ఆ బాధతోనే ఓసారి ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయా!

6 Apr, 2014 02:14 IST|Sakshi
ఆ బాధతోనే ఓసారి ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయా!

‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’... ఈ ఒక్క డైలాగ్‌తోనే వంద సినిమాలు చేసినంత గుర్తింపును తెచ్చుకున్న నటుడు పృథ్వీ. ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నా... నటనపట్ల మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తాజాగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘భీమవరం బుల్లోడు తదితర చిత్రాలతో అలరించారు. తన ఆటుపోట్ల సినీప్రయాణం గురించి  పృథ్వీ చెప్పిన విశేషాలు...
 
 మా అబ్బాయిని చిన్నప్పుడు... ‘బాల రామాయణం’లో ఇంద్రజిత్ పాత్ర కోసం తీసుకున్నారు గుణశేఖర్. ట్రెయినింగ్ కూడా ఇచ్చాక వేరే అబ్బాయిని తీసుకున్నారు. దాంతో డిజప్పాయింట్ అయ్యాడు. ఇక సినిమాల జోలికి రాకూడదని అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు. మా అమ్మాయి చెన్నై టీసీఎస్‌లో పని చేస్తోంది. తనకీ ఈ ఫీల్డ్ మీద ఆసక్తి లేదు. వాళ్లు వస్తానంటే నాకు అభ్యంతరమూ లేదు!
 
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎలా ఉంది ఎక్స్‌పీరియెన్స్?
 (నవ్వుతూ) నేను ఇండస్ట్రీకొచ్చి ఇంకా థర్టీ ఇయర్స్ అవ్వలేదండీ... ఇరవయ్యేళ్లే అయ్యింది.
‘ఖడ్గం’లోని ఆ డైలాగ్ మీ జీవితాన్నే మార్చేసింది కదా... అందుకని...?
 అవును. నిజానికి అది ముందు అనుకుని పెట్టిన డైలాగ్ కాదు. వేరే ఏదో అనుకున్నాం. కానీ రోజంతా ఎన్ని టేకులు చేసినా తృప్తికరంగా రాలేదు. సాయంత్రం సడెన్‌గా కృష్ణవంశీ ఆ డైలాగ్ చెప్పారు. అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చింది. నా కెరీర్‌ని మలుపు తిప్పింది.
ఆ సిన్మాతోనే మీ గురించి అందరికీ తెలిసింది. అంతకుముందు ఏం సినిమాలు చేశారు?
 చాలానే చేశాను.‘గండిపేట రహస్యం’ చిత్రంలో హీరోగా చేశాను. అయితే అది పక్కా పొలిటికల్ చిత్రం కావడంతో విడుదల తరువాత చాలా గొడవలయ్యాయి. నేను ఎన్టీయార్‌ని ఇమిటేట్ చేశానని చాలామంది విమర్శించారు. చివరికి ఎన్టీయారే పిలిచి... ‘డెరైక్టర్ చెప్పింది చేశావ్, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు, నీ తప్పేమీ లేదు’ అన్నారు. దాంతో నా టెన్షన్ తగ్గింది. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించాను కానీ అంత గుర్తింపు రాలేదు.
 
  అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు?
 మాది తాడేపల్లిగూడెం. మా నాన్న సుబ్బారావు నటుడే. నాటకాలు, ఓ పదిహేను పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయన ప్రభావం కొంత ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఏ. చేస్తున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అప్పుడందరూ నటుడిగా ట్రై చేయొచ్చుగా అనేవారు. దాంతో ఆసక్తి ఏర్పడింది. నటుడు ప్రభాకర్‌రెడ్డిగారు నాన్న స్నేహితుడు. ఆయన సహకారంతో 1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆయనే నా నట గురువు.
 
సక్సెస్ కావడానికి చాలా టైమ్ పట్టిందే?
 ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడంటే చదువుకున్నవాళ్లు వస్తున్నారు, ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు, ఎదుటివారిని గౌరవిస్తున్నారు. అప్పట్లో అలా కాదు. చాలా యాటిట్యూడ్ ప్రాబ్లెమ్స్ ఉండేవి. నాకు ఇస్తామన్న రోల్స్ చివరి నిమిషంలో వేరేవాళ్లకి ఇచ్చేసేవారు. చాలా డిజప్పాయింట్ అయ్యేవాడిని. ఇంత చదువుకున్నాం, ఇలా అవమానాలు భరించడం అవసరమా అని కుమిలిపోయేవాడిని. చివరికి ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లిపోయాను.
 
వెళ్లిపోయారా.. మళ్లీ ఎలా వచ్చారు?

 నన్ను నటుడిగా చూడాలని మా అమ్మ కలలు కంది. కానీ తన కల నెరవేరకముందే కన్నుమూసింది. ఆ బాధతో కొంత ఇక సినిమాలు వద్దనుకుని, ఓ కాలేజీలో లెక్చెరర్‌గా చేరిపోయాను. కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ ఫోన్ చేశారు. ఆయనది మా ఊరే కావడంతో నేను ఆయనకు బాగా తెలుసు. ‘ఖడ్గం’లో నటించడానికి రమ్మని పిలిచారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో కొత్త జీవితాన్నిచ్చారు.


ఇప్పుడు హ్యాపీనా...?
 హ్యాపీనే. ‘ఆగడు’, ‘అవతారం’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. ‘గే’ల సమస్యల ఆధారంగా తీసిన ‘థర్డ్ మ్యాన్’ అనే కన్నడ సినిమాలో లీడ్ రోల్ చేశాను. ఇది తెలుగులో కూడా రానుంది.


ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా?
 ‘అంతఃపురం’లో ప్రకాశ్‌రాజ్ పాత్రలాంటిది చేయాలి. అంతేకాదు... కైకాల సత్యనారాయణగారు నా రోల్ మోడల్. ఆయన చేయని పాత్ర లేదు. ఆయనలానే నేను కూడా రకరకాల రోల్స్ చేయాలి.


నటన కాకుండా మీకున్న మరో లక్ష్యం?
 సమాజ సేవ. మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదైనా చేయాలి. అందుకు రాజకీయాలు ఓ మంచి మార్గమని నా నమ్మకం. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరాను. తీరిక దొరికినప్పుడల్లా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను. వైఎస్సార్‌ని ఆరాధించేవాడిగానే కాదు... ఓ వ్యక్తిగా ఈ సమాజం పట్ల నా బాధ్యతను కాస్తయినా తీర్చుకోవాలన్నదే నా ఆశ, ఆశయం.
 - సమీర నేలపూడి

>
మరిన్ని వార్తలు