ప్రజాకేంద్రక రాజకీయాలకు పట్టం కడదాం..!

29 Apr, 2018 00:45 IST|Sakshi

సందర్భం

పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం. పోరాటానికి అనన్యమైన త్యాగాలకు తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ మన తెలంగాణ. అందుకే మన మూలాలను పాలకులు మర్చిపోతున్న నేపథ్యంలో కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరముంది. వ్యక్తులు, కుటుంబాలు కాకుండా ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్‌ నిర్వహించాలి.

చాలా మంది తెలంగాణలో ఇన్ని పార్టీలు వుండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని అడుగుతున్నారు. నిజానికి దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు వందల సంఖ్యలో వున్నాయి. ఇన్ని పార్టీలు ఉండగా మరొక రాజకీయ పార్టీ అవసరమా అని ప్రజలు అడుగుతున్న ప్రశ్న సహేతుకమైనదే. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్‌డబ్బా పెట్టడం కాదని కేసీఆర్‌ వ్యంగ్యంగా అన్నట్లు నిజమే కాని, రాజకీయ పార్టీ అంటే అమ్మడం, కొనడం, దోచుకోవడం, కమీషన్లు దండుకోవడం కూడా కాదు.కాని 71 ఏళ్ళ భారత స్వాతంత్య్ర చరిత్రలో రాజకీయ పార్టీలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మాట నిజం.

ప్రజాధనాన్ని దోచుకోవడమే రాజకీయాల పరమావధిగా మారిపోయింది. కార్ల్‌ మార్క్స్, పూలే, అంబేడ్కర్‌ భావించినట్లు ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామిక విలువలను, చైతన్యాన్ని ప్రజలలో పాదుకొల్పడంలో పార్లమెంటరీ రాజకీయాలు విఫలమైనాయి, ప్రజలలో అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది. పార్లమెంటరీ రాజకీయ పార్టీల విధానాలు ఏ రంగంలోని ప్రజానీకాన్ని కూడా సంతృప్తి పరచకపోగా దేశం మొత్తాన్ని కార్పొరేటీకరణ వైపుగా పరుగులు తీయిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై అసంతృప్తి బయట పడటానికి 20 ఏళ్ళ కాలం పట్టింది. బిజేపీపై అసంతృప్తి బయట పడటానికి పదేళ్ళ కాలం కూడా పట్టలేదు. 

ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ కానీ, 20 ఏండ్లు పాలించిన తెలుగుదేశం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోవడంవల్లనే 1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం మళ్లీ ముందుకొచ్చింది. చివరకు 1600 మంది బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 2014లో సాకారమైంది.అభివృద్ధి నినాదం నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక ఆకాంక్షల అమలు కోసం సాగిందే ప్రత్యేక తెలంగాణ పోరాటం. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన నేటి పాలకులు తెలంగాణ అస్థిత్వ కోణంలోంచి పాలనా విధానాలను రూపొందించకుండా గత పాలకుల విధ్వంసకర అభివృద్ధి నమూనానే అమలు పర్చుతున్నారు.

సమస్యలపై పోరాడుతున్న అన్ని ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతూ సెక్షన్‌ 30, సెక్షన్‌ 156, సెక్షన్‌ 144 అమలు చేస్తూ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టిస్తూన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయడమే కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులైన ప్రొ‘‘ కోదండరాం ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అక్రమ అరెస్టు చేయడమే కాకుండా ఎన్‌కౌంటర్‌లను కొనసాగిస్తూ రాచరికపు పాలన సాగిస్తున్నారు.రాజకీయాలంటే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటిలో సామూహిక అభివృద్ధిని సాధించడమే తప్ప వ్యక్తుల ఎదుగుదల కాదు. తెలంగాణ సంపదను తెలం గాణ సమగ్రాభివృద్ధికి వినియోగించే ప్రణాళికలు రూపొందించకుండా ఉద్యమ ఆకాంక్షలను పక్కకు నెట్టి కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేసే విధానాలను రూపొందిం చారు.

తెలంగాణలోని సహజ సంపద బొగ్గు, నీళ్ళు, ఇసుక ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం దోచి పెడుతూ కమీషన్లను దండుకొంటున్నది. ఈ నాలుగేళ్లు బడ్జెట్‌ రూపంలో లక్షల కోట్ల రూపాయలను మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ (కాళేశ్వరం ప్రాజెక్టు) పేరుతో వెచ్చిస్తూ మౌలిక రంగాలను నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నది. సాధించిన తెలంగాణ అడవికాచిన వెన్నెల కాకూడదంటే ప్రొ‘‘ జయశంకర్‌ చెప్పినట్లు తెలంగాణలో మళ్ళీ నిరంతరాయంగా భావవ్యాప్తి, ఉద్యమం, రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రజా రాజకీయాలు పటిష్టపరచాలి.

ప్రజలే కేంద్రంగా రాజకీయాలను పునర్‌ నిర్వహిం చాలి. జవాబుదారీతనం, ప్రజల సంక్షేమం, సమష్టి వనరులు సమష్టి ప్రయోజనాలకే అన్న ఆలోచనతో కార్యాచరణ సాగాలి. వ్యక్తుల సమష్టి ప్రయోజనాలు ఆశిస్తూ మనిషి కేంద్రంగా కులాల అంతరాలను తొలగిస్తూ, అన్ని రంగాలలో వెనుకబాటుకు గురిచేసిన పాలనకు భిన్నంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీలదే. రాజకీయ పార్టీలు కుళ్ళి కంపుకొడుతూ భరింపరానివిగా తయారయ్యాయని ప్రజలు ముఖ్యంగా మేధావులు భావిస్తున్నారు. కానీ రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే అవి మనల్ని ఈరకంగా అణగదొక్కి 70 ఏండ్లుగా శాసిస్తున్నాయి. ప్రజలు మేధావులు రాజకీయాలను పట్టించుకోకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న రాజకీయాలే మనల్ని చుట్టుముడతాయి. పైగా మన జీవితాలు మనకు కాకుండా విద్య, వైద్యంతోసహా అన్ని రకాల అభివృద్ధి రంగాలను మనకు ఇష్టంలేకపోయినా కొనుక్కోవాల్సి వస్తుంది. 

అందుకే కోదండరాం నాయకత్వంలో ఏర్పడుతున్న తెలంగాణ జన సమితి పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ జన సమితి ప్రకటించుకుంటున్న లక్ష్యాలు సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణతో పాటు సమస్త సంపదలు ప్రజలందరికి చేరే విధంగా టీజేఎస్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ముఖ్యంగా మేధావులు, విద్యార్థి యువజనులతో పాటు అన్ని ప్రజా సంఘాలపై వున్నది. ఈ బాధ్యతను గుర్తించే గత నాలుగేళ్లుగా తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఇతర ప్రజా సంఘాలతో కలిసి టీజేఎస్‌ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించింది.తెలంగాణ సమాజం సమ్మక్క, సారక్క, కొమురంభీం, రాంజీగోండు, తుర్రే బాజ్‌ఖాన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మగ్దుం మోహియుద్దీన్‌లతో పాటు పోరాడే ప్రజల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ గడ్డ ఒక ధిక్కార స్వరం.

పోరాటానికీ, త్యాగాలకూ తమ అమూల్యమైన ప్రాణాలను గడ్డిపోచవలె విసిరేసిన గడ్డ ఈ తెలంగాణ. అందుకే  ఆయా సమాజాలలోని ప్రజల చైతన్యాన్ని బట్టి పాలకుల పాలన వుంటుందని రాజకీయ తత్వవేత్త బ్లంట్‌స్లీ చెప్పిన మాటలను ఈ తెలంగాణ గడ్డ తిరగరాస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకున్నదని రుజువు చేయాల్సిన సమయమిది. ఎంతదూరపు ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న సత్యాన్ని సమస్త ప్రజానీకం గుర్తించవలసి వుంది. అందరం కలిసి ఆశావహ దృక్పథంతో కలిసి ముందుకు సాగుతాం.(నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో టీజేఎస్‌ ఆవిర్భావ సభ)

గురిజాల రవీందర్‌
వ్యాసకర్త తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షులు
మొబైల్‌ : 98495 88825

మరిన్ని వార్తలు