ఈ బైతూ...ఆ బైకూ ఒకటేనా...?!

5 Oct, 2014 02:02 IST|Sakshi
ఈ బైతూ...ఆ బైకూ ఒకటేనా...?!

నవ్వింత: మా బుజ్జిగాడు గొప్ప ఇంజనీరైనా కావచ్చు, లేదా ముఖం చూసీ, చూడకుండానే ఎదుటివాడి జాతకాలు చెప్పేసే మహా ఫ్యూచరాలజిస్టు అయిన కావచ్చునని నా నమ్మకం. ఇదేంట్రా పొంతన లేని రెండింటికి ముడిపెడతాడు అని మీకు అనిపించవచ్చేమోగానీ... దిగులుతో కూడిన ‘నా అనుభవాలూ... పరాభవాలూ’ చెబితే నేనన్నదే నిజమని మీరూ అంగీకరిస్తారు.
   
మావాడు మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు మాటలు కూడా సరిగా రాని రోజుల్లో నా టూవీలర్ మీద తిప్పమంటూ గొడవ చేసేవాడు. దాన్ని బైక్ అంటారని ఓ రోజు చెప్పా. ఆ మాట గుర్తు పెట్టుకొని... నేనెత్తుకుని ఉన్నప్పుడు నా చేతుల్లో ఉన్నవాడు కాస్తా దానివైపు ఒరుగుతూ వాడు దాన్ని చూపిస్తూ... ‘బైతూ...’ ‘బైతూ...’ ‘బైతు  పో ఆం (పోదాం)’ అంటూ ఉండేవాడు. వాడంటున్న ముద్దు మాటలను వింటూ... ‘అబ్బ మీది మరీ నలభై గడప కూడా లేని పక్కా పల్లె అనీ... మీరు మరీ మొరటు పల్లెటూరి బైతు అని వాడెలా తెలుసుకున్నాడండీ’ అంటూ ముద్దు ముద్దుగా మురిసిపోతూ మురిపెంగా అంది మా ఆవిడ నా ముఖం నల్లగా మారిపోతూ ఉండగా.
   
 మరి కొన్నేళ్ల తర్వాత ఓరోజు పొద్దున్నే వాణ్ని స్కూల్‌కు దిగబెట్టడానికి నా టూవీలర్ తీశా. పెట్రోలు తక్కువగా ఉందని ట్యాంకు నిండా పెట్రోలు కొట్టించా. ఆ తర్వాత కిక్కు రాడ్డును ఒక తన్ను తన్నా. కానీ బండి స్టార్ట్ అవ్వలేదు. కొట్టీ కొట్టీ చెమటలు గక్కుతూ నేను అలసిపోయినా అది మాత్రం మొండికేసింది. ‘‘ఇప్పుడే పెట్రోలు ఫుల్లుగా కొట్టించాను. అయినా స్టార్ట్ కావడం లేదేంటీ’’ అంటూ చిరాగ్గా అన్నాన్నేను. వెంటనే మా బుజ్జిగాడు, ‘‘నాన్నా... నువ్వు కూడా కడుపునిండా అన్నం తిన్న తర్వాత ఒక్కోసారి కడుపు బరువైందని బద్ధకంగా పడుకుంటావు కదా, సావాసదోషంతో నీ బైకు పరిస్థితి కూడా అదేనేమో’’ అన్నాడు. అలాంటిదే మరో సంఘటన. ఓరోజున మా క్లోజ్‌ఫ్రెండొకడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. కాసేపు మాటా మంతీ అయ్యాక ఇంట్లో చెప్పిన విషయాలను నేనంతగా పట్టించుకోవడం లేదనీ, ఒక పట్టాన స్పందించడం లేదనీ మా ఆవిడ చేసిన ఫిర్యాదులు వింటూ... ‘నిన్ను తన్నినా నీకు బుద్ధిరాదురా’ అన్నాడు కాస్త చనువుగా కోప్పడుతూ. మా బుజ్జిగాడు అందుకుంటూ, ‘అంకుల్... అచ్చం మా బైకు లాగానే మా నాన్న కూడా’ అన్నాడు నా బండి కిక్‌రాడ్‌ను చూపుతూ.
   
 నాకు పరమ బద్ధకమనీ, ఏపనీ ఒక పట్టాన తెమలనివ్వననీ కోప్పడుతూ ఉంటుంది మా ఆవిడ. ఓ రోజున అదే విషయాన్ని గట్టిగా చెబుతూ, ‘ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పొండి. చాపకిందికి నీరొచ్చే వరకూ మీకు విషయం తెలిసిరాదు’ అంది. కొన్నాళ్ల తర్వాత ఒక రోజు మా ఆవిణ్ణీ, బుజ్జిగాణ్ణీ టూ వీలర్ మీద తీసుకెళ్తుండగా సరిగ్గా నా సీటుకింద పూర్తిగా తడిసిపోయి, నా ప్యాంటు ముద్దముద్దయ్యింది. మావాడు అందుకున్నాడు, ‘‘నాన్నా, సీటు చిరిగిపోయి, స్పాంజీ బయటకు వచ్చినా రెగ్జిన్ మార్పించలేదు. నీ బద్ధకం వల్ల జరిగే నష్టం తెలియాలంటే చాపకిందికి నీళ్లే రానక్కర్లేదు. సీటు కిందికీ నీళ్లొచ్చినా చాలు’’ అని బుద్ధి చెప్పాడు.
   
 ఓ రోజున నా బండి ఆగిపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లా. దాన్ని పరీక్షించి ప్లగ్ చూసి... ‘‘స్పార్క్ రావడం లేదండీ. ప్చ్... స్పార్క్ లేదు’’ అన్నాడు. మావాడు ఆ మాట గట్టిగా పట్టుకుని, ‘‘మొన్న మీ పెద్ద బాస్ కూడా ‘నీలో స్పార్క్ లేదయ్యా’ అని తిట్టారన్నావు కదా! మెకానిక్ అంకుల్ చెబుతున్నదాన్ని బట్టి ఆ మాట నిజమేనని తేలిపోయింది కదా నాన్నా. ప్చ్... స్పార్కు లేకుండా ఎలా బతుకుతావో ఏమో’’ అని నామీద జాలిపడ్డాడు.
   
 ఇంతకూ... మా బుజ్జిగాడు నన్ను మా మోటర్‌సైకిల్‌తో పోలుస్తూ భవిష్యత్తులో మంచి ఇంజనీరు అవుతాడా? లేక ఇలా దాన్ని ఓ ఉదాహరణగా చూపుతూ నా జాతకం రచించేసి మాంఛి ఫ్యూచరాలజిస్టూ, నాస్ట్రడామస్సూ అవుతాడా అన్న సందేహం మాత్రం ఇప్పటికీ తీరలేదు. ‘నాన్నా... బండి రిపేరుకొస్తే నువ్వు దాన్ని బాగు చేయించడం మానేసి... అసలది అలా ఎందుకైందా అని ఆలోచిస్తుంటావు. నేను కనీసం ఇంజనీరునో, ఫ్యూచరాలజిస్టునో అవుతానేమో గానీ నువ్వు మాత్రం నేను చిన్నప్పుడు నోరు తిరగక పలికినట్టు మన బైకుకూ బైతుకూ తేడా లేకుండా బతుకుతావు జాగ్రత్త’’ అంటూ బెంగ పెరిగిపోతుండగా నాకు వార్నింగిచ్చాడు.
 - యాసీన్

మరిన్ని వార్తలు