Sakshi

ఈవారం కథ

‘‘నమస్కారం సార్‌’’ అన్న పిలుపుతో న్యూస్‌ పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా ఇరవై ఏళ్ల కుర్రాడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఎగాదిగా చూసి ఏమిటన్నట్లుగా తలెగరేశాను. ‘‘పనేదైనా ఉంటే ఇప్పించండి సార్‌! చాలాదూరం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. పదో తరగతి వరకూ చదివా. మా ఊర్లో పంటలు లేక పనులు లేక కరువు వచ్చి ఇట్లా వచ్చాను సార్‌..’’ గడగడా అప్పజెప్పేశాడు. ‘‘ఇప్పుడు అన్‌సీజన్‌. పనులేవీ లేవు కదయ్యా!’’ అని నేను అంటుండగానే, ‘‘సార్సార్‌ నాతో పాటు ఊర్లో అమ్మ, నాన్న, తమ్ముడు బతకాలి. మీరేం పని చెప్పినా చేస్తా’’ అంటూ ప్రాధేయపడ్డాడు. మొన్నరాత్రి ఒక పనిగురించి యాదగిరి నావద్దకు వచ్చి వెళ్లిన సంగతి గుర్తుకువచ్చింది. మరొకమారు వాడిని తేరిపార చూశాను. పనికొచ్చేటట్లే ఉన్నాడనిపించింది. ‘‘ఏం పేరు నీది?’’ అడిగాను. పని దొరికిందనుకున్నాడో ఏమో వాడి ముఖం ఒక్కసారి వెలిగిపోయింది. ‘‘నా పేరు కురుమూర్తి సార్‌. పాలమూరు పక్క పల్లె సార్‌ మాది’’ అన్నాడు వాడు. ‘‘ప్రస్తుతానికి పనులేవీ లేవు. నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నా. వంటమనిషి ఊరెళ్లాడు. వాడు వచ్చేవరకూ ఇంట్లో పనులు చూసుకో’’ అని చెప్పి మళ్లీ పేపర్లో తల దూర్చాను. మంచి హుషారైన కుర్రాడి మాదిరి ఉన్నాడు. చేతి సంచి మూల ఉంచి చీపురు అందుకొని వెంటనే పనిలోకి దిగిపోయాడు. లేబరు కాంట్రాక్టరుగా గత ఐదారు సంవత్సరాలనుండి శ్రీశైలం అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో ఉంటున్నాను. ఫారెస్టులో రోడ్లు వెయ్యడానికి, చెక్‌ డ్యాములు కట్టడానికి, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడానికి, కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నన్ను కలుస్తుంటారు. వాళ్లకు తగిన పనివాళ్లను సప్లై చేయడం నా పని. ఇక్కడి గిరిజనుల్లో నాకు మంచి పరిచయాలున్నాయి కాబట్టి పనులకు మనుషులను పంపడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్లు నిరక్ష్యరాస్యులు. కూలీగా ఎంత ఇస్తే అంత కళ్లకద్దుకొని మరీ తీసుకుపోతారు. అందువల్ల నా సంపాదన బాగానే ఉంటున్నది.

