విహారం: హనీమూన్ ప్యారడైజ్ : కోవళం

10 Aug, 2013 22:53 IST|Sakshi
విహారం: హనీమూన్ ప్యారడైజ్ : కోవళం

కోవళం బీచ్... పర్యాటక ప్రపంచానికి చిరపరిచితమైన ప్రదేశం. భారత- పాశ్చాత్య దేశాల మధ్య వర్తకవాణిజ్యాలకు బీజం పడినప్పటి నుంచి పర్యాటక ప్రాధాన్యం సంతరించుకున్న తీరం ఇది. సరుకుల రవాణాకి అరేబియా తీరం అనువుగా ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందింది, దాంతోపాటు పర్యాటకమూ విస్తరించింది. ఇందుకు దోహదం చేసిన కారణం కోవళం దగ్గర సముద్రం సౌమ్యంగా ఉండడమే. మంద్రంగా చిన్నపాటి అలలతో సీబాత్‌కు చక్కగా ఉంటుంది ఈ తీరం. ఇక్కడ అడుగు లోతు సముద్రపు నీటిలో పడుకుని అలల తాకిడిని ఆస్వాదిస్తున్న విదేశీయులు కనిపిస్తారు. ఎత్తై అలలతో ఎగిసిపడే బంగాళాఖాతంలోకి పది అడుగుల కంటే లోపలికి వెళ్లాలంటే భయమేస్తుంటుంది.
 
 అరేబియా మాత్రం పొత్తిళ్లలో పాపాయిని సేదదీర్చినట్లు పర్యాటకులను సేదదీరుస్తుంది. ఈ టూరిస్ట్ ఫ్రెండ్లీ వాతావరణంలో విస్తరించిన రిసార్టులు... ప్రకృతి సహజత్వాన్ని పుణికి పుచ్చుకుని ప్రతిసృష్టి చేసినట్లు ఉంటాయి. హనీమూన్ ప్యారడైజ్‌గా అభివర్ణించుకునే ఈ రిసార్టులు, కాటేజీల్లో స్విమ్మింగ్‌పూల్, మెడిసనల్ ఆయిల్‌బాత్, మసాజ్, యోగా సెంటర్ వంటి రిలాక్సేషన్‌లు ఉంటాయి. కొత్త దంపతులు హనీమూన్ ట్రిప్‌కి ఈ ప్రదేశానికే తొలిప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడి లీలా గ్రూప్ రిసార్టు, కరిక్కథి బీచ్ హౌస్ వంటి రిసార్టులు సముద్రాన్ని ఆనుకుని ఉన్నట్లే అనిపిస్తాయి. ఈ రిసార్టుల ఆవరణలో తిరుగుతుంటే సముద్రపు అలలు మనల్ని తాకడానికి వస్తున్నట్లు భ్రమ కల్పిస్తాయి. సముద్రంలో ఈదడానికి భయమేస్తే, సముద్రాన్ని చూస్తూ ఇక్కడి స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టవచ్చు. బీచ్‌లో సేదదీరాక నేల మీద అద్భుతాలు చూడాలని అడుగులు వేస్తే... త్రివేండ్రం స్వాగతం పలుకుతుంది.
 
 త్రివేండ్రం పేరుతోపాటే మనకు గుర్తొచ్చేవి పద్మనాభస్వామి ఆలయం, ట్రావన్‌కోర్ రాజమందిరం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వార్తల్లోకెక్కిన పద్మనాభ స్వామి ఆలయం త్రివేండ్రం నుంచి 80 కి.మీ.ల దూరంలో కన్యాకుమారికి వెళ్లే దారిలో ఉంటుంది. కౌడియార్ (ట్రావెన్‌కోర్ రాజవంశపు అధికారిక భవనం), పద్మనాభపురం ప్యాలెస్‌లు ఇక్కడ ఆధునికతను డామినేట్ చేస్తున్న సంప్రదాయ నిర్మాణాలు. వీటికి బ్యాక్‌డ్రాప్‌గా ఉన్న దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయత అన్నీ కలిసి రవివర్మ చిత్రాన్ని తలపిస్తాయి.
 
 కళాప్రియులకు రాజా రవివర్మ ఇక్కడే పుట్టాడన్న విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఆ మహాచిత్రకారుడు అంతటి గొప్ప చిత్రాలకు రూపమివ్వడానికి ఇక్కడి దట్టమైన అడవులతో విస్తరించిన కొండలు, సముద్రతీరం, ప్రకృతితో మమేకమైన జీవితం కారణమేమో! రవివర్మ చిత్రాల్లోని స్త్రీమూర్తులలో కనిపించే లాలిత్యం ఇక్కడ కనిపిస్తోంది. ఆయన చిత్రాల్లో పాశ్చాత్య ఛాయలు మేళవించిన భారతీయత కనిపిస్తుంది. ఇందుకు అప్పటి పాశ్చాత్యుల రాకపోకలే కారణం కావచ్చు.
 
 రవివర్మను ఇంతగా తలుచుకున్న తర్వాత  ఇక్కడి శ్రీచిత్ర ఆర్ట్ గ్యాలరీని చూడకుండా ఉండలేం. చూడకుండా పర్యటన ముగిస్తే ఆ చిత్రకారుడికి ఇవేమీ పట్టకపోవచ్చు కానీ మన మనసు తొలిచేస్తూ ఉంటుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లకు వెళ్లిన ప్రతిసారీ గుర్తుకొచ్చి మరీ... అప్పుడు చూడకపోవడంతో ఎంత మిస్సయ్యావో కదా అని బాధపెడుతుంది. అందుకోసమైనా చూసి తీరాలి. శ్రీచిత్ర ఆర్ట్ గ్యాలరీలో కేరళ సంప్రదాయ కళాకృతులు, శిల్పాలు, చిత్రాల విభాగాలున్నాయి. రవివర్మ చిత్రాలకు ప్రత్యేక విభాగం ఉంది. 1940లో కిల్లిమనూర్ ప్యాలెస్ నుంచి రాజకుటుంబీకులు గ్యాలరీకి పంపించిన 75 పెయింటింగుల్లో 63 మాత్రమే కనిపిస్తున్నాయిక్కడ. కాళ్లొచ్చి వెళ్లిన చిత్రాల సంగతేంటో మరి!
 
 ఇదే ప్రాంగణంలో ఉన్న నేపియర్ మ్యూజియం కేరళ సంస్కృతికి, సంప్రదాయ కళాఖండాలకు వేదిక. ఈ భవనం నిర్మాణశైలి తీరప్రాంత వాతావరణానికి అనువుగా ఉంటుంది. కేరళ, మొఘల్, చైనా, ఇటలీ భవన నిర్మాణ రీతులను కలగలిపి రూపొందించిన డిజైన్ ఇది. నాచురల్ ఎయిర్‌కండిషన్‌తో కూడిన ఈ డిజైన్ మీద ఆర్కిటెక్టు స్టూడెంట్‌లు అధ్యయనం చేస్తుంటారు. ఈ మ్యూజియంలో పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, రథాలు, ఇత్తడి విగ్రహాలు, దంతపు బొమ్మలతోపాటు జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న తోలుబొమ్మలు కూడా ఉంటాయి. ఇక్కడి అనేక విగ్రహాలు భారత- రామాయణ కథల ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంటాయి. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి మద్రాసు గవర్నర్ జాన్ నేపియర్ పేరునే ఈ మ్యూజియానికి పెట్టారు. స్థానికులు దీనిని గవర్నమెంట్ ఆర్ట్ మ్యూజియం అనే పిలుస్తారు. ఎందుకో కానీ ఈ మ్యూజియానికి సోమ,
 బుధవారాలు రెండు రోజులు సెలవు.
 
 త్రివేండ్రం నగర శివారుగా అడుగులేస్తే కనుచూపు మేరలో అరువిక్కార నది కనిపిస్తుంది. ఇది త్రివేండ్రం నగరానికి మంచినీటి వనరు. ఈ నదీతీరాన ఉన్న దుర్గామాత ఆలయం చాలా పురాతనమైనది. టూర్ అంటే ఇవన్నీ చూడడమే కాదు ఇంకా ఏదో అల్లరి చేయాలంటే... నెయ్యార్ డ్యామ్ వైపుగా సాగిపోవాల్సిందే. ఇక్కడైతే పడవ విహారం, పర్వతారోహణ వంటి సాహసాలు చేయవచ్చు. పశ్చిమ కనుమల మీదకు సాగే ట్రెకింగ్ రూట్‌లో రెండు జలపాతాలు కనువిందు చేస్తాయి. లయన్ సఫారీ పార్క్, క్రొకొడైల్ రేరింగ్ సెంటర్ కూడా ఉన్నాయి.
 
 ఇవన్నీ సరే... ఇంత అందమైన ప్రదేశంలో టూరిస్ట్ స్టే సౌకర్యం ఉంటే బావుణ్ణు కదా అని ఆరా తీశాక... పొన్ముడి కొండలు మీద కాటేజీలు కనిపిస్తాయి. కేరళ సముద్రాన్ని చూసిన తర్వాత హౌస్‌బోట్ ఎక్కకపోతే ఎలా? ఈ సరదా తీర్చే పిక్నిక్ స్పాట్ అక్కులమ్ సరస్సు. ఈ లేక్ తీరాన మ్యూజికల్ ఫౌంటెయిన్, బోట్ క్లబ్, సరస్సులో స్పీడ్‌బోట్‌లో షికారు, పెడల్ బోట్ నడుపుకుంటూ పోవడం, కెట్టువల్లం(హౌస్‌బోట్)లో రాత్రి బస సౌకర్యాలున్నాయి.
 
 ఇవన్నీ చూశాక అరేబియా తీరాన్నే వెళ్తే ‘అంచుతెంగు’ చేరుతాం. ఇక్కడికి వెళ్లడం అంత అవసరమా... అంటే? కొంత అవసరమే! ట్రావన్‌కోర్ రాజు ఈస్టిండియా కంపెనీకి లీజుకిచ్చిన కొబ్బరి తోట ఇది. ఇక్కడ సెయింట్ జేవియర్ చర్చ్, బ్రిటిష్ వాళ్ల కోట ఉన్నాయి. చివరగా వెలి లాగూన్ (ఉప్పు నీటి సరస్సు)లోని ఫ్లోటింగ్ రెస్టారెంట్‌కెళ్లి కేరళ సంప్రదాయ వంటకాలను రుచి చూస్తూ కోవళం బీచ్ రిసార్టుల నుంచి సాగిన పర్యటనను సింహావలోకనం చేసుకుంటే కోవళం ట్రిప్ తీపి జ్ఞాపకంగా మిగులుతుంది.
 
 ఎక్కడ ఉంది ?
 కరిక్కాథి బీచ్ హౌస్ రిసార్టు కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి దగ్గరగా కోవళం బీచ్‌లో ఉంది.
 
 సమీప విమానాశ్రయం: త్రివేండ్రం ఎయిర్ పోర్టు నుంచి దక్షిణంగా 20 కి.మీ.ల దూరం.
 సమీప రైల్వేస్టేషన్... త్రివేండ్రం రైల్వేస్టేషన్, ఇక్కడి నుంచి 11కి.మీ.ల దూరం.
 
 ఎక్కడ ఉండాలి ?
 కరిక్కథి బీచ్ హౌస్‌లో రోజు గది అద్దె 99 యూరోల నుంచి 590 యూరోలు ఉంటుంది (ఒక యూరో దాదాపుగా 79 రూపాయలు). ద లీలా కోవళం, వివాంతా బై తాజ్ - కోవళం వంటి ప్రైవేట్ హోటళ్లలో గది అద్దె రోజుకి కనీసం పదకొండు వేల రూపాయలు ఉంటుంది. కేరళ పర్యాటకశాఖ నిర్వహించే సముద్ర కోవళంలో మూడున్నర వేల నుంచి 11 వేల వరకు ఉంటుంది. హోటల్ సీ ఫేస్‌లో రెండువేల నుంచి మొదలైతే, జీవన్ ఆయుర్వేదిక్ బీచ్ రిసార్టులో ఒక రోజు అద్దె పన్నెండు వందల రూపాయల నుంచి మొదలవుతుంది. వీటితోపాటు ఆరువందల అద్దెతో హోటల్ సీవీడ్ వంటి బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి.
 
 భోజనం ఎలా?
 రకరకాల సీఫుడ్ తినాలంటే ‘సీషోర్’ రెస్టారెంట్‌కెళ్లాలి. ఇది మల్టీక్విజిన్ రెస్టారెంట్. ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన ఐటెమ్ ‘సీ ఫుడ్ బాస్కెట్’. జలచరాలను సాస్‌లలో ఉడికించి తయారు చేస్తారు.
 
 ఇంకా ఏమి చూడవచ్చు? ఎంతెంత దూరం?
 అంచుతెంగు... ఇది త్రివేండ్రం నగరానికి 40 కి.మీ.ల దూరంలో అరేబియా తీరాన ఉంది.
 నెయ్యార్‌డ్యామ్... త్రివేండ్రానికి 30 కి.మీ.ల దూరంలో ఉంది.
 
 నెయ్యట్టికార... ఇది  నెయ్యర్ నదీతీరాన విస్తరించిన పురాతన పట్టణం. ఇక్కడ 18వ శతాబ్దంలో మార్తాండవర్మ కట్టించిన శ్రీకృష్ణుని ఆలయం ఉంది.
 పూవార్... పురాతన రేవు పట్టణం. త్రివేండ్రం నుంచి 29 కి.మీ.లు. చక్కటి రిసార్టులతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
 వెలి లాగూన్... నగర శివారులోని ఉప్పు నీటి సరస్సు.
 షంగుముగమ్ బీచ్... ఎయిర్‌పోర్టుకి, కోవళం బీచ్‌కి దగ్గరగా ఉంది.

>
మరిన్ని వార్తలు