ఆవు గర్సిందంట

12 Dec, 2016 14:26 IST|Sakshi
ఆవు గర్సిందంట

ఆవు గర్సిందంట.
 ఏందీ..? ఆవు గర్సిందా?
 మందు దాగినోనికి ఆవేదో కుక్కేదో అర్తమైండదులే లేకంటే ఆవు గర్సేందేందీ...
 కలికాలం గాకంటే ఆవు గర్సుడేం ఏ పొద్దయినా సూచ్చిమా?...
 బెమ్మంగారాపొద్దే జెప్పినారు. గోవులు పూలులైతాయనీ...
 నక్కజిత్తులోడిని ఆవు గర్సిందంటా.
 (ఈ వ్యక్తి అసలు పేరేమిటో అందరూ మరిచిపోయారు.)
   
 మే ముఖం ఇటు దిప్పుకుని ఇంకొంచెం ముడుచుకో!...
 ఏమ్మా?  
 అదో మళ్లీ వాడొచ్చినాడే ముందు ఒకరోజు వచ్చి అయ్యతో మాట్లాడ్నాడు. మనందర్ని సూసినాడు. ఆ మరుసట్నాడు గౌరినీ, రాణినీ తీసుకుని బోయినాడు. వాళ్లింతదనకరాలా మళ్లీ ఒక రోజొచ్చినాడు. శివనీ రాజునీ తీసుకుని బోయినాడు. వాళ్లింతదనకరాలా. మళ్లీ ఒక రోజొచ్చినాడు. రాజునీ, కృష్ణనీ తీసుకునిబోయినాడు. వాళ్లూ ఇంటికి ఇన్నిరోజులైనా రానేలేదు. చెప్పింది అమ్మ.
 అమ్మ మాటలకి భయం వేసి అమ్మకు మరింత దగ్గరగా ముడుచుకున్నది దేవి.
 తనూ కళ్లు మూసుకుని వాళ్లేం మాట్లాడుకుంటారా? అని చెవ్వు ఆ వైపేసి ఉంచింది లక్ష్మి.
 ‘‘పొద్దన్నే ఇట్లొచ్చినావ్’’ అని జిత్తులోడిని అడిగాడు కృష్ణయ్య
 ‘‘ఏం ల్యాన్నా మీరెట్టుండారో సూడాలనిపించె’’ అన్నాడు జిత్తులోడు.
 
 ‘‘నాయ్‌నా అమ్మ టీయాకు పొట్లం దెమ్మన్యాది రెండ్రూ పాయ్‌లు గావాల’’ తండ్రి దగ్గరికి కొచ్చి చెయ్యి చాస్తూ అన్నది గిరిజ. ‘‘మీ యమ్మనే బోయి దీస్కరమ్మను. ఆ సాపు కాడ పన్లేని ఎదవనాయాల్లంతా కూసోనుంటారు. ఆడబిడ్డవి నువ్వేంటికి పోతావు’’ అంటూ చొక్కా జేబు లోంచి రెండ్రూపాయలు దీసిచ్చాడు. ‘ఈ దొంగ నాయాలు కోసరమనుకుంట ఈనికి టీగానీ ఏంటికి’ అనుకున్నాడు మనసులో. ‘‘అమ్మకు జొరమొచ్చినట్లుండాదంట. నన్నే బొమ్మన్యాది’’ అంటూ పావడ కొంచెం పైకి పట్టుకుని పరిగెత్తింది గిరిజ వీధిలోకి. ‘‘ఏంది కిట్టన్నా నీ కూతురు గురించి ఏం బెంగ బెట్కోగాకు బంగారట్ట బిడ్డ. మాంచి కోయేటి సంవందం దీస్కస్తా నేను’’ అన్నాడు హామీ ఇస్తున్నట్లు జిత్తులోడు.
 
 ఇంతకీ ఏం పనిమీద అది జెపబ్బీ... నిలదీసినాడు క్రిష్ణయ్య. ‘‘అదేంల్యా నీకు ఈతూరి గానీ బోర్ల నీల్ల బన్నేలా అప పుట్టబెట్టినట్టు బెరుగుతాంది. మొన్న నువ్వంపిన ఆవులకు వొళ్లిచ్చిన దుడ్డు వొడ్డీకీ జరిపాయె. అక్కకేమో ఆరోగ్గెం బాల్యాకపాయె. సిటీ ఆస్పత్తిర్ల తట్టు బోయినావనుకో లచ్చెలకు లచ్చలు నువ్వ్యాడదట్కుంటావా అనుకుంటి. పాపం కిట్టయ్యన్నకు ఇన్ని కట్టాలు ఒకేతూరి జుట్కున్న్యే అని మనసులో బాదనిపించి పలకరించి పోదావని ఓతూరి.. ఇట్లోస్తిని’’ జాలి కురిపించాడు జిత్తులోడు.

 ‘‘ఆ యావు మా ఆడ్ది పుట్టింటి కాడ్నించి దోడ్కోని వొచ్చినాది. పానం కన్నా జాచ్చిగ జూస్కుంటాది. ఇంగెపుడూ నన్నాశె బెట్టేకి సూడగాకు. వోట్ని నీతో అంపీను’’ అన్నాడు కిట్టయ్య జిత్తులోడిని చదివినట్లు. ‘‘ఎంత మాటన్యావన్నా... నాకేంటికన్నా నీకట్టం నాదన్కోని ఏదో సాయపడ్డామనుకోని ఆ బేరం దీస్కచ్చి గాను గానీ నీకిట్టం లాకంటే నాకేంటికి ఇదంతా’’ అన్నాడు జిత్తులోడు.  ‘‘నాకు ఆ పొద్దూ ఇట్టమయ్యి ఒప్కోలా. నా కన్నా నా బిడ్డకన్న ముందే నా సిన్నపుటాల్నించి ఆయావులున్నాయి మా ఇంట్లో. వాట్తో ఆడ్తా పాడ్తా పెరిగినా. అట్టాటి గోవులన్నిటిని పెద్దాయమ్మి పెండ్లి జేసేకి, రమేసుగాడు కోయేటు బోయేకని గొడ్లుగోసే వోల్లకి అమ్మితి. నా పాపం వుర్దా బోతాదా? అందుకే ఆ దేముడు నా ఇంటి దానికి పెద్దోల్లకొచ్చే యాదినిచ్చినాడు కిడ్డినీల జబ్బని.

ఎంత దుడ్డుబోసినా తగ్గేది గాదంట’’ గొంతు వణుకుతోంది క్రిష్ణయ్యకు పశ్చాత్తాపం బాధ రెండూ కలిసిన గొంతు. ‘‘పశువులుగా పుట్నా మనం సాకి సంతరించిన దానికి అయిన వాటి రునం దీర్సుకున్యాయనుకోవాల గానీ ఇట్ల ఇచ్చారం బడ్తారా ఎపురైనా? సర్లె సర్లె సూడు ఈటిని కాపాడుకునే ఇదానం, నీ సిన్నబిడ్డకి పెళ్లి జేసే ఇదానం. వొస్తా’’ అంటూ లేచాడు. ఆ మాటల్లో ఏదో హెచ్చరిక వినిపించింది క్రిష్ణయ్యకు. ఎన్నో బతుకులు ఎన్నో విధాలుగా తెల్లార్తున్నట్లే భళ్లున తెల్లారింది.
   
 ‘‘ఒరేయ్ నీ... యమ్మ ఎన్ని సోట్ల సెయ్యి సాపితినిరా నిన్ను కోయేటు బంపేకి సోంబేర్నాయాలా ఇమానం సార్జీలు గుడముట్టకుండానే తిరక్కొచ్చివే ఏమన్నాయం జేస్నాం రా. నిన్ను కన్యందుకు మమ్మల ఇట్లుసురు బెడ్తండావూ’’ అంటూ కొడుకును అప్పటికే నాలుగేట్లు ఏస్తా ఆక్రోసిస్తున్న కృష్ణయ్యకు, కొడుకు రమేష్‌కు మధ్యన అడ్డుగా నిలబడింది మునెమ్మ. భర్తను ఆపే ప్రయత్నం చేస్తూ కన్నీళ్లు తుడుచుకోలేక పోతోంది.  ‘‘య్యో రొంతుండుయ్యా ఏంటికొచ్చనాడని గానీ అడక్కండానే సెయ్యెత్తితే ఎట్లయ్యా? నిదానంగా అడగాల’’ అంటూ మొగుని వెనక్కి తోస్తోంది. రమేష్ కన్నీళ్లు జబ్బతో తుడుచుకుంటూ... ‘‘నాగ్గానీ పనీపాట లాకండా ఈడ తినేసి కూచోనేది ఇట్టవా? ఏం జేయ్యాల సూడిట్ల’’ అంటూ చకచక షర్టు గబగబ ఇప్పి ఈపు సూపించినాడు. తట్టులు తేలినట్లు వాతలు ఈపంతా.మునెమ్మ అమ్మ మనసు అవిసిపాయె.ఓర్నాయినా అంటూ కొడుకుని రెండు చేతల్తో సుట్టేస్కోని గుండెకత్తుకొని బావురుమన్నది. కృష్ణయ్య మనసు పిండినట్లనిపించినాది.
 
 ‘‘అనా అనా ఏమైనాడన్నా సెపనా’’ అంటూ గిరిజ రమేశ చెయ్యి పట్కోని ఊపి ఊపి అడుగుతుంది.
 ‘‘నన్ను దోడ్కోని బోయి ఓ సేటు కాడ పని సూపించి ఆ బుడాను ఎల్లబారిపోయినాడు. దీనార్లిస్తారు తిండి గిండీ బా.... బెట్తారు అని సెప్పి పాయె. ఆ సేటు సెప్పేదేందో నేనర్తం జేసుకోని పన్జేసే లోపట చాలకోలతో తోలూడగొడ్తాడు. కర్జూర సెట్లు నాటమంటాడు ఆ ఇసికలో తవ్వేకిగాదు. లేటయితే సావగొడ్తాడు. ఆడ నా మాదిరి పనేజేసేకి అరమోల్లు, కేర్లా ఓల్లు మనోల్లు ఓ ముప్ఫై మంది దనక ఉన్యారు. పని చానా కష్టమని చెప్పినారు. నిజంగా చానా కష్టంమ్మా...
 
 సెపలేస్కుంటే గబగబ నడ్సేకి గాదు వొదిలేస్నామా అరికాల్లు బొబ్బలెగర్తాయి. నన్నొదిలిపోయిన బుడాను అజా పజా లేదు. ఒకరోజు వొచ్చినాడు. ఆ పొద్దు నాకు దీనార్లిచ్చే దినమంట. నాకు దెల్దు బుడాన్ వచ్చి సగమెత్కోని సగం నాకిచ్చినాడు. అన్నా ఈ కష్టం పల్లేనని కాల్లబడి ఏడ్చినా. ఏం లాబంల్యా. రంజాను పండగొచ్చినా పొద్దు అడుగు వాల్లే ఛేంజి జేస్తారు. ఇంగేం చెయిలేం అని ఎల్లబారిపాయె. జొరమొచ్చినాది. ఆకలి సేత దుడ్డుల్యా. నా బాద సూల్లేక నాతో పనిజేసే తెలుగోల్లు వాల్లకి తెలిసిన దారిలో దుడ్లేస్కోని నన్ను ఊరికి అంపిచ్చిరి’’ ఏడుస్తా ఏడుస్తా తన బాదెల్లబోస్కోని దీనంగ నాయినతట్టు జూసినాడు రమేష్.
 
