ఆకుపచ్చ సూర్యోదయం

18 Jun, 2017 00:32 IST|Sakshi
ఆకుపచ్చ సూర్యోదయం

వెంటనే జయరాం వెనక్కి తిరిగి అన్నాడు, ‘‘ఆ న్యూస్‌ నిజమే. కిందకి దిగిపోయారట.తటాల్న నడుముకు ఉన్న ఎర్రతోలు హోల్‌స్టర్‌ నుంచి జర్మన్‌ సర్వీస్‌ పిస్టల్‌ లాగాడు కవర్ట్‌. ఇప్పుడే లోయ దిగి ఉంటారు. ఇటు.. అన్నాడు జయరాం. ‘‘మూవ్‌....ఉరుకుతూ అన్నాడు కవర్డ్‌. హోల్‌స్టర్‌ నుంచి తన బ్రిటిష్‌ సర్వీస్‌ పిస్టల్‌ తీశాడు, హైటర్‌ కూడా.కండచీమల బారులా దిగడం మొదలుపెట్టింది పోలీసు పటాలం. పరుగు తీయడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. అంత సన్నగా ఉంది బాట.  గాముకొండ, ధారకొండ. వాటి మధ్య ఉయ్యాల ఊగుతున్నదే దామనపల్లి లోయ.

 కుడిపక్క ఉరుకుతోంది జలపాతం, గాముకొండ నుంచి. అందరూ తుపాకీల ట్రిగ్గర్ల మీద వేలు పెట్టే ఉన్నారు. అడ్వాన్స్‌ పార్టీ వెనుక నడుస్తున్నారు కవర్ట్, హైటర్‌. వీరికి మరో ఆరేడు అడుగుల దూరంలోనే ప్రత్యేక పోలీసులు. ఎక్కువగా బళ్లారి స్పెషల్‌ పోలీసులు, ఇద్దరో ముగ్గురో నర్సీపట్నం, కృష్ణదేవీపేట పోలీసులు. ఈ బృందానికి నాయకుడు కవర్డ్‌. అంటే ఇద్దరు బ్రిటిష్‌ అధికారులు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 26 మంది పోలీసులు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు బ్రిటిష్‌ అధికారులు, 28 రైఫిళ్లు. అన్నీ 303 రైఫిళ్లే.

‘‘ఇది నాలుగు మైళ్ల ఘాట్‌ ఆ నిశ్శబ్దాన్ని భరించలేక కవర్డ్‌ అన్నాడు. పదిహేను రోజుల నుంచి ఒక కసితో అడవిలో గాలిస్తున్నాడతడు. మొట్టాడం వీరయ్యదొరని రామరాజు దళం విడిపించడం పుండు మీద కారం చల్లినట్టయింది. లాగరాయి ఫితూరీ తరువాత అతడిని పట్టుకున్నది కవర్డే. అయితే రాజవొమ్మంగి నుంచి వచ్చిన పదిరోజుల లోపునే వీరయ్యని పట్టుకుని చింతపల్లి స్టేషన్లలో అప్పగించాడు కవర్డ్‌. దాంతో మళ్లీ నమ్మకం వచ్చింది. కానీ ఒంజేరి ఘాట్‌ మీద పోలీసులు చావు దెబ్బ తినడం కుంగదీసింది. ఉన్మాదిలా మారిపోయాడు కవర్డ్‌. అవేమిటి, ఆ రాళ్లు ఎవరో పేర్చినట్టు లేవూ, అసహజంగా?అనుమానంగా అడిగాడు హైటర్, ఒకచోట. ఒక్కసారి పరిశీలనగా చూసి, అలా అనిపించడం లేదే! అంటూ కొట్టిపారేశాడు కవర్డ్‌.

దామనపల్లి ఘాటీ మీదే సరమండ అనే చోటు. సూర్యరశ్మిని భూమి మీద పడనీయడం లేదు చెట్లు. వాటి కింద ఉన్న  చిన్న చిన్న తునికాకు, కుంకుడు చెట్లని ఏవేవో తీగలు చెట్లని కూడా కనిపించనివ్వకుండా పాకాయి. లోపల జంతువు ఉన్నదీ, మనిషి అయినదీ తెలియదు. లక్ష్మయ్య! ఎక్కడున్నారు తెల్లోళ్లు? ఘాటీ వైపే  తుపాకి గురిపెట్టి, ట్రిగ్గర్‌ మీద వేలు ఉంచి, రెప్పవేయకుండా చూస్తున్న ఆ మనిషి అడిగాడు, గొంతు బాగా తగ్గించి. Vð ద్ద వేగంతో వస్తున్నారు.అల్లెతాడు మీద బాణం ఆన్చి కొంచెం పైన నిలిచి ఘాటీ వైపే చూస్తున్న లక్ష్మయ్య చెప్పాడు, తలైనా తిప్పకుండా. ఆ గొంతు ఎండుపడాలుదని పసిగట్టాడు లక్ష్మయ్య. పూర్తి పేరు కుందేరి లక్ష్మయ్య. దామనపల్లి స్థానికుడు.

పడాలు కుడి పక్కకి తిరిగి చూశాడు– పన్నెండు మంది– ముగ్గురు తుపాకులతో, మిగిలిన వారు  సంప్రదాయిక ఆయుధాలను ఎక్కుపెట్టి ఘాటీ వైపు చూస్తున్నారు. తుపాకులు పట్టినవాళ్లలో మొదటివాడు గోకిరి ఎర్రేసు.ఎండుపడాలు ఎడం వైపు తలతిప్పి కొండవాలు మీదుగా పైకి చూశాడు– కనుచూపు మేరలో కనిపిస్తోంది దిబ్బలపాడు. దాదాపు ఘాటీ అంతమయ్యే చోటు. పడాలు కాపు వేసిన చోటుకి కొంతదూరంలో.... పెద్ద పెద్ద కుంకుడు చెట్ల నడుమ..... దాదాపు పదిహేను మందితో మాటు వేశాడు గంతన్న.

కొండవాళ్లని జంతువుల కంటే హీనంగా చూస్తున్నవాడు ఇవాళ ఈ నేలమీదే రక్తం కక్కుకు చావాలి. వాళ్లందరి ఏకైక లక్ష్యం ఇదే. మూడు పోలీసు స్టేషన్ల దాడుల తరువాత కవర్డ్‌ మన్యంలో సాగించిన హింస, లాగరాయి పితూరీ నాటి హింసను గుర్తుకు తెచ్చింది వాళ్లకిS.  ఆరంభంలో దిబ్బలపాడు దగ్గర, మధ్యలో సరమండ దగ్గర, చివర కుంకుడు చెట్ల దగ్గర ఒకే వరసలో ఉన్నాయి కొండదళాలు. ఎడమవైపున అంతా సెలయేటి ప్రవాహం.మరో ఏడెనిమిది నిమిషాలు గడిచిపోయాయి.కిచకిచమంటూ ఎక్కడో నాలుగు కోతులు అరిచాయి హఠాత్తుగా. అదే ఓ సంకేతం. కొండదళ సభ్యులంతా ఊపిరి బిగపట్టేశారు.

థక్‌....థక్‌.....థక్‌..... థక్‌....థక్‌.. థక్‌. నెమ్మదిగా బూట్ల చప్పుడు దగ్గరకావడం మొదలైంది.మధ్యలో ఎండు పడాలు, కింద గంతన్న నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, దిబ్బలపాడు దగ్గర జరగబోయేదాని కోసం. ఆ తరువాత తమ చర్య మొదలవుతుంది. ఎండుపడాలు బృందం మొదటి ప్రయత్నం చేస్తుంది. తరువాత గంతన్న రంగంలోకి దిగుతాడు. చివరికి ఎండుపడాలు దళం కదలి వచ్చి, మల్లు దళంతో కలసి రావడమే కాదు, వెనుక డొంకల్లో దాక్కున్న మిగిలిన దళ సభ్యులు గంతన్న దళానికి తోడు వస్తారు. థక్‌–థక్‌–థక్‌– థక్‌ – బూటు కాళ్ల అడుగులు మరీ చేరువవుతున్నాయి.

మళ్లీ అదే దృశ్యం.... కొండవాలు మీద, రాళ్లు అటూ ఇటూ మార్చినట్టు, కొద్దిగా మట్టి తవ్వినట్టు. వాటి మీద అనుమానం మొదలైంది హైటర్‌కి. ఒక లిప్త తరువాత ఆ రాళ్ల గుట్ట ఒక్కసారిగా దడదడ జారింది. పెద్ద శబ్దం. పది పన్నెండు సెకన్లు కాకుండానే పదడుగుల దూరంలో మరో రాళ్ల గుట్ట జరజర కొండ మీద నుంచి ఘాటీ మీదకు వచ్చి పడబోతుంటే, పోలీసులు సరమండ వైపు పరుగెత్తారు. కొండదళం పన్నిన వ్యూహంలోనే పడ్డారు.

ధన్‌మని పేలింది, తుపాకీ, కొండ మీద నుంచి. మరు లిప్తలోనే తేరుకుని ‘‘లే డౌన్‌... లే డౌన్‌  అంటూ అరిచాడు హైటర్‌. అప్పుడే  ఒళ్లు జలదరించేలా అరుపు పక్కన, ‘‘ఓ మైగాడ్డ్‌! అంటూ.కొందరు పోలీసులు చటుక్కున నేల మీద పడుకున్నారు. కొందరు ఏం చేయాలో తోచక నిలబడే ఉన్నారు. చటుక్కున పక్కకు తిరిగాడు హైటర్‌. కవర్డ్‌ మెడ నుంచి చివ్వున  చిమ్ముతోంది రక్తం.అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, వెనకే ఉన్న ఒక పోలీసు.మరు నిమిషంలోనే మరో తూటా దూసుకొచ్చింది. ఆ పోలీసు కూడా అరుస్తూ కూలిపోయాడు.హైటర్‌ తన చేతిలోని బ్రిటిష్‌ సర్వీస్‌ రివాల్వర్‌ ఎత్తి ఆకాశంలోకి కాల్చబోతుండగానే మరో తూటా వచ్చి అతడి గుండె దగ్గర తాకింది.

 కిందపడిపోతున్నాడతడు, అది కూడా వాగు వైపు.
మరో కానిస్టేబుల్‌ గబగబా వచ్చి పట్టుకోబోయాడు. మళ్లీ పేలింది తూటా.ఇదంతా కొన్ని సెకన్లలో జరిగిపోయింది. ‘‘హె ల్ప్‌...హెల్ప్‌.... మమ్మల్ని కాల్చొద్దు ప్లీజ్‌! ఇంగ్లిష్‌లో వేడుకుంటూ పరుగులు తీస్తున్నారు పోలీసులు. నేల మీద పడుకున్న పోలీసులకి గుండెలు అవిసి పోతున్నాయి. క్షణం తరువాత నెమ్మదిగా తలెత్తి చూసి లేచి పరుగులు తీయడం మొదలెట్టారంతా. ఒక కిలోమీటరు దాటాక కాస్త స్థిమితపడ్డారు. అడుగులో అడుగు వేసుకుంటూనే నడిచారు శరభన్నపాలెం వైపు. ఎవరి కోసం ఎవరూ ఆగడం లేదు.

‘సెప్టెంబర్‌ 24న ఇదంతా జరిగితే...  సెప్టెంబర్‌ 27న శవాలు వస్తున్నాయా?
ఇంతకు మించిన అవమానం ఉంటుందా? పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆర్మిటేజ్‌ కుమిలిపోతున్నాడు. నర్సీపట్నం డీఎస్‌పీ ఆఫీసులో ఒక గదిలో ఒక్కడే కూర్చుని ఉన్నాడతడు. గాలింపు ఆపివేయమని ఆదేశాలు వెళ్లిపోయాయి. డాసన్, టాల్‌బట్, చాడ్విక్, ఫర్బీస్, మార్టిన్‌ అంతా తరలి వచ్చి, డీఎస్‌పీ ఆఫీసు దగ్గరే ఉన్నారు. అందరి ముఖాలలోను విషాదం.మధ్యాహ్నం రెండు గంటల వేళ. తీక్షణంగా  ఉంది ఎండ. ఈ నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకు లేదు. కణతలలో పోటు. కళ్లు మంట. ఇవేమీ ఆర్మిటేజ్‌ని బాధించడం లేదు. తన ఆప్తమిత్రులను కోల్పోయాడు. అది కలచివేస్తోంది.

అప్పుడే తటాల్న ఊహకు తట్టింది. 28 మంది పోలీసులు వెళితే ముగ్గుర్ని చంపారు. అందులో ఇద్దరు తెల్లవాళ్లు! సందేహం లేదు. తెల్లవాళ్లే రామరాజు లక్ష్యం.అప్పుడే పక్కన బూటు కాలును గట్టిగా నేలకు తాటించిన శబ్దమైంది. తిరిగి చూశాడు ఆర్మిటేజ్‌. ఆసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ కీనే సెల్యూట్‌ చేసి నిలబడ్డాడు. భారంగా లేచి అతని వెంట వెళ్లాడు ఆర్మిటేజ్‌.సబ్‌జైలు ఆవరణ éకా నడిచారు ఇద్దరూ. డీఎస్‌పీ కార్యాలయానికి కొన్ని గజాల దూరంలోనే ఉంది.అక్కడే చెట్టుకింద ఉన్నారు అంతా. గంభీరంగా ఉంది వాతావరణం.పది నిమిషాలకి లోపలికి వచ్చాయి రెండు గోముటెద్దు బళ్లు.పోలీసులు చకచకా బళ్ల మీద ఉన్న రెండు శవపేటికలను దించారు.

మూసి ఉన్న లిడ్‌లని (పైన తలుపులు) తీశాడు ఓ పోలీసు. గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి కవర్డ్, హైటర్‌ శవాలు. పోస్ట్‌మార్టం చేశారు. ఒళ్లంతా బ్యాండేజీ ఉంది. ముఖం మాత్రం కనిపిస్తోంది.అప్పటికే అక్కడ వేచి ఉన్న పాస్టర్‌ వచ్చి గబగబా బైబిల్‌ వాక్యాలు చదివాడు.ఆ వెంటనే దూరంగా తుపాకులు పేలాయి, గాల్లోకి. ఎవరో పెద్ద గొంతుతో ఆదేశించారు. అంతా సెల్యూట్‌ చేశారు. వెంటనే లిడ్‌లని మూసేశారు. మరుక్షణం మరో పదిమంది పోలీసులు వచ్చి చేరారు. అంతా కలసి రెండు శవపేటికలను మోసుకుంటూ ఊరి శివార్లలోకి వెళ్లారు.అప్పటికే అక్కడ రెండు గోతులు సమాంతరంగా తవ్వారు, రెండడుగుల దూరంలోనే. గోతుల్లోంచి తీసిన మట్టిలో గుచ్చి ఉన్నాయి చెక్క శిలువలు రెండు.

