ప్రాణాలకన్నా లాభార్జనే మిన్న!

4 Apr, 2020 00:37 IST|Sakshi

విశ్లేషణ 

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రానురానూ పెరిగిపోతూ అమెరికాలోనే కరోనా రోగుల సంఖ్య లక్షకుపైగా చేరుకున్నప్పుడు, వైరస్‌ బారినపడి మరణిస్తున్న వారి జాబితా పెరిగిపోతున్నప్పుడు ఆ దేశంలో బిలియనీర్లు మాత్రం ప్రజలకు కలుగుతున్న నష్టాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం.. పైగా తరిగిపోతున్న తమ లాభాల గురించే తెగ ఫీలయిపోతూ వాణిజ్య కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు లక్షలమంది మరణించినా సరే.. కరోనా రోగుల ఆ బలిదానం వ్యవస్థ మనుగడకు అవసరం అంటున్నారంటే కార్పొరేట్లకు మానవ ప్రాణం కంటే లాభార్జన ముఖ్యమన్నమాట

ఒక విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. బర్క్‌లీలోని కాలిఫోర్నియా యూని వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాబర్ట్‌ రీచ్‌ ప్రస్తుత ప్రపంచ సమస్య గురించి ఒక్కమాటలో చెప్పేశారు. ‘అసలు సమస్య వైరస్సే... ఆర్థికం కాదు..’. మానవ ప్రాణాలను ముందుపీఠిన ఉంచి ఆర్థిక లక్ష్యాలకేసి తర్వాత దృష్టి సారించాలంటూ జీ–20 దేశాధినేతలకు హితవు చెప్పనప్పుడు ప్రధాని నరేంద్రమోదీ సరిగ్గా రాబర్ట్‌ రీచ్‌ మాటలనే ప్రతిధ్వనించారు. కానీ ప్రాణాంతక కరోనా వైరస్‌ సాంక్రమిక వ్యాధిని నిరోధించే విషయమై ప్రపంచం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ కోసం మనుషులను ప్రత్యేకించి వృద్ధులను బలిదానం చేయాల్సిందేననే స్వరాలు పెరుగుతున్నాయి.

 టెక్సాస్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డేన్‌ పాట్రిక్‌ దీన్ని మరింత మొరటుగా వ్యక్తీకరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షేమం కోసం, యువత క్షేమంకోసం దేశంలోని వృద్ధులు తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేశారు. ప్రజలు కరోనా బారినుంచి తప్పించుకోవడానికి తెలివిగా ఉండాలని, అదే సమయంలో వారు తమ తన పనులకు తిరిగి వెళ్లాలని కోరారు. కానీ స్వయంగా ఆరుమంది పిల్ల లకు తాత అయిన పాట్రిక్‌ వారికోసం తన ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాటవరుసకైనా ఆయన చెప్పకపోవడం వింతగొల్పుతుంది. తాను కూడా స్మార్ట్‌గానే ఉన్నట్లు తాను భావిస్తున్నట్లుంది. పైగా తక్కిన సమాజం నుంచి భౌతిక దూరం పాటించడం పట్ల సంపన్నవర్గం ఎప్పటినుంచో స్మార్ట్‌గా ఉంటోందని మనందరికీ తెలుసు కదా.

ప్రత్యేక ఎయిర్‌ ఫిల్టరేషన్‌ వ్యవస్థలను కలిగిన బంకర్లను కొనుగోలు చేస్తున్నదీ, సంవత్సరం పాటు ఆహార సరఫరాకు హామీనిచ్చే ఎస్కేప్‌ టన్నెల్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నది కూడా ఈ స్మార్ట్‌ సంపన్నవర్గమే మరి. కానీ, డేన్‌ పాట్రిక్‌ ఒక్కరే ఇలాంటి క్రూరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. కొద్దిమంది వ్యక్తులను పోగొట్టుకోవడం కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మూసివేస్తే ఎదుర్కొనాల్సిన నష్టాలు చాలా ఘోరంగా ఉంటాయని అమెరికా బిలియనీర్‌ టామ్‌ గొలిసెనో మీడియా ముందే చెప్పేశారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రానురానూ పెరిగిపోతూ అమెరికాలోనే కరోనా రోగుల సంఖ్య లక్షకుపైగా చేరుకుంటున్నప్పుడు, కరోనాబారిన పడి మరణిస్తున్న వారి జాబితా పెరిగిపోతున్నప్పుడు ఆ దేశంలో బిలియనీర్లు మాత్రం జాతికి కలుగుతున్న నష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తరిగిపోతున్న తమ లాభాల గురించి తెగ ఫీలయిపోతూ అర్జెంటుగా వాణిజ్య కార్యకలాపాలను మళ్లీ ప్రారం భించాలని ఒత్తిడి చేస్తున్నారు.