 కృష్ణయ్య కొడుకు బాదకు కరిగి ఓదారుస్తామని దగ్గరగా వస్తాంటే మల్లీ కొడ్తాడనుకోని చేతులడ్డం బెట్కోని ఎనక్కి వంగుతా బయం బయంగా సూస్తాన్య రమేష్‌ను జూసేతలికి కృష్ణయ్య కడుపు తరక్కపాయె. కొడుకు ఈపున చెయ్యేసి నిమిరి తలమీంద సెయ్యి పెట్కోని గుంజానుకుని కూలబడ్నాడు. రేయ్ నేనేం రాచ్చెసున్ని గాదురానీ అయ్యను. పానాల్తో నువ్ తిరుక్కోని వొచ్చిందే నాకు జాచ్చి. ఈడ్నే ఏ కాయో కసురో అమ్ముకుంటూ బతొకొచ్చు లేనాయ్‌నా’’ అన్నాడు రమేష్‌ను జూస్తూ.అందరూ తమను తాము ఓదార్చుకుంటూ కూలబడ్నారు. ఎవరి ఆలోచనలకూ అంతు దొరకడంల్యా. మునెమ్మ తేరుకోని లేసింది... ఉప్పిండి జేసి ఏడిగా తలారొంత బిడ్లకూ మొగునికీ పెట్దామనుకుంటూ.
   
 జిత్తులోడు ఆ ఊర్ల అన్ని యాపారాలకు, యవ్వారాలకు దలారి. పశువుల్ని సంతకి తోలిపీటం కబేలాలకంపించేకి రైతులను ఒప్పించటంలో అతనికి తిరుగులేదు. ఏ రైతుకి ఎంత అపలున్నాయో ఏ అప తీర్చుకునేకి పానాలైనా తాకట్టు బెడ్తారో కనిపెడ్తా ఉంటాడు. పొలాలైతే ఆ ఊరి సర్పంచుకే తాకట్టు బెట్టేలాగా ఆవుల గేదెలనైతే బెంగుళూరు కబేలాకే పంపించేలాగా ఏర్పాటు చేసేస్తాడు. ఈ మధ్యనే మరో అవతారం ఎత్తాడు. అరబ్బు షేకు పెళ్లి కొడుకులకి అమ్మాయిలను కుదిరించటం. రెండు చేతులా సంపాదన. పేరుకు బస్టాండులో ఓ టీ, సిగరెట్ల అంగిడి. అది అడ్డా అతనికి. ఊర్లో ఉండే తిరప్తి, రొంత దూరమున్న బెంగులూరు సిటీల్లో ఏదైనా ఆస్పత్రితో కలిసి రైతుల కిడ్నీలు అమ్మేదానికి కాంట్రాక్టు ఇప్పించుకుంటే లైఫ్ సెటిలైపోతాదనే దురమార్గపు ఆలోసెనలో ఉండాడు.  తన వృత్తిలో బాగంగానే కృష్ణయ్య కొడుకును కోయేటు బోయేమాదిరి రెచ్చగొట్టినాడు ఆవుల్ని అమ్మించినాడు. ఇంగో సంవత్సరం అట్టుంటే గిరిజను ఏ సేటు నా ఇచ్చి పెల్లి జేపిస్తే కోట్లు వొస్తాయి అనుకుంటున్నాడు. ఆ పనిమీదే పనున్యా లేకున్యా కృష్ణయ్య ఇంటికి వొస్తా పోతా వాల్ల కష్టాలకు బాగా సాయపడేవోని మాదిరి నకరాలు బడ్తాండాడు.
 
