పౌరసత్వ నిరూపణకు మతం ఆధారమా?

18 Mar, 2020 00:44 IST|Sakshi

సందర్భం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద, చిన్న మతాలన్నీ శాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందక ముందు, ఈ భూగోళం ఎలా ఏర్పడిందో తెలియకముందు, సృష్టి రహస్యం తెలియకముందు పుట్టినవే. మతాన్ని కారల్‌మార్క్స్‌ మత్తుమందు అన్నాడు.  మతాలు ఎందుకు పుట్టినా ప్రపంచవ్యాప్తంగా హింసాయుత సంఘటనలకు దారితీశాయి. మతాల కోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం వచ్చి సృష్టి రహస్యాన్ని ఛేదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్క మతమూ పుట్టుకు రాలేదు. మతాల స్థానంలో బాబాలు పుట్టుకొచ్చారు.

డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం, ఐన్‌ స్టీన్‌ థియరీ ఆఫ్‌ రిలేటివిటీ, ఖగోళ శాస్త్ర పరిశోధనలు, ఇతర గ్రహాలకు పోయేంత టెక్నాలజీ, సృష్టికి ప్రతి సృష్టి చేయగల శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్, ఇంట ర్నెట్, ఐటీ, సెల్‌ఫోన్‌ లాంటి ఆవిష్కరణలు జరిగిన తర్వాత కూడా మతాలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. మానవ జాతిని ‘మనుషులు, మనీ షులు’గా ఐక్యం చేయకుండా మతాలుగా విభజిస్తున్నాయి. మానవ జాతినంతా కలిపి ఉంచే మానవత్వం అనే భావనకు దూరంగా ఉండటం వల్లనే మనుషుల్లో మత, కుల, జాతి, దేశ పరంగా విభజ నలు, విభేదాలొస్తున్నాయి.

ప్రపంచంలో ఎంత వైవిధ్యం, బహుళత్వముందో మతాలననుసరించడంలోనూ అంతే బహుళత్వముంది.  ఉండాలి. గ్రహాంతర సీమల్లోకి వెళ్ళి బతకగలిగే విషయాల గురించి పరిశోధనలు జరుగుతున్న సమయంలోనూ ఇంకా మతాలంటూ మానవజాతి విడిపోవడం, కుమ్ములాడుకోవడం, ఏ సంస్కృతికి నిదర్శనం?  ఫలానా మతం వాళ్లే తమ దేశంలో ఉండాలని దేశాలన్నీ ప్రకటిస్తే ఆయా దేశాల్లోని మిగతా మతస్తుల పరిస్థితేంటి?  

ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు ప్రపంచ యుద్ధ భయం, ఇంకో వైపు తీవ్రవాదంతో ప్రపంచం ప్రమాదపుటంచులో ఉంటే మతం పేరు మీద వివక్షతో మరీ ప్రమాదంలోకి నెట్టడం సరైందేనా? ప్రపంచవ్యాప్తంగా చూసినా ఏ ఒక్కదేశంలోనైనా వలసపోయిన వారు లేకుండా ఆదేశానికి సంబంధించినవారు మాత్రమే ఉన్నారా? భారతదేశానికి వలసవచ్చిన వారిలో మొదటివారు ఆర్యులు.  ఆ తర్వాత ముస్లింలు, ఆంగ్లేయులు పాలనాధికారులుగా వచ్చారు. అమెరికాలో ఉన్నవాళ్ళంతా యూరోపియన్‌ దేశాలు, ఇతర ఖండాల నుంచి వచ్చిన వారే కదా! భారతీయులు పాశ్చాత్య దేశాల్లోనూ, అన్ని ఖండాల్లోనూ ఉన్నారు కదా! 

వీళ్ళందరికీ పౌరసత్వం విషయంలో మతం, జాతి, కఠిన నిబంధనలు పెడితే అది ఎలా లభి స్తుంది? పౌరసత్వం పేరు మీద  ఓ మతం వారిని, చిరునామాలు కూడా నిరూపించుకోలేని దీనులను ఏరివేయడం న్యాయమేనా?  ధర్మసమ్మతమా? సవరణ చట్టంలో ఏ మతలబు లేకుంటే దేశ వ్యాప్తం గానూ, విదేశాల్లోనూ ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మతమేదైనా మానవత్వ పరి మళం విరజిమ్మినప్పుడే మానవజాతి మనుగడ భూగోళంపై సార్థకం అవుతుంది. 

సర్వమత సమానత్వాన్ని కోరుకునే భారతదేశంలో అనేక మతాలు, విభిన్న సంస్కృతులు, అనేక భాషలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంగా మనిషితనాన్ని కోరుకునే దేశంలో ఏ వివక్షా తగదని సీఏఏ గురించి అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేసింది తెలం గాణ ప్రభుత్వం. కులాతీత, మతాతీత రాజ్యాంగం అమలులో ఉన్న భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను మినహాయించి అని పేర్కొనడం చట్ట విరుద్ధమని ధైర్యంగా చెప్పిన నాయకుడు కేసీఆర్‌.

పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో అనేక కష్టాలకు గురయ్యే ఈ దేశ మూలవాసులకు, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ మత మైనారిటీలకు, చిరునామాలే లేని సంచార జాతులకు, తెలంగాణ పౌరులందరికీ అండదండగా నిలిచినందుకు తెలంగాణ సీఎం అభినందనీయులు. అలాగే జాతీయ పౌరపట్టికను రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తి లేదని ముస్లిం మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతైనా సంతోషించదగిన విషయం. ఈ అంశంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు బహిరంగంగానే విస్పష్టంగా హామీ ఇవ్వడంద్వారా ముస్లిం మైనారిటీలకు కొండంత అండగా నిలిచారు. మతం కంటే మానవత్వం ముఖ్యమని భావిం చాయి కాబట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికల గురించి సముచిత నిర్ణయం తీసుకున్నాయి. 

వ్యాసకర్త: డా. కాలువ మల్లయ్య,
రచయిత, సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 91829 18567

మరిన్ని వార్తలు