మళ్లీ గ్రేట్‌వార్‌ మరుభూములు గుర్తుకు వచ్చాయి ఆర్మిటేజ్‌కి. పదవుతోంది. మరో గుటక బ్రాందీ తాగి గ్లాసు టేబుల్‌ మీద పెట్టి ఆ రిపోర్టు చేతిలోకి తీసుకున్నాడు– ఆర్మిటేజ్‌. డీఎస్‌పీ కార్యాలయంలో తన రూంలో ఒక్కడే ఉన్నాడు. లాంతరు వెలుగులో గాజు గ్లాసులోని నల్లని ద్రవం మరింత నల్లగా కనిపిస్తోంది. మద్రాస్‌ పోలీస్‌ రిపోర్టు.పేరు: క్రిష్టఫర్‌ విలియం స్కాట్‌ కవర్డ్‌. వయసు: దాదాపు 28 సంవత్సరాలు.హోదా: అసిస్టెంట్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌. నివాసం: కొరాపుట్, మొదట కనిపెట్టినది: హెడ్‌ కానిస్టేబుల్‌ మహ్మద్‌ హకీమ్‌. ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు, గుండ్రని ముఖం. వివాహం: కాలేదు.కుyì భుజం మీద ఒక గుండు దెబ్బ. ఎడమ ఛాతీ పైన ఒక దెబ్బ. హైటర్‌ గురించి రిపోర్ట్‌ తీసినా చదవలేక పక్కన పెట్టాడు. మరో రిపోర్టు తీశాడు. ‘‘కృష్ణదేవిపేట కానిస్టేబుల్‌ మోరుకొండ అప్పారావు నం. 1248 వ్రాయునది–24–9–22 తేదీ మధ్యాహ్నం దావనాపల్లి నుంచి ఈ చనిపోయిన దొరవారున్నూ, హీటరు దొరవారున్నూ అల్లూరి శ్రీరామరాజు దండును పట్టుకొనుటకు వెళుతూ ఉండగా కొండ మీద నుంచి పితూరీదార్లు తుపాకీలు కాల్చినారు.

ఆ కాల్చడములో స్కాటు కవర్డు దొరవారికి గుండు దెబ్బ తగిలినందున నేల మీద పడిపోయినారు. వెంటనే చనిపోయినారు. రిజర్వు పార్టీలు బయలుదేరి దావనాపల్లి గ్రామానికి వచ్చేసరికి ఆ గ్రామస్తులు పితూరీదార్లు ఆ గ్రామమును అప్పుడే దోచుకుని పారిపోయినట్టు చెప్పినారు. అందుపైన ఇద్దరు దొరలు వారిని పట్టుకొనడానికి బయలుదేరారు. మమ్ములను చుట్టుదారికి ఏనుగులతో రమ్మన్నారు. వారు వెళ్లిన ఒక అరగంటలో గుళ్ల శబ్దము కొంతసేపు వరకు వినిపించినది. బళ్లారి రిజర్వు నం. 161000 హెడ్‌కానిస్టేబుల్‌ మహ్మదు యాకూబ్‌ను దర్యాప్తు చేయగా వ్రాయించినది.అది పూర్తయిన తరువాత పోస్టుమార్టం నివేదిక చేతిలోకి తీసుకున్నాడు గానీ, చదవాలనిపించలేదు.అన్నీ చదివాక కలం తీసుకుని తన నివేదిక రాశాడు ఆర్మిటేజ్‌.

సెప్టెంబర్‌ 26, 1922. క్యాంప్‌: నర్సీపట్నంమద్రాసు ప్రెసిడెన్సీ చీఫ్‌ సెక్రటరీ గ్రాహంకుఇద్దరు అధికారులు, ఒక కానిస్టేబుల్‌ మహ్మద్‌ యాకూబ్‌ చనిపోయారు. ఒక కానిస్టేబులుకు గాయాలు తగిలాయి. ఒక కానిస్టేబులు కనిపించడం లేదు. తిరుగుబాటుదారులను సాధారణ పోలీసులతో అదుపు చేసే ఆలోచన చాలా ప్రమాదకరం. అడవులలో యుద్ధం చేసే నైపుణ్యం కలిగిన సైనికులు అవసరం. ఈ వాస్తవాన్ని ఇంతకు ముందే గ్రహించలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఇది గుర్తించి ముందే ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈ రెండు విలువైన ప్రాణాలు పోకుండా ఆపగలిగేవాళ్లం.
 ఎఫ్‌ ఆర్మిటేజ్‌