 కృష్ణయ్యకు అతని తీరు అర్తమైపోయింది.
 ఐనా సెడ్డోనితో స్నేగితం, ఇరోదం రెండూ సెబ్బరే అనుకోని జాగర్తగా మసలు కుంటాన్నాడు.
 గిరిజ దొడ్లేకి పరిగిత్తాబోయి గడ్డి పరకలు రోన్ని తీస్కోనొచ్చి లచ్చి ముందట ఉంచి కొన్ని దేవి ముందట పడేసి దేవీ తిను లచ్చీ తిను. అన్నొచ్చినాడు అమ్మ ఉప్మాసేస్తాంది మేం అందరం తింటాం. మీరుగానీ దినండి అంటూ దేవి గంగడోలు నిమరసాగింది. ఇంగ రమేసన్న మనల ఇడ్సి యాడికీ బోడంట. పాపం ఆదేశంలో అన్నకు బువ్వగానీ బెట్లేదంట చాకోల దీస్కోని కొట్నారంట ఈపంతవాతలు దేల్నాయి లచ్మీ... పాపం జొరవంట. ఈడికొస్తే నాయిన గొట్నాడు మల్లీ దగ్గర దీశ్నాడు లే... అంటూ చెపుతున్న గిరిజన వంక పెద్ద కళ్లతో ప్రేమగా చూస్తూ ఆపాప చేతి ప్రేమ నిండిన స్పర్శను అనుభవిస్తూ ఆనందిస్తున్నట్లు రెండు చెవులూ వెడల్పు జేసి శ్రద్ధగా ఆలకిస్తున్నాయి దేవి, లక్ష్మిలు. నిష్కల్మషమ ఐన గోవులకు నిర్మలమైన ఆ పసిపిల్లకు అనుబంధం అపురూపమైనది మరి.
 
 గిరిజ చేతిద్వారా ప్రసరించే నిష్కల్మష ప్రేమ మరింత కావాలన్నట్లూ కళ్లు అరయోడ్పు చేసి మెడ సాచింది దేవి. ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి ఏమ్మే బావున్నాయా నీ ప్రెండ్సు అంటు చెల్లి తలపై తట్టాడు. లచ్మిని, దేవిని గుడ పలకరించు అన్నది. గిరిజ యోరసాచి నిమరమన్నట్లు నిలుచున్న లక్ష్మిని మెడవద్ద నిమురుతూ ఒక్కుదుటన రెండు చేతుల దాన్ని కావలించుకుని నన్ను సెమించు లచ్చిమీ. ఆ పొద్దు గిరిగాని మాదిరి ఓయేటుబోయి దుడ్డు దీస్కచ్చుకోని పెద్దబండింగారు సైను ఏస్కోని ఊర్ల దిరగొచ్చుననుకోని గంగ శివ గౌరి రాజ అన్నిటి ఆ జిత్తులోడి పాలుజేసినా. వోట్ని బెంగులూరు దోడ్కబోయి కూరకు అమ్ముతారని నిజ్జంగ దెల్లా. ఆ ఉసురుదగిలి తిరక్కోనొచ్చినా అన్నాడు. ఏదో అర్థమైనట్లు మెళ్లో గంట గలగల్లాడేలా తల ఊపింది లచ్చ్మి.  మే గిరిజా రమేశా రండి నాయినా అంటూ మునెమ్మ పిలుపుతో ఈలోకానికి వచ్చినట్లు ఇంటిలోకి నడిచారు ఆ అన్నా చెల్లెళ్లు.
   
 కొక్కరొక్కో.... కొక్కోరొక్కో.... అంటూ లోకాన్ని నిద్రలేపాయి పల్లె పుంజులు. యాపపుల్లతో పల్లు తోముతా ఏరా యాడన్నా మేచ్చిరి పనికిబోతావా మీ మామతో జెప్పేదా తుపుక్కున పక్కనే అరటి పాదులో ఉంచుతూ... అడిగాడు కృష్ణయ్య. బ్రెష్‌తో పళ్లు తోముతా బంతి చామంతి మొక్కల కాడ బండమీంద కూచోనున్న రమేష్‌ను ఆ నాయ్‌నా నా ప్రెండు రాంక్రిష్ణ టౌనుకు రమ్మన్యాడు. మన్నాడు ఆడ ఐటీఐ మాదిర ట్రైనింగు ఇచ్చి జాబిచ్చేటిది కంపెనీ ఉండాదంట. మన్నాడు మంచి రోజని ఆపొద్దు రమ్మన్యాడులే. రేపు ఓ తూరిబోయి మంచి చెడ్డా ఇచురించుకుంటూ అన్నాడు రమేష్.స్టీలు సెంబు సిల్లర గిరిజ చాతబెట్టి పో అన్నకి నాయినకీ టీ దీస్కరా పో అంటూన్న. మునెమ్మ వాల్ల మాటలిని ఫ్చ్ వోణ్ణి నాల్రోజులు రెట్టెత్కోనిచ్చే ఏం బోతాంది అని గట్టిగా అంటే మగడు బాద పడ్తాడని స్వగతంలో గొణుక్కోని సరిపెట్టింది.
 
 ఆ పొద్దే బుద్దిగా సదూకోని టీచిరు టేనింగుకు బోయింటే అన్నాడు కృష్ణయ్య.  ‘‘లేల్లే నాయినా ఈతూరి ఈడ్నే మంచి పని జూసుకుంటూ నీకేం కట్టం రానీన్లే’’ అన్నాడు హామీ ఇస్తున్నట్లు ధీమాగా రమేష్. చెంబుపై కాగితం మూతబెట్కోని వేడి టీ దీస్కచ్చిన గిరిజ అనా టీ దాదూరా... అన్నది.  అబ్బ అన్నంటే ఏం పానం బెడ్తావ్ మే అంటే కూతురి ఈపన తట్టి కృష్ణ లోనికి నడిచాడు.
 
 లోనికెల్లి అప్పటికే అమ్మ సిద్ధంగా బెట్న లోటాల్లో టీ బోసి అన్న కోకిటి నాయిన కోకిటి జాగర్తగా అందిచ్చినాది గిరిజ. తన టీలో రొంత ఇంగో లోటాలో ఒంపి చెల్లె కిచ్చినాడు రమేశ. తన టీలో రొంత ఒంపి భార్యకు అందించినాడు కృష్ణయ్య. మన్నాడు వొద్దూ పొద్దన్నే ఐదూ ఐదున్నర మద్దెన నిద్దర్లేసి బీడి ముట్టించుకోని సెంబు దీస్కోని మడి తట్టుబోదామని ఈదిలోకి వొచ్చిన కృష్ణయ్యకు అందరూ అడావుడిగా పరుగెత్తుతాండేది ఔపడ్నాది.  రే.. బక్కోడా ఏమైందిరా.. జవాబు చెప్పకుండా పరిగెత్తాడు అతను.
 
 గుంపుగా వెళుతున్న కొందరిని ఆపి ఏందీ ఈరన్న ఏంటికంతా ఆడావడి పడుతున్నారు అని అడిగాడు.
 ఆ జిత్తులోడ్ని ఆవు కర్సినాదంటన్నా అని జవాబు చెప్పి వెళుతున్నారు. బుర్ర గోకున్నాడు కృష్ణయ్య. ఆవేమైనా కుక్కా? కన్సనేకి అనుకున్నాడు. టీకొట్టు రమణను చూసి ఏంది రమణ ఆవు కర్సిందంటన్నారు అన్నాడు సందేహంగా. ఔ మామ. ఆ జిత్తులోడు ఊళ్లో ఆవులన్నింటినీ కబేరాలంకి కోటీశ్పరుడౌదామనుకున్నాడా. గోమాతకు బాగా కోపమొచ్చెనో ఏమో. పెరిగిపెట్నాదంట జవాబు చెప్పాడు రమణ.  అటు వెళ్తున్న ఒకడు ఔ యో కండలూడొచ్చేల పీకింది చూసొచ్చినా అన్నాడు. ఇంతకు జిత్తులోడు ఏమన్నాడు మళ్ళీ రమణను అడిగాడు కృష్ణయ్య.
 
 టౌనాస్పత్రికి తోడుకు పోను వ్యాను కోసం చూస్తాండారు బట్టాండుకాడ అని చెప్పి రమణ కూడా అనే వెళ్లాడు.  కృష్ణయ్య కూడా అటు వెళ్ళే లోగా గిరిజ పరిగెత్తుకుంటూ వచ్చి నాయినా లచ్చిమొచ్చింది లోపలికి రా లోపలికి రా అంటూ కృష్ణయ్య లాగడానికి ప్రయత్నిస్తోంది. యాడ్నించొచ్చిందిమే నాకేమర్థంకావడం లే అన్నాడు కృష్ణయ్య. నానా కూతుళ్ళు ఇంట్లోకెళ్ళంగానే తలుపులు మూసి నాయన్ని గట్టుమీద కూచోమన్నట్టు చూపించింది గిరిజ.
 
 ఏందీమే అన్నాడు కృష్ణయ్య. నోటిదిగ్గర చేయిపెట్టుకుని రహస్యం చెబుతున్నట్లు  నాయినా రేత్రి అమ్మ నువ్వు పడుకున్నాక నాకు ఒంటికొచ్చాంటే జల్దాట్లోకి పోదామని లేస్తి. కిటికిలోంచి సూస్తే ఆ జిత్తులోడు మన లచ్చిని, దేవిని ఈడ్చకపోతున్నాడు. మూతికి గుడ్డలు కట్టేస్నాడు. అరిసేకి చేతగాలా. పాపం లచ్చిమి, దేవి తనకలాడతండాయ్. అయినా లాక్కపోతున్నాడు. నేను అన్నని నిద్దర్లేపినా. ఇద్దురుమూ కాన్‌రాకుండా దాక్కుని ఆనెంట పోయినాం.
 
 ఆడ ఒక యానుండాది. దానుండుకూ ఆవులు, దూడలుండాయి. లచ్చిమిని, దేవిని కూడా సెక్కేసి దాంట్లోకెక్కిచ్చినాడు. ఆ డేవర్‌ని లేపినాడు. ఓడు తాగి పడుకున్నాడేమో మూడుగంట్లకు పోతా పోరా అని మల్లా పడుకున్నాడు. రెండు గంట్లకు లేప్తారో అని చెప్పి జిత్తులోడు పనుకున్నాడు.  మేం రూంచేపటికి వాల్లు బాగా నిద్రపోనాక సపుడు రాకుండా యాను తలుపూడబెరికినాము. సెక్కేసి అన్నావులను దింపినాము. అన్నింటికి మూతులు కట్టేసుండాయ్. అర్సకుండా వాటిల్లకవి పరిగెత్తినాయ్. ఒక్క ఆవు మాత్రం పనుకోనున్న జిత్తులోడికాడికి పోయ్ కడుపు పట్కోని కరిసేసింది. అది మన లచ్చిమే. చిన్న రహస్యంగా అన్నది ఆ మాట!
 
 మన్నాడు వొద్దూ పొద్దన్నే ఐదూ ఐదున్నర మద్దెన నిద్దర్లేసి బీడి ముట్టించుకోని సెంబు దీస్కోని మడి తట్టుబోదామని ఈదిలోకి వొచ్చిన కృష్ణయ్యకు అందరూ అడావుడిగా పరుగెత్తుతాండేది ఔపడ్నాది.  రే.. బక్కోడా ఏమైందిరా.. జవాబు చెప్పకుండా పరిగెత్తాడు అతను.
 

మరిన్ని వార్తలు