ఇప్పటికే ప్రపంచ జనాభాలో సగం వాస్తవంగానే గృహనిర్బం ధంలో ఉంటూ, పరిశ్రమలు షట్టర్లు మూసివేస్తున్నప్పుడు, జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నప్పుడు పేరుమోసిన పెట్టుబడిదారీ పత్రిక వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన సంపాదకీయంలో ఏమి రాసిందో చూస్తే పెట్టుబడిదారుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆర్థమవుతుంది. కరోనా వైరస్‌ షట్‌డౌన్‌ పట్ల తిరిగి ఆలోచించడం ఎలా అనే  పేరుతో వచ్చిన ఆ సంపాదకీయం.. ‘ఆర్థిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ సమాజం కూడా ప్రజారోగ్యాన్ని దీర్ఘకాలంపాటు కాపాడలేదు’ అని కార్పొరేట్‌ రంగానికే సాధ్యమైన హితవు చెప్పింది. అయినా మీకు ఇంకా షాక్‌ తగలకుంటే, న్యూయార్క్‌ టైమ్స్‌లో కాలమిస్టు థామస్‌ ప్రీడ్‌మన్‌ రాసింది ఒకసారి చూడండి. ‘కరోనా వ్యాధి బారినపడి అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నవారు కరోనా వైరస్‌కు బలవడాన్ని కొనసాగిస్తూనే మనలో ఆ వైరస్‌ బారిన పడినవారు కోలుకుని తిరిగి పనికి వెళ్లేలా చూద్దాం’. మానవ ప్రాణాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేనప్పుడు కరోనా వైరస్‌ సోకి సంభవి స్తున్న మరణాల రేటు అనేది గణాంకాల కూర్పుగానే మారిపోతుంది. భారత్‌లో రైతుల ఆత్మహత్యలపై విధాన నిర్ణేతలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా ఇలాగే ఉంటోంది కదా.

అమెరికన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘సమస్యకంటే నివారణను ఘోరమైనదిగా చూడలేం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మనం ఏవైపు పయనించాలన్న విషయమై 15 రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం’. అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రేటు పెరిగిపోతున్న సమయంలో ట్రంప్‌ ఇలా పేర్కొన్నారు. మరోవైపు అమెరికాకు ఎంతో దూరంలో ఉన్న బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనరో అయితే కరోనా వైరస్‌ని పెద్దగా పట్టించుకోనవసరం లేని చిన్న ఫ్లూ అని చెప్పేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశంతోనే సంక్షోభాన్ని మరింత పెద్దది చేసి చూపుతూ ప్రజలను ఏమార్చడానికి మీడియా కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి తాను అనుకూలం కాదని కూడా తేల్చేశారు.

సంపన్నులు, శక్తిమంతుల నుంచి ఇలాంటి మొరటు స్పందనలు గమనించాక మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామని ఆశ్చర్యపోక తప్పదు. మానవ చరిత్రలో విషాదాల్లో కెల్లా అత్యంత విషాదకర ఘటనగా ఆర్థికవేత్తలు కరోనా వైరస్‌ను చూస్తున్నప్పుడు ఇలాంటి మొరటి స్పందనలు ఎలాంటి ఫలితాలను చూపిస్తాయో అర్థం కావ డం లేదు. పైగా చరిత్ర నిర్ణాయక దశల్లో సంపన్నుల, ప్రభువుల అభిప్రాయాలు ఇంతకు మించి భిన్నంగా ఉండేవి కాదు. 1943లో బెంగాల్‌ దుర్బిక్షం సందర్భంగా లక్షలాది మంది (40 లక్షల మంది) మరణిం చినందుకు కారణాలు ఏమిటని బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు నాటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ సమాధానమిస్తూ దారిద్య్రంతో మగ్గుతున్న వీళ్లు ఎలాగైనా చనిపోక తప్పదు అనేశారు. అయితే నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌ చేసిన పరిశోధన ప్రకారం 1943లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదని తెలిసింది. కానీ ఆహార ధాన్యాలను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించినందు వల్లే బెంగాల్లో దుర్భిక్షం చెలరేగిందని సేన్‌ చెప్పారు.

అయితే పేదప్రజలకు ఆహారం అందకుండా చేసినవారిని తప్పు పట్టడానికి బదులుగా విన్‌స్టన్‌ చర్చిల్‌ మరీ ఘోరమైన వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. భారతీయ నిరుపేదలు ఎలుకల్లాగా ఆహారాన్ని మేసేస్తున్నారని అందుకే దుర్భిక్షం సంభవించిందని చెబుతూ చర్చిల్‌ భారత పేదలపైనే ఆరోపణ చేశారు. అంతకంటే ముందు 1845–49 మధ్య కాలంలో ఐరిష్‌ దుర్భిక్షం సమయంలో పది లక్షలమంది ఆకలిదప్పులతో మరణిం చగా, మరొక పది లక్షల మంది వలసపోయారు. ఆకలిదప్పులతో జరిగిన మరణాలకు దుర్భిక్షం మాత్రమే కారణం కాకపోవచ్చు.

ఐర్లండ్‌లోని కోర్క్‌ ప్రాంతంలో ఐరిష్‌ దుర్భిక్షం 150 వార్షికోత్సవం నిర్వహించిన సందర్భంగా ఆ నగర మేయర్‌ తన ప్రారంభ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆనాడు బంగాళాదుంపలకు తెగులు సోకి పంట మొత్తంగా దెబ్బతినిపోయి ఆకలితో ప్రజలు చస్తున్నప్పుడు ఆనాటి బ్రిటిష్‌ వలసాధిపతులు బ్రిటన్‌కు ఓడలకొద్దీ మొక్కజొన్నలను పంపించే పనిలో మునిగిపోయారు, నాటి ఐర్లండులో ఎలాంటి సమాజం ఉనికిలో ఉండేదో దీన్ని బట్టే తెలుస్తుందని కోర్క్‌ మేయర్‌ చెప్పారు. దాదాపు 2 కోట్ల 50 లక్షలమందిని బలితీసుకున్న 1918లో చెలరేగిన స్పానిష్‌ ఫ్లూతో సహా ఆకలి చావులనుంచి సాంక్రమిక వ్యాధుల దాగా సమాజంలోని కొందరు కులీనవర్గాలు కోట్లాదిమంది సామాన్యులను పీడించిన దాని ఫలితమేనని పలువురు రాజకీయ ఆర్ధశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

సమాజం అతలాకుతలమవుతున్న సమయాల్లో కార్పొరేట్లు సంక్షోభాన్ని ఎలా తమకు అనువుగా మల్చుకుంటాయో రాబర్ట్‌ రీచ్‌ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించాలని మేం చెప్పినప్పుడు మనకంత శక్తిలేదని సమాధానం వచ్చినట్లు అమెరికన్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ చెప్పారు. కానీ, స్టాక్‌ మార్కెట్లు కూలిపోతున్నప్పుడు కూడా దేశంలో డబ్బుకు మాత్రం కొదవలేకుండా చేశారు. పైగా మదుపుదారుల భయాందోళనలను ఉపశమింపచేసేందుకు అమెరికా ప్రభుత్వం 1.5 ట్రిలియన్‌ డాలర్లను మార్కెట్లో కుమ్మరించింది. ప్రపంచమంతటా ఇదే జరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్తంభించిపోయి ఉన్నప్పుడు ఆర్థిక చింతనలో నాటకీయ మార్పును ఎదుర్కోవలసి వస్తున్న ప్రపంచంలో తప్పకుండా ప్రవర్తనా పూర్వకమైన మార్పును మనం చూడగలమని ఆశిద్దాం. కరోనా వైరస్‌ సాంక్రమిక వ్యాధి పట్ల ప్రపంచ స్పందన ఇప్పుడు సరైన దారిలోనే సాగుతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంపైనే ప్రపంచం మొత్తంగా దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సమాజం స్పందించకముందే మూడు వారాలపాటు లాక్‌ డౌన్‌ ప్రకటించిన భారత ప్రభుత్వం సకాలంలో సరైన చర్యను తీసుకున్నట్లే చెప్పాలి. ఈ సంక్షోభం నుంచి మీరు బతికి బయటపడితే అప్పుడు ఆర్థికవ్యవస్థను పునర్మించవచ్చు మరి.


దేవీందర్‌ శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు