నువ్ విజిలేస్తే... ఆంధ్రా సోడాబుడ్డి!

7 Nov, 2015 22:33 IST|Sakshi
నువ్ విజిలేస్తే... ఆంధ్రా సోడాబుడ్డి!

వెరీ ఇంట్రస్టింగ్...
మోహన్‌బాబు తీసిన ‘తప్పు చేసి పప్పు కూడు’ కోసం కీరవాణి ఓ ట్యూన్ చేశారు. వాళ్లేమో వేరే టైప్ అడిగారు. వాళ్లు వదిలేసిన ట్యూనే ‘నువ్ విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి!కీరవాణి సంగీతం అందించిన ‘కిష్కింధకాండ’లో ఓ పాట అంటే రాజమౌళికి ఇష్టం. ఆ ట్యూన్‌ని రిపీట్ చేసి ‘అమ్మయినా నాన్నయినా’ పాట చేశారు.
 
మార్నింగ్ షో అయ్యింది. విజయేంద్ర ప్రసాద్, ‘అమ్మ’ గణేశ్ థియేటర్లోంచి బయటికొచ్చారు. లంచ్‌టైమ్ దాటి పోయినా ఇద్దరూ ఆకలి అనేది మరిచిపోయారు. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగా ఉన్నారు. ‘వసంత కోకిల’ సినిమా వాళ్లనలా కుదిపి పారేసింది. ‘‘అబ్బా... క్లైమాక్స్ ఏం ఉంది గణేశ్! గుండెల్లో గునపం పెట్టి పొడిచేసినట్టుగా ఉంది’’ అన్నారు విజయేంద్రప్రసాద్.
 
 ‘‘ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు గురూజీ’’ అన్నాడు గణేశ్ తాదాత్మ్యంగా.
 ‘‘ఎందుకు రావు! మనమే చేద్దాం.ఈ క్లైమాక్స్‌నే ఇంటర్వెల్ చేసి, ఓ కథ చేద్దాం’’ అన్నారు విజయేంద్రప్రసాద్.
 
 ‘‘సూపర్ గురూజీ! మీరన్నారే గుండెల్లో గునపం అని. మన కథలో హీరోయిన్ కూడా హీరోని గుండెల్లో గునపంతో పొడిచేస్తున్నట్టుగా ఇంటర్వెల్ చేద్దాం’’... ఉత్సాహపడిపోయాడు గణేశ్.
 ‘‘ఛా అదేంటి? అలా బాగోదు’’ అన్నారు విజయేంద్రప్రసాద్. ‘‘లేదు గురూజీ. మీరు చేయండి. బాగుంటుంది’’... అన్నాడు గణేశ్.
 
విజయేంద్రప్రసాద్ స్టోరీ రైటర్‌గా బిజీగా ఉన్న సమయమది. ఆయనకు నలుగురు అసిస్టెంట్లు. వాళ్లల్లో ‘అమ్మ’ గణేశ్ చాలా చురుకు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టనిపించినా, కరెక్ట్‌గా చెబుతాడు. అందుకే విజయేంద్రప్రసాద్‌కి గణేశ్ అంటే గురి.మూడు రోజుల తర్వాత మళ్లీ సిట్టింగ్స్. గణేశ్ ఎంతకూ గునపాన్ని వదలడే! చివరకు విజయేంద్రప్రసాద్ ‘సరే’ అన్నారు. హీరోని హీరోయిన్ గునపంతో పొడిచిందంటే అదేదో పెద్ద అపార్థం ఏర్పడి ఉండాలి. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనే రూట్‌లో ఆలోచించుకుంటూ కథ అల్లడం మొదలుపెట్టారు విజయేంద్రప్రసాద్.
 
చకచకా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. బ్యాక్‌డ్రాప్ కూడా కొత్తది దొరికింది... కేరళ. అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. ఓ పని మీద హీరో జబ్బు నటించి, అక్కడకు వెళ్తాడన్నమాట. టైటిల్ కూడా ఓకే. ‘సింహాద్రి’. ముగ్గురు హీరోయిన్లు. ఈ కథ ఎవరికి రాసిపెట్టి ఉందో!?
బాలకృష్ణ - బి.గోపాల్ కాంబినేషన్‌లో సినిమా. మేడికొండ మురళీకృష్ణ ప్రొడ్యూసర్. చాలా కథలు వింటున్నారు. విజయేంద్రప్రసాద్‌ను పిలిచారు. బాలకృష్ణకు రెండు సూపర్‌హిట్ స్టోరీలిచ్చాడాయన. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి.  బి.గోపాల్‌కు ‘సింహాద్రి’ కథ విని పించారు విజయేంద్రప్రసాద్. గోపాల్‌కు నచ్చినట్టే ఉంది కానీ, బాలకృష్ణకు ఎంతవరకూ యాప్ట్ అవుతుందో డౌట్. ఇక ఈ కథను ఏ హీరో కరుణిస్తాడో!?
     
ఎన్టీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. ఏంటిది? అసలేం జరుగుతోంది? తనకేం అర్థం కావడం లేదు. వి.దొరస్వామిరాజు ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద నిర్మాత. తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ చేస్తున్నప్పుడే తనతో సినిమా చేస్తానని అడ్వాన్స్ ఇచ్చారు. పవన్స్ శ్రీధర్ అనే తమిళ దర్శకుడితో కథ వినిపించారు. క్లాస్ టచ్ ఉన్న కాలేజీ గోయింగ్ లవ్‌స్టోరీ. అంతా ఓకే. ‘నాగ’ సినిమా తర్వాత ఆయనకే డేట్స్. తీరా సినిమా మొదలుపెట్టే టైమ్‌కి తన ఇమేజ్ మొత్తం మారిపోయింది. ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’ దెబ్బతో తనో మాస్ స్టార్ అయిపోయాడు. క్లాస్ సినిమాలు చేయలేడు. చేయకూడదు.
 
కానీ ఇక్కడేమో ముందే కమిట్ అయిన కథ. దొరస్వామిరాజుని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే అయిష్టంగానే ఆ సినిమా చేస్తున్నాడు. కొంతవరకూ అయ్యాక దొరస్వామిరాజుకే డౌటొచ్చింది. తన అదృష్టం. ఆయనే ఆపేద్దామన్నాడు. మళ్లీ కొత్త కథ. కొత్త డెరైక్టర్. ఉదయ్‌శంకర్ వచ్చాడు. ‘కలిసుందాం రా’ లాంటి పెద్ద హిట్టు తీసినవాడు. కానీ అతని దగ్గర ఇమీడియట్‌గా కథ లేదు. ‘‘ముందు సాంగ్స్ తీద్దాం. ఈ లోగా కథ చేసేస్తా. టైటిల్ ‘కుర్రోడు’’’ అని అర చేతిలో సినిమా చూపించాడు. సరే... ఓకే. రెండు సాంగ్స్ తీసేశారు. ఈలోగా కథ రెడీ చేసి వినిపించాడు ఉదయ్‌శంకర్. ప్చ్! వర్కవుట్ కాదు. మళ్లీ కథ మొదటికి.
 
ఎన్టీఆర్ కథలు వింటున్నాడు. 1... 2... 3... 4... 10... 20... 50... 80... వింటూనే ఉన్నాడు. విసుగొస్తోంది. కానీ తప్పదు. తనకిది టఫ్ టైమ్. ‘అల్లరి రాముడు’, ‘నాగ’ సినిమాలు నాట్ శాటిస్‌ఫైడ్. ఈసారి కచ్చితంగా హిట్ సినిమా కావాల్సిన పరిస్థితి. లేకపోతే తను రేసులో ఉండడు. దానికి తోడు తనను నమ్మి దొరస్వామిరాజు ఇప్పటికే మూడున్నర కోట్లు ఖర్చుపెట్టారు. వీఎంసీ సంస్థను ముంచేశాడనే బ్యాడ్‌నేమ్ తనకు రాకూడదు. అందుకే ఆయనకు కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఇదీ ఎన్టీఆర్ స్ట్రెస్.
     
