సినిమాశుల్కం

26 Feb, 2019 02:39 IST|Sakshi

స్థలము : అమరావతిలోని ఇంకో ‘బొంకుల’ దిబ్బ  (బాబు ప్రవేశించును)

చంద్రబాబు: సాయం కాలమైంది. కాసేపట్లో ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు ఉంది. మహా నాయకుడు సినిమా గురించి వాళ్ళేం మాట్లాడతారోనని బెంగగా ఉంది. వాళ్లు నోళ్లు విప్పకముందే నాలుగు ఝాడిస్తే సరి.  
ఎవరా వస్తున్నది.. నా ప్రియ బామ్మర్ది బాలయ్య బాబులా ఉన్నాడు. ఇవాళ ఎన్టీఆర్‌ బయోపిక్కు రెండో పార్టు రిలీజై ఉంటుంది. ఈపాటికి కలెక్షన్ల రిపోర్టు బయటికి వచ్చే ఉంటుంది. ఇతగాడి వైఖరి చూస్తే ఈ బొమ్మ కూడా చీదేసినట్టే కనబడుతుంది. ఇతణ్ణి కొంచెం ఓదార్చక తప్పదు. ఆలి వంక చుట్టము ఆప్త బంధువు అన్నారు. ఆపై వియ్యంకుడు కూడానాయే.
(బాలయ్య బాబు ప్రవేశించును )
ఏమివాయ్‌ మై డియర్‌ బాలయ్య బాబూ, ముఖం వేల వేసినావ్‌?

బాల: ఇక మీర్నాతో మాట్లాడకండి. మీరు చెప్పినట్టు తియ్యడం వల్లే మన సినిమా అంత ఘోరంగా చంకనాకిపోయిందంటున్నారు మీడియా వాళ్లు.
చంద్ర: నాన్సెన్స్‌ .. మొదట్నించీ నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఈ మీడియా వాళ్లకి, ముఖ్యంగా సోషల్‌ మీడియా వాళ్లకి నన్ను చూస్తే గిట్టదు. అందుచేత బొమ్మ పోయిందంటున్నారు. లేకపోతే నువ్వేమిటి, సినిమా ఫెయిల్‌ కావడమేమిటి? వాళ్లని అసలు లెక్క చెయ్యకు.
బాల: మీ వల్ల నాకు వచ్చిందల్లా మీడియా వాళ్లని లెక్క చెయ్యకపోవడం ఒక్కటే. అసలు ఫస్టు పార్టు దొబ్బేసినప్పుడే మీ దగ్గర మొత్తుకున్నాను. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ ఆదుకుంటానని ఒక్క సారయినా ఒక్క ముక్క చెప్పిన పాపాన పోయినారూ?
చంద్ర: డామిట్‌.. ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వొస్తుంది. మొన్నటికి మొన్న నీ శాతకర్ణి సినిమాకి నూటికి నూరు శాతం వినోదప్పన్ను మినహాయింపు ఇవ్వలేదూ?  ఎన్టీఆర్‌ బయోపిక్కు ఫస్టు పార్టు కథానాయకుడుకి తెలంగాణలో ఇవ్వకపోయినా ఆంధ్రాలో స్పెషల్‌ షోలకి పెర్మిషన్‌ ఇవ్వలేదూ? వారం రోజులపాటు రోజుకి ఆరు షోలు చొప్పున వేసుకుని దున్నుకొమ్మని చెప్పలేదూ? ఇంతా చేస్తే ఆదుకోలేదని తప్పుపడుతు న్నావ్‌? దిసీజ్‌ బేస్‌ ఇన్గ్రాటిడ్యూడ్‌ బావా!  
బాల: ఎన్ని చేస్తే ఏం లాభం .. ఫస్టు పార్టుకి పెద్ద బొక్కే పడిందిగా బావగారూ!
చంద్ర: ముందు బూతులు ఆపవయ్యా మగడా!
బాల: (కళ్ళు తుడుచుకొనును) మీకేం తెలుసు బావగారూ నా ఆవేదన? ఫస్టు పార్టుకి మనం ఇచ్చిన హైప్‌ వల్ల ఫ్యాన్సీ రేట్లకి కొనుక్కున్న వాళ్ళంతా కోట్లు కోట్లు నష్టపోయి నెత్తిన చెంగేసుకున్నారు. మా నష్టాన్ని భర్తీ చేస్తావా, ఛస్తావా అని నా పీకల మీద కూర్చున్నారు. ఒక దశలో చెప్పిన రోజుకి రెండో పార్టు రిలీజు చెయ్యగలుగుతానా లేదా అని డౌటు కూడా వచ్చేసింది. మొత్తానికి కిందా మీదా పడి రెండో పార్టు రిలీజు చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు చూడండి, కథానాయకుడు కథని అడ్డం తిప్పితే మహా నాయకుడు మహా దెబ్బ కొట్టింది. మళ్లీ మీరే చక్రం వేసి ఒడ్డున పడెయ్యాలి బావగారూ!
చంద్ర: ఏం చెయ్యమంటావ్‌ బాలయ్య బావా.. పోనీ, మన పార్టీ సభ్యులంతా సకుటుంబ సపరివార సమేతంగా విధిగా టిక్కెట్లు కొనుక్కుని రెండో పార్టు చూడా లని హుకుం జారీ చెయ్యమంటావా ?
బాల: సముద్రంలో కాకి రెట్టంత ఆ కలెక్షన్‌ ఏం సరిపోతుంది బావగారూ! (అని నాలి క్కరుచుకొనును)
చంద్ర: సరేగానీ ఈ గండం గడిచే ఉపాయం చెబుతాను. వింటావా?
బాల: మీ శలవు ఎప్పుడు తప్పాను? డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు , థియేటర్‌ ఓనర్లు, ఆఖరికి కేంటీన్, కార్లూ, స్కూటర్ల కాంట్రాక్టర్లు కూడా నన్ను పీక్కు తినేస్తున్నారు. వీళ్ల బారినుంచి మీరే నన్ను కాపాడాలి.  
చంద్ర: అయితే నేనో ఉపాయం చెబుతాను. నేను కూడా హైదరాబాద్‌ వస్తాను. వీళ్ళందరితో ఓ మీటింగ్‌ పెట్టు.  
బాల: మీరు వస్తే బతికాను. వాళ్లకి వచ్చిన నష్టంలో సగం మీరు భర్తీ చేస్తారని చెప్పేద్దామా?
చంద్ర: ఓరి నా పిచ్చి బామ్మర్దీ.. అన్ని కోట్లు నేనెక్కడ్నించి తెచ్చి పోస్తాను? ఎలాగూ ఎలెక్షన్లు వస్తున్నాయి కదా..   వాళ్లెవర్నీ పార్టీ ఫండ్‌ అడగబోమనీ, అసలు వాళ్ల జోలికే రాబోమనీ హామీ ఇచ్చేద్దాం. దెబ్బకి శాంతిస్తారు.
బాల: ఆహా.. మీ బుర్రే బుర్ర బావగారూ!   (గురజాడ అప్పారావు గారికి క్షమాపణలతో..)

వ్యాసకర్త: మంగు రాజగోపాల్‌, సీనియర్‌ పాత్రికేయుడు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా