విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే రోజా | Sakshi
Sakshi News home page

పేలిన ఇండిగో టైర్‌..  

Published Thu, Mar 29 2018 1:57 AM

Indigo Flight Tyre Burst during in Landing Time - Sakshi

సాక్షి, శంషాబాద్‌: ఇండిగో ఫ్లైట్‌.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది... ఇంతలో ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్‌వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో గొడవకు దిగారు.  

విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
సాక్షి, తిరుపతి: ‘శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్‌ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. తర్వాత పెద్ద కుదుపుతో రన్‌వే పై ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా. నేను, ఇతర ప్రయాణికులు వణికిపోయాం. అరగంట పాటు విమానం డోర్లు తీయలేదు. అగ్నిమాపక సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశార’ని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వెల్లడించారు. 

బుధవారం రాత్రి పది గంటలకు తిరుపతి ఎయిర్‌ పోర్టు నుంచి ఇండిగో విమానంలో ఆమె హైదరాబాద్‌ బయలుదేరారు. ల్యాండ్‌ అయ్యే సమయంలో విమానం టైర్లు పేలిపోయినట్లు తెలిసిందని రోజా సాక్షికి వివరించారు. మంటలు చూసి ప్రయాణికులందరూ ఒక్క ఉదుటన కిందకు దిగాలని ప్రయత్నం చేసినా, ఎయిర్‌హోస్టెస్‌ నిరాకరించడంతో సాధ్యం కాలేదన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని వెల్లడించారు.

Advertisement
Advertisement