వారఫలాలు

11 Mar, 2018 07:11 IST|Sakshi

11 మార్చి నుంచి 17 మార్చి 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కార్యక్రమాలలో  విజయం. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుని లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అనూహ్యమైన రీతిలో పదోన్నతులు పొందుతారు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు తథ్యం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో «వృథాఖర్చులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో కొన్నిæ చికాకులు ఎదురైనా సర్దుబాటు కాగలవు.  పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన పరిచయాలు. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు. శ్రమ ఫలించే సమయం. వ్యాపారులు అనుకున్నంతగా  లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి కుటుంబసభ్యుల ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు   ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఊహించని ప్రగతి. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక  లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు.  ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.  ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులు అంది పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు విధుల్లో  అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం.. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో  చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలు తప్పవు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం దక్కదు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. . బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రాగలదు.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో మంచి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు పైస్థాయివారి సహాయసహకారాలు అందుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఒత్తిడులు. బంధువులతో మనస్పర్థలు తలెత్తి చిన్న చిన్న బేధాభిప్రాయాలు వస్తాయి. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలలో  ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం, పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. లేత పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (11 మార్చి నుంచి  17 మార్చి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏ పని చేస్తున్నా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటించండి. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు వారిచ్చే సలహాలు ఉపయోగపడతాయి. ఎవ్వరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. నెలాఖర్లో ఒక ఊహించని అవకాశం దక్కుతుంది.
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీకిష్టమైన వ్యక్తి నుంచి అందే సహకారం మిమ్మల్ని ఓ ప్రమాదం నుంచి తప్పిస్తుంది. అలాంటివారిని జీవితంలో ఎప్పటికీ దూరం చేసుకోకండి. వారాంతంలో ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకుంటారు. వ్యాపారం బాగా వృద్ధిలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనే దానిపై జాగ్రత్తగా ఉండండి. యోగా, వ్యాయామం చేస్తూ ఉండండి. ప్రశాంతత లభిస్తుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈవారం కొన్ని ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. పరిస్థితులను అర్థం చేసుకొని, ఆ పరిస్థితుల్లో మీకు సరైనదిగా కనిపించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లండి. ఇప్పుడు తీసుకునే మీ నిర్ణయాలు జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పేవి అయి ఉంటాయని తెలుసుకోండి. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీకిష్టమైన వ్యక్తి సలహాలు ఉపయోగపడతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానలు ఎప్పట్నుంచో వెతుకుతున్న మీకు, త్వరలోనే ఆ సమాధానాలన్నీ దొరుకుతాయి. చెడు ఆలోచనలను దూరం చేసుకోవడానికి రోజూ ధ్యానం చేయడం అలవర్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : ఊదా 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొన్ని విషయాలు మీరెంతగా ప్రయత్నించినా ముందుకు కదలవు. మీ ప్రేమ జీవితం సరిగ్గా ఇలాగే ఉన్న ఈ పరిస్థితుల్లో, ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడం ఒక్కటే మార్గమని తెలుసుకోండి. జీవితం అతి త్వరలో ఓ ఊహించని మలుపు తీసుకోబోతోంది. ఆ మలుపుకు ముందు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీదే మీ భవిష్యత్‌ ఆధారపడి ఉందని నమ్మండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. 
కలిసివచ్చే రంగు : వెండి 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
జీవితంలో ఏదో కోల్పోయినట్టు, ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతూ కూర్చోవడం వల్ల మీరు చాలా కోల్పోతున్నారు. కొత్త ఉత్తేజంతో పనిచేయాల్సిన సమయం ఇదే. చాలా అవకాశాలు మీకు దగ్గరగా వచ్చి ఉన్నాయి. మీ ఆలోచనా విధానం మారడంతోనే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తిని ఎప్పటికీ దూరం చేసుకోకండి. రాబోయే రోజుల్లో వారిచ్చే సలహాలే మిమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ఇప్పటికే చాలా సమయాన్ని వృథా చేశారని తెలుసుకోండి. ఒక గొప్ప అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. అవసరమైన పరిస్థితుల్లో, కొన్నింటిని సున్నితంగా తిరస్కరించే స్వభావాన్ని అలవర్చుకోండి. ప్రేమించిన వారికోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరే ఓడిపోవాలనుకుంటే తప్ప ఎవ్వరూ తగ్గించలేరని తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : నీలం 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈవారం మీరు చాలా సంతోషంగా గడుపుతారు. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ సర్దుకుంటాయి. ఓపికతో ఎదురుచూస్తూ, మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. విజయం మీవైపే ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : బంగారం 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ జీవితం కొన్ని ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈవారం జీవితాశయం వైపుకు తొలి అడుగు వేస్తారు. అతి త్వరలో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుందన్న నమ్మకంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమని మరచిపోకండి. కొన్ని విచిత్రమైన కారణాలను వెతుక్కొని మరీ పనులను వాయిదా వేసే మీ స్వభావం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తికి అండగా నిలబడి మీ ప్రేమను చాటుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : ఊదా 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ సర్దుకుంటాయి. కొత్త ఉత్సాహంతో, కొత్త జీవితాన్ని మొదలుపెడతారు. ఈ ప్రయాణంలో మీకు పరిచయం అయ్యే ఓ వ్యక్తికి అతి తక్కువ కాలంలోనే బాగా దగ్గరైపోతారు. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఈ శుభ పరిణామాలన్నీ మీలో ఉత్సాహాన్ని తారాస్థాయికి తీసుకెళతాయి. ఇలాంటి సమయంలో ఒక్క తప్పటడుగు వేసినా మీ శ్రమంతా వృథా అవుతుందని మరచిపోకండి. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ కలలన్నీ నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆ కలల్ని అందుకునేందుకు చేస్తోన్న ఈ ప్రయాణంలో ఎక్కడా అలిసిపోకుండా, పనిమీద ఇష్టం కోల్పోకుండా ఉండండి. ఇదే మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రకు కూడా సన్నాహాలు చేసుకుంటారు. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.
కలిసివచ్చే రంగు : ఊదా 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం ఎప్పట్లానే సంతోషంగా గడుపుతారు. వరుసగా అవకాశాలు వచ్చిపడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవి, మీ ఉన్నతికి దోహదపడేవి ఎంచుకోండి. మీరు ఎంతగానో కలలుగన్న ఒక విషయం ముందుకు కదలడానికి మరికొంత సమయం పడుతుందని గ్రహించండి. ప్రేమ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పవు. ఇవన్నీ మీ బంధాన్ని మరింత బలపరిచేవని తెలుసుకోండి. ప్రేమించిన వారికి ఎక్కువ సమయం ఇవ్వండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : గులాబి   
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

మరిన్ని వార్తలు