అమ్మ భాషను ఆశీర్వదిద్దాం

11 Dec, 2017 04:04 IST|Sakshi

దీర్ఘాయుష్మాన్‌ భవ!

ఒక భాష ఏ అవసరాలు తీర్చాలి?
పాలక భాషలో అన్నీ ఉన్నాయి, అవి నేర్చుకుంటే చాలు అనే అభిప్రాయం అశాస్త్రీయం. ఆ ఆలోచన అపరిపక్వతకు నిదర్శనం. భాష ప్రధానంగా ఈ క్రింది అవసరాలను తీర్చాలి:

1. ఉపాధి, ఉద్యోగ అవసరాలు
2. విద్యాబోధనా మాధ్యమం
3. పాలనా మాధ్యమం
4. పత్రికలూ, రేడియోలూ, టీవీలూ, సెల్లులూ, అంతర్జాలమూ
5. వినోదం, సినిమా, నృత్యం, నాటకాలు
6. ప్రజల దైనందిన వాడకంలో

ఇప్పుడు జరుగుతున్నదేమిటి?
పరభాష మాతృభాషా స్థానాన్ని ఆక్రమిస్తోంది.
తల్లిదండ్రులు ఇంట్లో ఇంగ్లి్లషు మాట్లాడుతూ బడి భాషా ఇంగ్లి్లషు అయినప్పుడు జరిగేది ఇదే. ప్రస్తుతం ఇది తక్కువ శాతంగా ఉన్నా రానురాను పెరిగి మన మాతృభాషలు పూర్తిగా మృతభాషలు అయ్యే ప్రమాదం ఉంది. ఈ సంధికాలంలో సమాజం సంక్షోభంలో కూరుకుపోతుంది.
మార్కెట్లు పూర్తిగా ఇంగ్లిషువాళ్ల పరమైపోతాయి. మనది అంటూ సొంతది ఏమీ మిగలదు. మనం దేన్నీ శాసించే స్థాయిలో ఉండం. ఇంగ్లిషే నిర్ణయాత్మకం అవుతుంది.
అందరికీ ఇంగ్లిషు రావడానికి 60 నుంచి 100 ఏళ్లు పడుతుంది. ఈ లోగా ఇంగ్లిషు వచ్చినవాళ్లూ రానివాళ్లూ అంటూ దేశం రెండుగా చీలిపోతుంది.
మన దేశం మళ్లీ ఇంగ్లిషు వలస దేశంగా మారుతుంది.
పిల్లలు బడికి వెళ్లినప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లినట్లుగా ఉంటుంది. వాళ్లు వాళ్ల తల్లిదండ్రులను, వాళ్ల తోటలను, వాళ్ల రోజువారి జీవన విధానాన్ని వదిలి వెళ్తారు. తరగతి గదిలో కూర్చుని వాళ్ల రోజువారీ జీవనానికి సంబంధంలేని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విషయాలను మాత్రమే నేర్చుకున్నందువల్ల పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. వాళ్లు సొంత విషయాలను తిరస్కరిస్తారు.

ఏం జరగాలి?
తెలుగు మాధ్యమానికి ప్రోత్సాహం తప్పనిసరి.
తెలుగు మాధ్యమంలో చదివిన వారికి కొంత శాతం ఉద్యోగాలు కేటాయించాలి.
రాష్ట్రంలో ఉద్యోగం కావాలనుకునే వారందరూ తప్పక తెలుగు నేర్చుకోవాలి.
రాష్ట్రంలో, దేశంలో అన్ని పరీక్షల్లో తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
తెలుగు వాళ్లకు సంబంధించిన సకల వ్యవహారాలు తెలుగులోనే సాగాలి.
అన్ని విశ్వవిద్యాలయాలలో వ్యవహారాలు తెలుగులోనే జరగాలి. తెలుగు తెలియని వారితో మాత్రమే ఆంగ్లంలో వ్యవహరించాలి.
అందుకు తగిన పుస్తకాలు, శిక్షణ, కంప్యూటర్‌ అవగాహన కలిగించటం ప్రభుత్వ బాధ్యత.
ప్రపంచంలో ఎవరైనా తెలుగు నేర్చుకోవటానికి ఆన్‌లైన్‌ శిక్షణను ప్రారంభించాలి.
ప్రపంచ భాషగా గౌరవప్రదమైన స్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

ఎలా జరగాలి?
తెలుగు భాషాపరిరక్షణ 2019 ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కావాలంటే అందుకు మనం చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళ్లాలి అనే విషయాలపై సరైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ఉద్యమ నినాదాలతో మాత్రమే ఇది ముందుకు వెళ్లదు. 2019 ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగు భాషాపరిరక్షణ పొందుపరిచేలా చూడాలి.
ముందుగా అసలు తెలుగు భాషాపరిరక్షణ అంటే మన ఉద్దేశమేంటో తెలియజెయ్యాలి. తెలుగు భాష ఏ స్థాయి వరకు మాధ్యమ భాషగా ఉండాలనుకుంటున్నాం? పరిపాలనా భాషగా ఏఏ రంగాల్లో అమలు పరచాలనుకుంటున్నాం వంటి విషయాలపై ముందు మనం ఒక అవగాహనకు రావాలి.
ఉన్నత చదువులు చదువుకొని పట్టణాల్లో నివసిస్తున్న వారికే మాతృభాష మాధ్యమంపై సరైన అవగాహన లేదు. ఎంత చెప్పినా వీళ్లు అంత త్వరగా మారకపోవచ్చు. వీళ్ల శాతం కూడా తక్కువ. అందువల్ల ముందుగా గ్రామీణ ప్రజలకు మాతృభాషా మాధ్యమం వల్ల లాభాలను తెలియజెయ్యాలి.
మాతృభాషా మాధ్యమం వల్ల, పరిపాలన భాషగా అమలు పరచడం వల్ల ఒనగూరే లాభాల గురించి ఒక నమూనా పత్రాన్ని రూపొందించాలి.

నమూనా పత్రంలో ఏముండాలి?
తల్లిదండ్రులకూ పిల్లలకూ ఇంగ్లిష్‌ భాషపై ఉన్న కృత్రిమ గౌరవాన్ని, వ్యామోహాన్ని తొలగించి, మాతృభాషపై గౌరవాన్ని పెంపొందించే అంశం.
మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలకూ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవచ్చు అన్న విషయం.
మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ భాషలను కూడా దశలవారీగా నేర్పడం జరుగుతుందన్న విషయం.
ఇంగ్లిష్‌ మాధ్యమం వల్ల పిల్లల్లో ఏ భాషా సరిగ్గా ఎదగదు అన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం.
మాతృభాషల్లో చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్న వారి దృష్టాంతాలను చూపించడం.
పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై, ముఖ్యంగా రమీరె, థామస్‌ అండ్‌ కాలియర్, జార్జి మాసన్‌ విశ్వవిద్యాలయం, మాలిలో చేసిన అధ్యయనాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వారు చేసిన అధ్యయనాన్ని అర్థమయ్యేలా వివరించడం.
భాషాధ్యయనంలోని ముఖ్యమైన, ఏక మూలాధార ప్రావీణ్యం, ఐస్‌బర్గ్, థ్రెషోల్డ్స్, బిక్స్, కాల్ప్‌ వంటి సిద్ధాంతాల సారాంశాన్ని అర్థమయ్యేలా వివరించడం.
పరభాషా, మాతృభాషా మాధ్యమాలపై ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ మాతృభాషా మాధ్యమంలో చదువుకున్న పిల్లలు చదువులో బాగా రాణిస్తున్నారని, మాతృభాషలో నైపుణ్యం ఉన్నప్పుడే రెండో భాష త్వరగా నేర్చుకోగలుగుతున్నారని తెలియజేస్తున్న విషయాన్ని సోదాహరణంగా అర్థమయ్యేలా వివరించడం.

- సురేశ్‌ కొలిచాల (భాషా పరిశోధకుడు)

మరిన్ని వార్తలు