-

దొరకునా... ఇటువంటి జాబు..!

9 May, 2015 23:52 IST|Sakshi
దొరకునా... ఇటువంటి జాబు..!

ఇదీ విషయం
రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఏం లాభం..? జస్ట్ హ్యాండ్ టు మౌత్.. బతుకు గానుగెద్దులా గడిచిపోతోంది. తలలు బద్దలు కొట్టుకుంటున్నా ఏం ఉపయోగం... వచ్చే శాలరీతో జేబు నిండటమే గగనం... అవసరాలు తీరేదెలా అని వగచే సగటు జీవులు మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటి సగటు జీవుల దీనగాథలు వింటూ, దుర్భర జీవితాలను కళ్లారా కంటూ ఎదిగే యువతరంలో కొందరు జ్ఞానోదయం పొందిన వారై, బాదరబందీలేవీ పట్టని బద్ధకస్తులుగా పరిణమించడం కద్దు. శుభ్రంగా తిని నిద్రపోవడంలో కుంభకర్ణుడే వాళ్లకు ఆదర్శం.

ఎదిగిన కుర్రాళ్లు చురుగ్గా, చొరవగా, కూసింత దూకుడుగా ఉండాలని ఆశించే తల్లిదండ్రులకు బద్దకిష్టి సుపుత్రులు ఒక పట్టాన కొరుడుకు పడరు. కూచుని తింటే కొండలైనా కరిగిపోతాయి.. వంటి సూటిపోటి మాటల తూటాలకు వారు ఎంతమాత్రం చలించరు. విజ్ఞులైన వారు లోకుల మాటలను చెవిన పెట్టి మనసు పాడుచేసుకోరనే సూత్రం వారికి బాగానే తెలుసు. అందుకే, ఎవరేమన్నా పట్టించుకోకుండా, మెలకువగా ఉన్నప్పుడు ముప్పూటలా భోంచేసి, మిగిలిన సమయాల్లో ముసుగు తన్నేసి ధ్యానముద్రలోకి జారుకుంటారు. కుంభకర్ణుడితో పోటీపడే ఇలాంటి బద్ధకస్తులకు ఉద్యోగాలెలా దొరకుతాయోనంటూ వారి తల్లిదండ్రులు బెంగపెట్టేసుకుని బీపీ, సుగర్.. వగైరా వగైరా జబ్బులు తెచ్చిపెట్టుకుంటుంటారు. అయితే, బద్ధకస్తులకు, వారి భవితవ్యం గురించి దిగులుపడి కుంగి కృశించిపోయే వారి తల్లిదండ్రులకు
ఓ శుభవార్త!

మరేం ఫర్వాలేదు. ఎలాంటి దిగుళ్లూ, గుబుళ్లూ అవసరం లేదు. ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ ఓన్ డే అన్నట్లుగానే ఎవ్రీ కౌచ్‌పొటాటో హాజ్ హిజ్ ఓన్ జాబ్ అనే రోజులొచ్చేశాయి. బద్ధకస్తులకు ఉద్యోగాలేమిట్రా నాయనా..! అని ఆశ్చర్యపోతున్నారా..? అలాగని అట్టే నోరు తెరిచిపెట్టుకోకండి.. ఈగలు జొరబడగలవు! బద్ధకస్తులకు ఓ బ్రహ్మాండమైన జాబ్ ఆఫర్ ఉంది.

ఈ ఆఫర్ చేస్తున్నదేమీ ఆషామాషీ సంస్థ కాదు, సాక్షాత్తు అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’. పని చేయకుండా పైసలిస్తారేంటి..? అనే అనుమానాలే వద్దు. ఇందులో చేరితే శుభ్రంగా బబ్బోవడం తప్ప వేరే పనేం చేయాల్సిన అవసరం లేదు. వ్యోమగాముల కోసం చేపడుతున్న పరీక్షల్లో భాగంగా ‘నాసా’ ఈ బెడ్‌రెస్ట్ ప్రాజెక్టు చేపట్టింది. తల కాస్త దిగువగా ఉంచి, కాళ్లు పైకి చాపి ఏకధాటిగా 70 రోజులు బజ్జుంటే, ఏకంగా 18 వేల డాలర్లు ఇస్తారు. ఇదీ సంగతి. దొరకునా.. ఇటువంటి జాబు..!
 - పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు