కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్‌ చేయడం నిషేధం..కానీ..!

14 Nov, 2023 14:19 IST|Sakshi

కర్ణాటక ప్రభుత్వం మరోసారి  కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో  తలపై ధరించే అన్ని రకాల   దుస్తులను నిషేధించింది.  దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్‌లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు  నియామక  పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన  వెలువడింది.  బ్లూటూత్  డివైసెస్‌ ద్వారా  అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను  అరికట్టే చర్యల్లో భాగంగా  అన్ని రకాల హెడ్ కవర్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి  పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్‌ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. 

డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

2023 అక్టోబర్‌లో KEA నిర్వహించిన పరీక్షల్లో కలబురగి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ పరికరాలను ఉపయోగించారని ఆరోపించిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 11న రాష్ట్ర CIDచే విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్‌ను నిషేధించడం  పెద్ద దుమారాన్ని రేపింది. అయితే  కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు