పేరెంట్స్‌కి షుగర్‌ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్‌ వస్తుందా?

3 Dec, 2023 11:56 IST|Sakshi

మా పేరెంట్స్‌ ఇద్దరికీ సుగర్‌ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్‌కి సుగర్‌ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్‌ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
– ఎన్‌. మాధవి, హాసన్‌పర్తి

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్‌ డయాబెటీస్‌ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్‌ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్‌ 2 డయాబెటీస్‌ ఉంటే.. గర్భిణీలో సుగర్‌ కనపడుతుంది. కనపడే రిస్క్‌ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్‌ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్‌ డయాబెటీస్‌ వచ్చే చాన్స్‌ ఎక్కువ. తండ్రికి సుగర్‌ ఉంటే 30 శాతం రిస్క్‌ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్‌ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్‌లో జీడీఎమ్‌ ఉంటుంది. దీనికి జెనెటిక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్యాక్టర్స్‌ కారణం.

వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్‌ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్‌ రావడం వంటివన్నీ జెస్టేషనల్‌ డయాబెటీస్‌ రిస్క్‌ని పెంచుతాయి.

మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్‌ సుగర్‌’ అంటే వైట్‌ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్, కార్న్‌ సిరప్స్‌ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్‌ వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

అరగంట సేపు ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే బ్రిస్క్‌ వాక్, స్విమ్మింగ్‌ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్‌ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్‌ డయాబెటీస్‌ లేదా తరువాతైనా సుగర్‌ వచ్చే చాన్సెస్‌ తగ్గుతాయి. 

(చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!)

మరిన్ని వార్తలు