మొన్నరాత్రి యాదగిరి చెప్పిన పనిగురించే ఆలోచిస్తూ ఉన్నాను. డబ్బు కూడా బాగానే ముట్టేటట్లుంది. ఎటొచ్చీ చేద్దామా, వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. వీడ్ని చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించి పనిలోకి దిగుదామని నిర్ణయించుకున్నాను. వెంటనే మనిషిచేత నా సమ్మతి తెలియజేస్తూ యాదగిరికి కబురంపాను. ఒక నెలరోజులు గడిచాయి. అనుకున్నరోజు మనిషి వచ్చి అడ్వాన్సు ఇచ్చి ఆరోజు రాత్రి చేయవలసిన పనిగురించి వివరంగా చెప్పి వెళ్లిపోయాడు. కురుమూర్తిని పిలిచాను. ‘‘ఇదిగో నీ నెల జీతం. వెంటనే ఇంటికి మనీయార్డరు చేసి రాత్రికి రెడీగా ఉండు. అడవిలో కొంచెం పని ఉంది. వెళ్లి వద్దాం’’ అని అడ్వాన్సుగా ఇచ్చిన కట్టలో కొన్ని నోట్లు తీసి అందించాను. అంత డబ్బు ఇస్తానని ఊహించనివాడు కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాడు. ‘‘ఊ! తీసుకో. రాత్రికి స్పెషల్‌ భోజనం ఇద్దరికీ చెయ్యి..’’ అనగానే ‘‘అట్లాగే సార్‌’’ అని నోట్లందుకొని సంబరపడిపోతూ దండం పెట్టి వెళ్లిపోయాడు. రాత్రి పదిన్నర కావస్తున్నది. అమావాస్య చీకటి. మోటార్‌ సైకిల్‌ మీద కురుమూర్తిని ఎక్కించుకొని బయలుదేరాను. పదికిలోమీటర్లు మెయిన్‌ రోడ్డు మీద ప్రయాణించి తరువాత ఫారెస్టులోని డొంక రోడ్లోకి తిప్పాను. బాటకిరువైపులా ముళ్ల పొదలు. కొంచెం పక్కకి పోయినా పంక్చరు పడ్డం ఖాయం. అలవాటైన దోవ కాబట్టి జంకు లేకుండా ముందుకుపోతున్నాను. వెనుక కురుమూర్తి మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు. బయలుదేరేముందు నాతోపాటే భోజనం చెయ్యమన్నాను. నేను వేసుకునే లాల్చీ పైజామా ఒక జత ఇచ్చి వేసుకొనమన్నాను. మొహమాటపడుతూనే వేసుకొని తయారయ్యాడు. దోవలో వాడి అమ్మా నాన్నల గురించి, తమ్ముడి గురించి, మధ్యలో నా మంచితనం గురించి పొగుడుతూ చాలాసేపు చెప్పాడు. 
‘‘ఇంకా  ఎంతదూరం పోవాలి సార్‌’’ మాటల మధ్యలో అన్నాడు వాడు. 

‘‘ఇదుగో వచ్చేశాం. ఆ కనబడే మంట దగ్గరకే’’ అన్నాను. ఒక వంద గజాల దూరంలోనే బండి ఆపి ఇద్దరం తుప్పల్ని, పొదలను తప్పుకుంటూ మెల్లగా అక్కడికి చేరుకున్నాం. దూరంనించి మంట చిన్నదిగానే కనిపించినా, దగ్గరికి వెళ్లేసరికి చాలా పెద్ద సైజులో మండుతున్నది. పక్కనే పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టు. కింద పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసిన పెద్ద పీట, పెద్ద సైజు చెక్కమొద్దు, ఇంకా పూలు, నిమ్మకాయలు తదితర పూజా ద్రవ్యాలు ఉన్నాయి. మంట ఎదురుగా బుర్రమీసాలు, నిలువు బొట్టు, ఎర్రటి పంచెకట్టు, బానపొట్ట భుజంపైన తెల్లకండువాతో భయంకరమైన మనిషి కళ్లుమూసుకు కూర్చొని మంత్రాలు బిగ్గరగా జపిస్తున్నాడు. మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్లేసరికి యాదగిరి ఎదురొచ్చాడు. ‘‘రా అన్నా! అంతా రెడీయేనా?’’ అన్నాడు, కురుమూర్తిని ఎగాదిగా చూస్తూ. ‘‘సరిగ్గా టైముకు వచ్చామా?’’ అడిగాను వాచీని మంట వెలుగులో చూసుకుంటూ. ‘‘ఆ! అయిపోవచ్చింది. కాసేపు కూర్చోండి..’’ అని ఒక బండ చూపించి వెనక్కు వెళ్లిపోయాడు. ‘‘కూర్చోవోయ్‌’’ అని కురుమూర్తికి చెప్పి బండమీద ఊది చతికిలబడ్డాను. వాడు కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడి జరిగే తంతుని ఆసక్తిగా గమనిస్తున్నాడు. 

ఈ యాదగిరి నాకు రెండు నెల్ల క్రితమే పరిచయమయ్యాడు. పని గురించి మొదట మాట్లాడింది, తరువాత అడ్వాన్సు ఇచ్చి వెళ్లిందీ ఇతనే. మొదట్లో ఈ పని నావల్ల కాదు అని చెప్పినా రేటు పెంచి నా చేత ఒప్పించాడు. మంచి పట్టుదల మనిషి. పని ఏ విధంగానైనా చేయించి సాధించాలనే టైపు వ్యక్తి. ఇంతలో ఏవో మాటలు విన్పించడంతో అటు చూశాను. చీకట్లో గమనించలేదు కానీ అక్కడ ఇంకా ఇద్దరు మనుషులు ఉన్నారు. యాదగిరి వాళ్లతో ఏదో మాట్లాడుతూ మళ్లీ మావైపొచ్చాడు. వాళ్లు చేతులు కట్టుకుని అతణ్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మావద్దకి వచ్చేటప్పటికి మాటలు ఆపేశారు. అపుడు గమనించాను వాళ్లని. క్రూరమృగాల మాదిరి పచ్చిరక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు. కట్‌ బనియన్‌ ధరించి అడ్డు పంచలతో ఉన్నారు. మా సమీపానికి వచ్చేసరికి బ్రాందీ వాసన గుప్పుమంది. ఇంతలో అగ్నిగుండం దగ్గరి మాంత్రికుడు నెమ్మదిగా కళ్లు తెరిచి మంటలోకి ఏవో రసాయనాలు చల్లి మరింత ప్రజ్వలింపజేశాడు. ఈసారి పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్యలో ఆపి, యాదగిరి వైపు తిరిగి ‘‘పశువు సిద్ధమేనా?’’ అని బిగ్గరగా అరిచాడు. యాదగిరి అతడి వద్దకు వడివడిగా వెళ్లి నెమ్మదిగా ఏదో మాట్లాడి, ఇటు తిరిగి తన మనుషులకు సైగ చేశాడు. వాళ్లు వెంటనే కురుమూర్తిపైకి ఉరికి పారిపోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు.

కురుమూర్తికి అప్పుడర్థమైనట్లుంది, పశువంటే ఎవరో. మరుక్షణమే వాళ్ల పట్టునుండి గింజుకుంటూ ‘‘బాబూ నన్ను వదలండి. సార్‌ వీళ్లను వదలమని చెప్పండి మీ కాల్మొక్కుతా. బుద్ధిలేక మీకాడ పనికొచ్చినా, మీ పని వద్దు, జీతం వద్దు. నన్నొదలండి. సార్‌ వదలమని చెప్పండి..’’ అని పెద్దగా ఏడుస్తూ అరవసాగాడు. యాదగిరి మనుషులు ఇవేమీ పట్టించుకోకుండా వాణ్ని మాంత్రికుడి దగ్గరకు ఈడ్చుకు వెళ్లారు. మాంత్రికుడు నిర్వికారంగా వాడి మొఖానికి పసుపు రాసి, కుంకుమతో నిలువుబొట్టు పెట్టి బలికి సిద్ధం చేయసాగాడు. ఈ మధ్యలో యాదగిరి నా వద్దకు వచ్చి ‘‘ఇదుగో అన్నా! బ్యాలెన్సు డబ్బు..’’ అని జేబునుండి తీసి నాకందించాడు. ‘‘ఇక నువ్వు వెళ్లే పనైతే పోవచ్చు..’’ అన్నాడు. నేను డబ్బు జేబులో వేసుకొని ఏమీ మాట్లాడకుండా అటువైపు చూడ్డం గమనించి ‘‘సరే భయం లేకపోతే కాసేపు ఉండివెళ్లు..’’ అని తిరిగి వెళ్లిపోయాడు. కురుమూర్తి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి గొంతు రాసిపోయింది. ‘‘అన్నా! నన్ను వదిలెయ్యి. దేవుడా రక్షించు. బాబూ నన్ను చంపొద్దు..’’ అని మాంత్రికుడికి దండం పెట్టి పెద్దగా విలపించసాగాడు. ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్న మాంత్రికుడు జోడించిన వాడి చేతులు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చేతులను విడదీసి పరిశీలించి పెద్దగా ‘‘ఒరేయ్‌ యాదగిరీ! వీడు బలికి పనికి రాడ్రా.. చూడు వీడి చేతికి ఆరు వేళ్లున్నై..’’ అని అరిచాడు.     

ఈలోపల నేను కూడా అటు దగ్గరగా వెళ్లి చూశాను. నిజమే వాడి కుడి చేతికి మాత్రం ఆరువేళ్లున్నాయి. యాదగిరి కూడా వచ్చి చూశాడు. ‘‘ముందే చూసుకొని రావొద్దా? మూర్ఖులారా? ఈ యాగం అసంపూర్తిగా ఆగిపోయిందో మీ కోర్కెల మాట అటుంచి సర్వం నాశనమైపోతారు జాగ్రత్త’’ అని రంకెలు వేయడం మొదలుపెట్టాడు. యాదగిరి ఖిన్నుడైపోయినట్లు కనిపించాడు. ఒక నిమిషం దీర్ఘంగా ఆలోచించి మాంత్రికుణ్ని పక్కకు తీసుకెళ్లి ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపించాడు. ప్లానంతా అప్‌సెట్‌ అయ్యేసరికి నాకు చాలా నిరాశ అనిపించింది. డబ్బు వచ్చినట్లే వచ్చి జారిపోయింది. ఇప్పుడీ కురుమూర్తి గాడిని ఏం చెయ్యాలి? బెదిరించి పంపేద్దామా? లేక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామా? ఫ్రీగా వదిలేస్తే విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయా? అని రకరకాల ఆలోచనలతో ఉన్న నాకు హఠాత్తుగా పక్కన ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడి అటు చూశాను. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యాదగిరి మనుషులు తమ ఉక్కు పిడికిళ్లతో నా జబ్బలు వడిసి పట్టుకున్నారు. ఒక్కసారిగా షాకైపోయాను. వడిగా మాంత్రికుడి వద్దకు ఈడ్చుకువెళ్లి ఎదురుగా నిలబెట్టారు. వాడు నా కాళ్లు చేతులు, ముఖం పట్టి పట్టి చూసి చుట్టూ తిరిగి పరిశీలించి ‘‘ఫర్వాలేదు, పనికొస్తాడు. సమయం కావస్తున్నది. పశువును పక్కన నిలబెట్టండి. పిలుస్తాను.’’ అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నాకు అప్పుడర్థమైంది.. మాంత్రికుడు, యాదగిరిల మధ్య జరిగిన సంభాషణ ఫలితం నన్ను కొత్త బలిపశువుగా మార్చిందని. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. విపరీతమైన భయంతో నిలబడలేకపోతున్నాను. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. అరిచినా ప్రయోజనం ఉండదు. ఈ కీకారణ్యంలో అర్ధరాత్రి నా కేకలు విని కాపాడే నా«థుడెవరుంటారు? వళ్లంతా చెమటతో ముద్దగా తడిచిపోయింది. 

ఇంతలో యాదగిరి ఎదురుగా వచ్చి తలదించుకొని ‘‘నన్ను క్షమించన్నా! ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. పని మధ్యలో ఆగిపోతే మాతో పాటు తను కూడా చస్తానని మాంత్రికుడు గట్టిగా చెబుతున్నాడు. పైగా టైమ్‌ కూడా లేదు వేరే మనిషిని చూసుకోవడానికి..’’ అని నా లాల్చీ జేబులో డబ్బు తనే తీశాడు. ‘‘ఒరేయ్‌! ఇలారా..’’ అని కురుమూర్తిని పిలిచాడు. వాడికి భయంతో పారిపోవడానికి కూడా చేతకాలేదు. వంగి దండం పెడుతూ వచ్చాడు. ‘‘ఇదుగో! ఈ డబ్బు తీసుకొని పారిపో. ఎక్కడైనా ఇక్కడి సంగతులు చెప్పావో.. ఖబడ్దార్‌’’ అంటూ డబ్బులు ఇవ్వబోగా, ‘‘నాకే పైసలు వద్దు సార్‌. నన్ను వదిలేయండి. ఈ జన్మలో ఇటుకేసి రాను..’’ అని యాదగిరి కాళ్లకు మొక్కి, లేచి నావైపు జాలిగా చూసి పరిగెత్తుతూ చీకట్లో కలిసిపోయాడు. నాకంతా ట్రాన్స్‌లో ఉన్నట్లుంది. ఎవరూ నన్ను రక్షించలేరు అన్న నిర్ణయానికి వచ్చేసి చావు కోసం మానసికంగా సిద్ధపడసాగాను. అలసటతో కనురెప్పలు వాలిపొయ్యాయి. ముఖంమీద ఏవో లేపనాలు పులుముతున్నట్లున్నారు. చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చెక్క మొద్దు మీద కాబోలు తల ఆనించి పట్టుకున్నారు. నాకు ప్రతిఘటించే శక్తి ఎప్పుడో పోయింది. వాళ్లు ఎటుతిప్పితే అటు తిరుగుతున్నాను. రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ముఖానికి వేడి సెగ తగిలింది. కళ్లు తెరుద్దామనుకొనేంతలో మెడ మీద చురుక్కుమనిపించింది. వెంటనే కళ్లముందు శాశ్వతంగా చీకటి తెర దిగిపోయింది.  
ఆర్‌.వి.శివప్రసాద్‌  

మరిన్ని వార్తలు