అనుభవ మంటపంలో వెలుగు

29 Mar, 2018 00:55 IST|Sakshi

కొత్త కోణం

లింగాయత్‌ల ప్రత్యేక మత గుర్తింపు రాజకీయపరమైన సమస్య మాత్రమే కాదు. గౌతమబుద్ధుడు, మహావీరుడు, బసవన్న, గురునానక్‌ లాంటి వాళ్లు ఆశించిన సర్వమానవ సౌభ్రాతృత్వం ఆవశ్యకతను లింగాయత్‌ల రణనినాదం గుర్తుచేస్తున్నది. అసమానతలు, అవమానాలు, హత్యలు ఉన్నచోట ఆత్మరక్షణ, ఆత్మగౌరవ పోరాటాలు ముందుకురావడం గతి తర్కం. సమాజంలోని దోపిడీని, సమాజ పరిణామ క్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అసమానతలను ధిక్కరించే చైతన్యం కొత్తసత్తువను పుంజుకుంటూనే ఉంటుంది.

‘లింగాయత్‌లను ఒక కులంగా పరిగణించడానికి వీలు లేదు. ఇది వివిధ కులాలతో కూడిన ఒక మతం’. ఈరోజు కాదు, 1871లో మైసూర్‌ సంస్థానం జనాభా నివేదికలో ఇలా పేర్కొనడం గమనార్హం. అప్పుడు అది ఎటువంటి వివాదాలకూ తెరతీయలేదు. కానీ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం లింగాయత్‌ల ప్రత్యేక డిమాండ్‌ను గుర్తించి, మతపరమైన మైనారిటీ హోదాను కల్పిం^è డం రాజకీయ రంగు పులుముకుంది. నిజానికి లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. నాటి జనాభా లెక్కల ప్రకారం వీరిని ప్రత్యేక మతంగా గుర్తించినట్టు ఆధారాలున్నాయి. 

కానీ మైసూర్‌ సంస్థానం దివాన్‌ సి. రంగాచార్యులు లింగాయత్‌లను హిందూమతంలో భాగంగా చూడాలని (1881 జనాభా లెక్కల్లో) ఆదేశాలు జారీ చేయడంతో కథ మొదటికొచ్చింది. కొంతమంది విద్యావేత్తలు, మేధావులు లింగాయత్‌లూ వీరశైవులూ ఒక్కటేననే భావనను ముందుకు తేవడం వల్ల కూడా ఇటువంటి నిర్ణయాలకు దారితీసింది. హంగల్‌ పీఠాధిపతి నేతృత్వంలో 1904లో జరిగిన మహాసభలో వీరశైవులూ లింగాయత్‌లూ వేర్వేరు కాదనే తీర్మానం కూడా చేశారు. కానీ తీవ్ర వ్యతిరేకత కారణంగా 36 ఏళ్ల తర్వాత 1940లో అదే మహాసభ లింగాయత్‌లు హిందువులలో భాగం కాదని ప్రకటించుకున్నది. 

భారత రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించడం గురించి చర్చ జరిగినట్టు ఇటీవల మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ 2017లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌. నిజలింగప్ప, హెచ్‌. సిద్ధవీరప్ప, బి.ఎన్‌. మనవలి, రత్నప్ప కుంబార్‌ లాంటి వాళ్లు భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉండి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా జాతీయ నాయకత్వం పట్టించుకోలేదు. కానీ లింగాయత్‌ల ప్రత్యేక అస్తిత్వం కొనసాగుతూనే వస్తోంది. పదే పదే అదే డిమాండ్‌ని ముందుకుతెస్తూనే ఉన్నారు. 

గత రెండు దశాబ్దాలుగా విద్యావేత్తలు ఎం. ఎం. కల్‌బుర్గి (ఈయన కూడా మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు), వీరన్న రాజుర్, టి.ఆర్‌. చంద్రశేఖర్‌ లాంటి వాళ్లు వీరశైవుల, లింగాయత్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఎన్నో పరిశోధనలు నిర్వహించారు. వీరి కన్నా ముందు పకీరప్పగురు, బసప్ప హలకట్టి లింగాయత్‌ మత వ్యవస్థాపకులైన బసవన్న రాసిన 22 వేల వచనాలను సేకరించారు. ఇవి తాళపత్రాలు. వీరశైవులకు, లింగాయత్‌లకు మధ్య ఉన్న విభేదాలను పరిశోధకులు చాలా సంక్షిప్తంగా వివరించారు. దానితో లింగాయత్‌లు హిందూమతానికి ఆవల ఉన్నట్టు, వీరశైవులు హిందూమతం లోపల ఉన్నట్టు స్పష్టం అవుతుంది. 

వీరశైవాన్ని పంచ చార్యులు స్థాపించినా, లింగాయత్‌ మతాన్ని బసవన్న పాదుకొల్పారు. వీరశైవులు వేదాలను, ఆగమశాస్త్రాన్ని, ఇతర హిందూగ్రం«థాలను విశ్వసిస్తారు. లింగాయత్‌లు బసవన్న వచనాలను నమ్ముతున్నారు. వీరశైవులు అన్ని రకాల అసమానతలను పాటిస్తుంటే, లింగాయత్‌లు స్త్రీపురుష సమానత్వంతోపాటు, ఇతర విషయాలన్నింటిలో సమానత్వాన్ని కోరుతున్నారు, అనుసరిస్తున్నారు. వీరశైవులు శివాలయాల్లో విగ్రహాలతో పాటు శివలింగాన్ని పూజిస్తే, లింగాయత్‌లకు మెడలో ధరించిన ఇష్టలింగమే పవిత్రమైనది. దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించడం లాంటి హిందూ సంప్రదాయాలకు లింగాయత్‌లు వ్యతిరేకం. 

బసవన్న చరిత్రను చూడాలి
లింగాయత్‌ మహోద్యమం అర్థం కావాలంటే, దాని వ్యవస్థాపకుడు బసవన్న గురించి తెలుసుకోవాలి. బసవన్న క్రీ.శ.1106 సంవత్సరంలో శివారాధకులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆనాటికి కన్నడ ప్రాంతంలో కుల వ్యవస్థ ఎన్నో దురాచారాలను, మూఢనమ్మకాలనూ, అసమానత్వాలనూ, కులవివక్షనూ, అంటరానితనాన్నీ ప్రోత్సహిస్తున్నది. బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించి వేల ఎకరాల భూమిని అగ్రహారాల పేరిట సొంతం చేసుకుంటున్నారు. పురోహితులుగా, గ్రామాలకు నాయకులుగా మిగతా ప్రజలందరి మీద ఆధిపత్యం మొదలు పెట్టారు. అటువంటి కుటుంబంలోనే బసవన్న జన్మించారు. యజ్ఞోపవీత ధారణను ఆయన చిన్ననాడే తిరస్కరించారు. సంస్కృత భాష ఆధిపత్యాన్ని నిరసించి, నేర్చుకోవడానికి నిరాకరించారు. 12వ ఏట ఇల్లువదిలి వెళ్లిపోయారు.

ప్రజల్లో ఉన్న పేదరికాన్నీ, సమాజం నుంచి వెలివేతకు గురయ్యే ప్రజల గురించీ ఆయన ఆలోచించేవారు. మహిళల పట్ల ఆనాటి సమాజం చూపుతోన్న వివక్షను నిరసించారు. పుట్టుకతో అందరూ సమానులేనని స్త్రీ, పురుష భేదం పనికిరాదని ప్రగాఢంగా నమ్మారు. రాజాశ్రయం పొందిన పూజారులు యాగాల పేరుతో ధనాన్ని, సంపదను, అనేక ఇతర రకాలైన వనరులను ధ్వంసం చేసే చర్యలను బసవన్న అడుగడుగునా ప్రతిఘటించారు. దేవాలయాల పేరుతో దేవుడిని కొందరికే పరిమితం చేస్తున్నారనీ, పేదవాడికి, అట్టడుగున ఉన్న కులాలకు దేవుడు దూరమవుతున్నాడనీ అందువల్లనే
తాను దేవాలయాలను వివక్షా నిలయాలని ప్రకటిస్తున్నానంటూ బసవన్న ఆరోజుల్లోనే ఆధిపత్య భావజాలాన్ని తిరస్కరిస్తూ అణగారిన వర్గాల పక్షం వహించారు.

అనుభవ మంటపం
ఇంటినుంచి వెళ్లిన బసవన్న శైవుల కేంద్రమైన కూడల సంగమం చేరాడు. అక్కడ ఆయన జటవేదముని వద్ద ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాడు. జటవేదముని వద్ద పూజారి వర్గం అనుసరిస్తోన్న అనేక దురాచారాలలో అంటరానితనం ఒకటని గ్రహించాడు. బసవన్న మంగళకర సంస్థానంలో గుమాస్తాగా చేరి, కాలచురి రాజు బిజ్జెలుడి వద్ద ప్రధానమంత్రి పదవిని పొందారు. బసవన్న తిరుగుబాటుదారుడు మాత్రమే కాదు, సామాజిక సంస్కరణే ధ్యేయంగా నడుం బిగించినవారు. విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, కుల, మత దురాచారాలు నిర్మూలించడానికి ఒక కార్యాచరణను ప్రకటించారు. దానిలో భాగంగానే ఆయన ‘అనుభవ మంటపం’ అనే ఒక సామాజిక వేదికను ఏర్పాటు చేశారు. 

ఆ కాలంలో ఇది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. ప్రజలందరూ కుల, మత, లింగ, ధనిక, పేద భేదం లేకుండా ఒక్కచోట చేరి దైవ చింతనతో పాటు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చలు జరిపే అవకాశం బసవన్న కల్పించారు. ఈ క్రమంలోనే ఒక బ్రాహ్మణ యువతికి, అంటరాని కులానికి చెందిన యువకుడికి ఆయన వివాహం జరి పించారు. సనాతనవాదులు రాజు బిజ్జెలుడికి ఫిర్యాదు చేశారు. బసవన్న కుల కట్టుబాట్లను ధ్వంసం చేస్తున్నాడని, శైవమతాన్ని మంటగలుపుతున్నాడని పూజారులు చెప్పారు. అప్పుడు బిజ్జెలుడు బసవన్నను కుల కట్టుబాట్లను గౌరవిస్తున్నావా లేదా అని నిలదీశాడు. తాను కట్టుబాట్లను వ్యతిరేకిస్తున్నానని, నూతన వధూవరులిద్దరూ శైవ మతానికి చెందినవారు కాదనీ, వారు లింగాయత్‌లని స్పష్టంగా ప్రకటించారు. ఈ ఘటన తరువాత బసవన్న తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సంపూర్ణ సామాజిక సంస్కరణ బాధ్యతను తన భుజాలమీదకు ఎత్తుకున్నారు. కానీ అదే సంవత్సరం అంటే 1167 జూలై 30వ తేదీన బసవన్న తుది శ్వాస విడిచారు. 

ఇలాంటి పరిణామాలెందుకు?
బసవన్న జీవితగమనాన్నీ, ఆయన సాగించిన నిరంతర పోరాటాన్నీ తెలుసుకున్నవారెవ్వరైనా లింగాయత్‌లు హిందువులలో భాగం కారనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. ఇదే విషయాన్ని కన్నడ ప్రాంత చరిత్ర పరిశోధకులు కూడా చెబుతున్నారు. భారతదేశంలో లింగాయత్‌లాంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలు, సామాజిక విప్లవాలు ఎన్నో వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పటికీ ప్రత్యేక మతాలుగానే కొనసాగుతున్నాయి. గౌతమబుద్ధుడు స్థాపిం చిన బౌద్ధం, మహావీరుడు పెంచి పోషించిన జైనం, గురునానక్‌ పురుడు పోసిన సిక్కుమతం, అదేవిధంగా ఈరోజు మనం ఒక ప్రత్యేక మతంగా చూడబోతోన్న ‘లింగాయత్‌’లను అందులో భాగంగానే చూడాలి. లింగాయత్‌లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ హిందూమతం నుంచే వచ్చారని అందుకే వారంతా తమలోని వారేనని మనం చెబుతూ ఉంటాం. అయితే ఆయా మతాలు ఏర్పడడానికి, వాటి ఆవిర్భావానికీ కారణమైన కీలక విషయాలను ప్రస్తావించుకోం. నిజానికి వాటిని పట్టించుకొనే అవకాశాన్ని కూడా ఇవ్వం.

ఏ ఏ అంశాలను విభేదించి వీళ్లు ఒక ప్రత్యేక పాయగా కొనసాగుతున్నారో, వాళ్లు విభేదించే వారిలోనే వారిని భాగం చేసే పరిస్థితికి ఈ ఉదాసీనత దారితీస్తుంది. ఒకవైపు అందరూ సమానం అంటూనే వివక్షను, వెలివేతనూ, సమాజంలో మతం పేరుతో కొనసాగుతోన్న అమానుషాలను, మూఢత్వాన్నీ, అంధత్వాన్నీ చూసీచూడనట్టు ఊరుకుంటాం. భారతదేశంలో ఉన్న ప్రజలు వివిధ మతాలుగా, సామాజికవర్గాలుగా విడిపోవడానికి కారణమైన కుల వ్యవస్థను దానికి తాత్విక భూమికనిస్తున్న సిద్ధాంతాలను సంస్కరించుకోవడానికి మనం శ్రద్ధ చూపం. చివరకు చరిత్రలో ప్రేక్షకులుగా మిగిలి పోతాం. ఇప్పటికీ నూటికి 25 నుంచి 30 శాతంగా ఎస్సీ కులాలు, ఎస్టీ తెగలు హిందూమతానికి ఆవలనే ఉన్నాయి. ఆ కులాలకు, తెగలకు ఈ సమాజంలో ఇప్పటికీ ఎటువంటి కనీస మర్యాదలు, మనుషులుగా గుర్తింపులు లేవు. అంటే హిందూమతం ఒక సమూలమైన సంస్కరణకు నోచుకోకపోతే, ఇట్లా ఇంకా ఎన్నో అసమ్మతులు, నిరసనలు తప్పవు.

లింగాయత్‌ల ప్రత్యేక మత గుర్తింపు సమస్య రాజకీయపరమైన సమస్య మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక సంక్షోభానికి సంకేతం. గౌతమబుద్ధుడు, మహావీరుడు, బసవన్న, గురునానక్‌ లాంటి వాళ్లు ఆశించిన సర్వమానవ సౌభ్రాతృత్వం ఆవశ్యకతను లింగాయత్‌ల రణనినాదం గుర్తుచేస్తున్నది. అసమానతలు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలు ఉన్నచోట ఆత్మరక్షణ, ఆత్మగౌరవ పోరాటాలు కూడా ముందుకురావడం గతితర్కం. సమాజంలోని ఆధిపత్య వర్గాలు సమాజంలోని దోపిడీని, పీడనలను, సమాజ పరిణామ క్రమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అసమానతలను ధిక్కరించే చైతన్యం ఎప్పటికప్పుడు కొత్తసత్తువను పుంజుకుంటూనే ఉంటుంది. సరికొత్తగా తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూనే ఉంటుంది.

- మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213
 

మరిన్ని వార్తలు