బోరుబావి రైతులను ఆదుకోరా?

30 Jan, 2019 00:46 IST|Sakshi

అభిప్రాయం

వర్షపునీటితో వ్యవసాయం చేయటమనేది అత్యంత ప్రాచీనమైన కళ. పంటభూమికి నీరందించటానికి మనకున్న ముఖ్యమైన నీటివనరులు మూడు. అవి 1. వర్షపాతం, 2.భూతలజలం, 3. భూగర్భజలం. తెలంగాణలో సగటు వార్షికవర్షపాతం 929 మి.మీ. ఇందులో నైరుతి ఋతుపవనాల ద్వారా రమారమి 67శాతం జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలల్లోనే లభిస్తుంది. 23శాతం వర్షపాతం ఈశాన్య ఋతుపవనాల ద్వారా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు లభిస్తుంది. ఇవి పోగా మిగతా పదిశాతం వర్షపాతం జనవరి నుండి మే నెలల మధ్య ఐదు నెలల్లో లభిస్తుంది. రాష్ట్రంలోని పంటభూమిలో ఒక కోటీæ 43 లక్షల ఎకరాలలో మూడింట ఒక వంతు భూమికి మాత్రమే నీటి వసతి ఉంది. ఈ నీటి వసతి కల్పిం చిన పంట భూమిలో మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా అప్పులు చేసి ఎన్నో బాధలుపడి బోరుబావుల ద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం చెరువులు, కుంటలు 41,131. వీటి కింద ఉన్న పారుదల 1956–57లో 5,30,565 హెక్టార్లుగా ఉన్నది. 2000–01 నాటికి 1,65,303 హెక్టార్లకు పడిపోయింది. అంటే ఐదు దశాబ్దాలలో చెరువులు, కుంటల కింద నీటిపారుదలలో తగ్గిన విస్తీర్ణం 8,50,000 ఎకరాలకు పైగానే ఉంది. అదే విధంగా కాలువల కింద పారకం 1990–91లో 3,38,276 హెక్టార్లుగా ఉన్నది 2000–01 నాటికి 1,62,315 హెక్టార్లకు పడిపోయింది. 

రాష్ట్రంలో వాణిజ్యపంటలవైపు మొగ్గుచూపు తున్న రైతులు ప్రాజెక్టులు, చెరువులు, కాలువల ద్వారా సాగునీరు లభించకపోవటంతో గత్యంతరం లేక బోరు బావులపై ఆధారపడుతున్నారని గత 50 ఏళ్ల గణాంకాలు చెబుతున్నాయి. 1970–71లో రాష్ట్రంలో 2,14,500 బోరుబావులుంటే 2017 నాటికి వాటి సంఖ్య 20,21,084కు చేరుకుంది. ప్రస్తుతం 22,50,000వరకు ఉంటాయని నిపుణుల అంచనా. ఒక్కో బోరుబావిపై రైతులు ఖర్చుపెడుతున్నది సగటున లక్షరూపాయలనుకుంటే ఇన్ని బోరుబావులపై రైతులు పెట్టిన ఖర్చు 22,500 కోట్లకు పైగానే ఉంటుంది. నేడు మనరాష్ట్రంలో 1,43,00, 000 ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉంటే అందులో సాగవుతుంది మాత్రం గరిష్టంగా ఒక కోటీ పది లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పంటభూమిలో మూడింట ఒకవంతు భూమికి సాగునీటి వసతి 6 భారీ, 30 మధ్యతరహా, 41.131 చెరువుల, కుంటల వ్యవస్థల ద్వారా ప్రభుత్వం గత కొంతకాలంగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కల్పించింది. 

నీటివసతి గల భూమిలో  మూడింట రెండువంతుల భూమికి రైతులే స్వయానా బోర్లద్వారా నీటివసతిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది ప్రశ్న? పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ఈ బోరుబావుల రైతులంతా చిన్నసన్నకారురైతులే. వీళ్లంతా అరెకరం నుండి ఐదు ఎకరాల లోపు వ్యవసాయభూకమతాలు కల్గిఉన్నవారే. వీళ్లలో మెజార్టీ రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు. 80శాతం పైగా బోరుబావులున్నవి వీళ్ల వ్యవసాయక్షేత్రాల్లోనే. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో 80శాతం వరకు ఈ కుటుంబాల నేపథ్యంలోని వారేనని నిపుణుల అంచనా. ఈ చిన్నసన్నకారు రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై, బంధుమిత్రులపై వ్యవసాయంలో తమ పెట్టుబడి అవసరాల కోసం ఆధారపడుతున్నారు. వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో రుణాలు తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

రాష్ట్రంలోని బోరుబావులలో 25శాతం బోరుబావులు మాత్రమే సేఫ్‌ జోన్‌లో ఉన్నాయి. మిగతావన్నీ డేంజర్‌ జోన్‌లోనివే. భూగర్భజలాశయం ఒకబ్యాంకు లాంటిది. బ్యాంకులో మనం ఎంత డబ్బును జమచేస్తే అంతే తీసుకోగలం. అలాగే ఎంత వాననీరు భూగర్భజలాశయానికి చేరుతుందో అంతనీటిని మాత్రమే మనం బయటకు తీసి వాడుకోవాలి. రాష్ట్రంలోని బోరుబావులను, వాటి సంబంధిత రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసే నిమిత్తం నిపుణులతో కూడిన ఒక కమిటీని వేసి వారి సూచనలు, సలహాల ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. దాంతోపాటు దక్కన్‌పీఠభూమిలో భాగంగా ఉన్న మన రాష్ట్ర నైసర్గిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు స్వస్తి పలికి వీటికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ జలవనరుల నిపుణులు హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియను చేపట్టాలి. చైనా, రాజస్తాన్‌ లాంటి ప్రాంతాల్లో హన్మంతరావు ప్రతిపాదించిన చతుర్విద జలప్రక్రియ సత్ఫలితాలనిస్తున్నట్లుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ విధానం మన రాష్ట్ర నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఉండి సత్ఫలితాలనిస్తుంది.

వ్యాసకర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ‘ మొబైల్‌: 98491 36104
ప్రొఫెసర్‌ జి. లక్ష్మణ్‌

 

మరిన్ని వార్తలు