సేమ్ ఇలాంటి స్ట్రెస్‌లోనే ఉన్నాడు రాజమౌళి. డెరైక్టర్‌గా ఫస్ట్ సినిమా ‘స్టూడెంట్ నెం.1’ సూపర్ డూపర్ హిట్. కానీ ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షకుడు. దాంతో క్రెడిట్ అంతా ఆయన అకౌంట్‌లోకే వెళ్లిపోయింది.  ఫీలవ్వాలో, ఫీల్ కాకూడదో తెలీని సందిగ్ధావస్థ.  తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే కసి రాజమౌళికి. కె.రాఘవేంద్రరావే పిలిచి సెకెండ్ సినిమా ఆఫరిచ్చారు. వాళ్లబ్బాయి కె.సూర్యప్రకాశ్ ‘నీతో’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆ తర్వాత అతనితో రాజమౌళి సినిమా చేయాలి. రాజమౌళి - విజయేంద్రప్రసాద్ కూర్చుని ఓ ఫ్యాంటసీ కథ తయారు చేశారు. హెవీ బడ్జెట్ కావాలి. ఈలోగా ‘నీతో’ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. పాపం రాజమౌళి... ఇప్పుడేం చేయాలి?
     
ఆ రాత్రి ‘బొబ్బిలి సింహం’ సినిమా చూస్తున్నాడు ఎన్టీఆర్. ఖాళీ దొరికినప్పు డల్లా తాత పెద్ద ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణల సినిమాలు చూడడం ఎన్టీఆర్‌కి అలవాటు. ‘బొబ్బిలి సింహం’ అంతకు ముందు చూసినా, ఈ రోజెందుకో బాగా కనెక్టయిపోయాడు. చేస్తే గీస్తే ఇలాంటి సినిమా చేయాలి. అటు ఫ్యామిలీస్‌నీ ఇటు మాస్‌నీ ఆకట్టుకోవచ్చు. టైటిల్స్‌లోకి వెళ్లి రైటర్ ఎవరో చెక్ చేశాడు. విజయేంద్రప్రసాద్. నెక్స్ట్‌డే ఆయనకు కబురు వెళ్లింది.
 
‘‘సార్... ‘బొబ్బిలి సింహం’ లాంటి కథ కావాలి’’ డెరైక్ట్‌గా పాయింట్‌లో కొచ్చేశాడు ఎన్టీఆర్. విజయేంద్రప్రసాద్ చాలా కూల్‌గా ఓ కథ చెప్పాడు. నచ్చ లేదు. ఇంకో కథ. ప్చ్! మరో కథ. బాలేదు. నాలుగో కథ, అయిదో కథ... ఫలితం లేదు. ఫైనల్‌గా విజయేంద్ర ప్రసాద్ తన అమ్ముల పొదిలోంచి బ్రహ్మాస్త్రాన్ని తీశాడు... ‘సింహాద్రి’. ‘‘ఇది రాజమౌళి చేద్దామని పెట్టుకున్నాడు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’’ అంటూ రాజమౌళినే పిలిచి కథ చెప్పమన్నాడు.  మామూలుగా ఎన్టీఆర్ కథ వింటూనే తెగ అల్లరి చేస్తుంటాడు. అలాంటివాడు ఈ కథ వింటూ చాలా కామ్ అయిపోయాడు. అతనికి మాట రావడం లేదు. ఆకలి మీద ఉన్నవాడికి పంచభక్ష్య పరమాన్నాలు దొరకడమంటే ఇదే. ఇలాంటి కథే కావాలి. వెంటనే రాజమౌళిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ‘‘మనిద్దరం ‘సింహాద్రి’ చేస్తున్నాం’’ అని అనౌన్స్ చేసేశాడు. ఆ రోజు 2002, నవంబర్ 13.
     
డిసెంబర్ 20 నుంచి ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేశాడు. అంటే అయిదు వారాల్లో డైలాగ్స్ రెడీ చెయ్యాలి. కాస్టింగ్ అండ్ క్రూ ఫైనల్ చేసెయ్యాలి. పాటలు సిద్ధం చేయాలి. రాజమౌళి కసి మీద ఉన్నాడు. 24ఁ7 పనిచేస్తున్నాడు. స్క్రిప్టులో చిన్నా చితకా మార్పులు చేస్తున్నాడు. ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు. ఒకరు కట్. ‘బ్రేవ్‌హార్ట్’లో హీరోయిన్‌ని విలన్ పీక కోసి చంపడం, ఆ తర్వాత హీరో, విలన్‌ని చంపడం... ఈ రెండు సీన్లూ రాజమౌళికి చాలా ఇష్టం. అలాంటి సీన్ ఈ స్క్రిప్టులో కుదిరింది. సీతను చంపే సీన్. షూటింగ్‌కెళ్లే టైమ్‌కి ‘గంగోత్రి’ విశ్వనాథ్, ఎం.రత్నం ఇద్దరూ డైలాగ్స్ రెడీ చేసేశారు.
     
పెద్దన్నయ్య కీరవాణికి మొత్తం స్టోరీ నేరేట్ చేశాడు రాజమౌళి. ‘‘ముందు ప్రాజెక్ట్ కోసం కొన్ని పాటలు చేశాం. అవి వాడదామా?’’ అడిగారు కీరవాణి. రాజమౌళి ఆ పాటలు విన్నాడు. ఒకే ఒక్క పాట విపరీతంగా నచ్చేసింది. ‘‘ఈ పాట ఒక్కటీ తీసుకుందాం. మిగిలినవన్నీ ఫ్రెష్‌గా చేద్దాం’’ చెప్పాడు. ఆ పాటే ‘నువ్ విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి’. డిసెంబర్ 20న షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అన్నీ పెద్ద పెద్ద షెడ్యూల్స్. హైదరాబాద్, కేరళ, వైజాగ్... ఇలా చాలా చోట్ల తీశారు. కాస్టింగూ పెద్దదే.
 
రీ-రికార్డింగ్ కోసం కీరవాణి స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే స్క్రిప్టులో అంత స్కోప్ ఉంది. తమ్ముడు కల్యాణీ మాలిక్ ఆయనకు హెల్పింగ్ హ్యాండ్. ‘సింగమలై...’ బీజీయమ్ ఐడియా కళ్యాణీదే!  130 వర్కింగ్ డేస్... 8 కోట్ల బడ్జెట్... టోటల్ అవుట్‌పుట్ రెడీ. ‘సింహాద్రి’కి ఎక్కడలేని క్రేజ్. పదమూడున్నర కోట్ల బిజినెస్ అయ్యింది. 2003 జూలై 9. బాక్సాఫీస్ దగ్గర ఓ సునామీ. ఎక్కడ చూసినా ‘సింహాద్రి’ ప్రస్తావనే. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. ఈ దెబ్బతో రాజమౌళి సత్తా ఏంటో తెలిసొచ్చింది. ఎన్టీఆర్‌కు కరెక్ట్ కథ దొరికితే ఎలాంటి రికార్డులు పడతాయో చెప్పేందుకు ఇదే పెద్ద ఎగ్జాంపుల్.
 
ఎన్టీఆర్‌ను నమ్మినందుకు, కథను నమ్ము కున్నందుకు దొరస్వామిరాజుకు అద్భుత మైన రిజల్ట్. డిస్ట్రిబ్యూటర్‌గా సిల్వర్ జూబ్లీలో ఎంటరైన ఇయర్‌లోనే ఆయనకో మెమరబుల్ గిఫ్ట్. తన కొడుకు విజయ్ కుమార్ వర్మను నిర్మాతగా నిలబెట్టాలన్న ఆయన కల నిజం కావడానికి మంచి పునాది! కొన్ని సినిమాలంతే. హోల్‌సేల్‌గా అందరి కలలూ నెరవేర్చేస్తాయి.
 

మరిన్ని వార్తలు