పక్క గదిలోనే ఏజెన్సీ కమిషనర్‌ స్టీవర్డ్‌ కూడా నివేదిక రాస్తున్నాడు, లాంతరు వెలుగులో.
చీఫ్‌ సెక్రటరీ గ్రాహంకు,దామనపల్లి దాడి నిస్సందేహంగా స్కాట్‌ కవర్డ్‌ను లక్ష్యంగా చేసుకున్నదే. కవర్డ్‌ రాజును వెంటాడుతున్నాడు. కొండదళం అక్కడికి వస్తున్నట్టు దామనల్లి నుంచి కవర్డ్‌కు సమాచారం వచ్చింది. అది రామరాజు పంపించి ఉండాలి. అక్కడ ఆస్తినష్టం ఆరు 303 రైఫిళ్లు, 300 తూటాలు, ఒక జర్మన్‌ సర్వీస్‌ పిస్టల్, దీని 16 బులెట్లు, హైటర్‌కు చెందిన బ్రిటిష్‌ సర్వీస్‌ పిస్టల్‌ కొన్ని బులెట్లు పోయాయి. కవర్డ్, కానిస్టేబుల్‌ ఇద్దరికీ కూడా మెడ, భుజం మధ్యనే తూటాలు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం తరువాత ఆర్మిటేజ్‌ 20 మందితో ఘాట్‌ ఎక్కడానికి ప్రయత్నించాడు, అక్కడ ఎవరైనా ఉంటే ఆదుకోవడానికి.

 మళ్లీ కాల్చారు. ఒక కానిస్టేబుల్‌ చనిపోయాడు. నిన్న(సెప్టెంబర్‌ 25, 1922) నేను 70 మంది పోలీసులతో శరభన్నపాలెం వెళ్లాను. ఇది ఘాట్‌ కిందే ఉంది. శవాలను స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అవకాశం, గాయపడిన మరో లాన్స్‌నాయక్‌ను తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించవచ్చా అని ఆర్మిటేజ్‌ అడిగాడు. నేను వద్దని చెప్పాను. బాగా డబ్బు ఇచ్చి స్థానికులను పంపారు. గాయపడిన వాడు వచ్చాడు. భవిష్యత్‌ గురించి ఆర్మిటేజ్‌తో చర్చించాను. రామరాజును వెతికే పని ఇప్పటికి ఆపాలని ఇద్దరం అభిప్రాయపడ్డాం– శిక్షణ కలిగిన మిలటరీ వచ్చేదాకా. స్టీవర్డ్, ఏజెన్సీ కమిషనర్‌.  ఇదంతా జరిగిన వారం పదిరోజులకి, మన్యంలో ఎక్కడో మారుమూల ఒక కొండవాలు దగ్గర రామరాజు దళం విడిది చేసింది.

అది కూడా బొమ్మెత్తుపొద్దే.
తన మొలకు కొత్తగా వచ్చిన గడియారం తీసి ముందు చెవి దగ్గర పెట్టుకున్నాడు రామరాజు. క్వీన్‌ ఏన్‌ గడియారం. ఎంతో ముచ్చటగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులకి ఇచ్చింది ప్రభుత్వం.రెండులిప్తల తరువాత దాని మీద సమయం చూశాడు.మళ్లీ మొలతాడుకు గడియారం గొలుసు తగిలిస్తూ ఉంటే ఎర్రేసు అడిగాడు అమాయకంగా.‘‘స్వామీ! దాన్ని చెవి దగ్గర పెట్టుకున్నారు. ఏం చెప్పింది? బొమ్మెత్తు పొద్దు అని చెప్పిందా? ‘‘కాలం, అంటే వేళ– అమృతం వంటిది. ఆలస్యం చేస్తే అదికాస్తా విషమైపోతుంది సుమా! అంది అన్నాడు నవ్వుతూ రామరాజు.

మన కాలం విషం కాకూడదు స్వామీ! అన్నాడు ఎర్రేసు.అనుకున్నట్టే రెండు ప్రతిజ్ఞలు తీసుకున్నారు వాళ్లు.మొదటి ప్రతిజ్ఞ: మన్యప్రజల పట్ల మర్లుపులి (మనిషి రక్తం రుచి మరిగిన పులి)లా ప్రవర్తిస్తున్న కవర్డ్, అతడి సహోద్యోగి హైటర్‌ దామనపల్లికి వస్తున్న సంగతి చాలా ముందే గమనించి ఆగమేఘాల మీద వచ్చి కొండదళానికి చెప్పి మహోపకారం చేసిన ఒక మనిషి ఉన్నాడు. ప్రాణాలు పోయినా అతడి పేరు చెప్పరాదు. అతడు దామనపల్లి మునసబు తమ్ముడు కుందేరి బొర్రంనాయుడు.  

రెండోది–  దామనపల్లి మీద ఆ ఇద్దరు దొరలను మట్టుపెట్టినవాడు ఎర్రేసు. ఇది కూడా గుండెల్లో దాచుకోవాలి. కొండదళానికి ఆ బొమ్మెత్తుపొద్దులో కనిపించినది సూర్యుడు కాదు, శ్రీరామరాజు.                     హలో... హలో... నర్సీపట్నం క్యాంప్‌... ఓవర్‌ ఫర్బీస్‌ దానిని చేతిలోకి తీసుకుని గట్టిగా అన్నాడు, హలో... హలో... కేడీపేట క్యాంప్‌.. ఈవ్‌లింగ్‌! ఏమిటి విషయం. ఓవర్‌పోలీసు బలగాలు కొయ్యూరు బయలుదేరాయా? ఓవర్‌ చాలా సేపయింది. రెండు ట్రక్కులలో నాలుగు పటాలాలు వెళ్లాయి. ఓవర్‌... రామరాజుని కొద్దిసేపట్లోనే  కొయ్యూరుకు తీసుకువస్తారని తెలిసింది. ఇంకాస్త ఫోర్సు అవసరమని ఆర్మిటేజ్‌ చెప్పారు. లంబసింగిలో ఫోర్సుని కూడా కొయ్యూరు పంపించు. గూడెంలో ఉన్న ఫోర్సుని సాయంత్రానికి కేడీపేట వచ్చేలా చూడు.

ఓవర్‌! అన్నాడు ఈవ్‌లింగ్‌.
‘‘సరే, ఈ ఫోర్స్‌ చాలదా? ఓవర్‌ అడిగాడు ఫర్బీస్‌.‘‘ చాలవని కాదు. రామరాజుని విడిపించేందుకు దాడి చేస్తారని అనుమానం. అంతేనా! అన్నాడు ఫర్బీస్‌.అసలు సంగతి అదికాదు. నీకు తెలుసు కదా! వాడెవడు గదర్‌ మూవ్‌మెంట్‌లో వాడు... వాడి పేరు ఏదో సింగ్‌! వాడు వచ్చి రామరాజుతో కలిశాడని కదా! అందుకు. ఓవర్‌అన్నాడు ఈవ్‌లింగ్‌. వైర్‌లెస్‌ కనెక్షన్‌ కట్‌ అయింది. నిజమే, రెండు మూడు నెలల క్రితమే వినిపించిందా మాట. తటాల్న గుర్తుకొచ్చింది ఆ పేరు – పృథ్వీసింగ్‌ ఆజాద్‌. గొంతు తడారిపోయింది మళ్లీ.

మరిన్ని వార్తలు