భయానక రాజకీయ భవిత

22 Dec, 2017 00:50 IST|Sakshi

కొన్ని పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తే విద్వేషపూరితమైన ప్రచారం వల్ల బీజేపీ నిర్ణయా త్మకమైన ప్రయోజనాన్ని పొంది ఉండవచ్చు. ఇదే గనుక 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారా నికి ముందస్తు రిహార్సల్‌ అయితే, రాజకీయ చర్చ స్వభావంలో చాలా తీవ్ర పతనాన్ని మనం చూడబోతున్నాం. గుజరాత్‌ ఎన్నికలు మన రాజకీయాల భయానక భవితకు అద్దం పట్టాయి. అధికారంలోను, ప్రతిపక్షంలోను ఉన్న మన నేతలు భారతదేశం అనే భావన  పట్ల ఎలా ద్రోహానికి పాల్పడ్డారో మనకు చూపాయి. ప్రత్యామ్నాయం అవసరాన్ని చాటాయి.

ఇప్పుడు అందరూ ఎవరికివారు గెలుపు తమదేనని చెప్పుకోవడంలో తల మునకలై ఉన్నారు. ఎన్నికల్లో  గెలిచామని బీజేపీ అంటుంటే, నైతిక విజయం తమదేనని కాంగ్రెస్‌ అంటోంది. ఇక టెలివిజన్‌ చానళ్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో, టీఆర్‌పీ రేటింగుల్లో తామే విజయం సాధించామని చాటుకుంటున్నాయి. కానీ అందరూ కలసికట్టుగా ఓడిపోవటం వల్ల వారందరిలోనూ ఆందోళన లోతుగా గూడు కట్టుకుని ఉంది. గెలిచామని హోరెత్తించేస్తున్న ఈ గోల దాన్ని కప్పిపుచ్చలే కపోతోంది. ఇక్కడ గెలిచిన వారు ఎవరూ లేరు. గుజరాత్‌ ఎన్ని కల్లో దేశమే విలువైనదాన్ని దేన్నో పోగొట్టుకుంది.

విజయాల గోల అతిశయాల హేల
సాధారణంగానైతే, గుజరాత్‌ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించకూడదు. అది, 1991 లోక్‌సభ ఎన్నికల నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంటున్న రాష్ట్రం. అక్కడ మరోసారి ఎన్నికలంటే, అందులోనూ ఒక గుజరాతీ ప్రధానమంత్రిగా ఉండగా జరుగుతున్న ఎన్నికలంటే... పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలు విజయం సాధించిన 2001 లేదా 2006 ఎన్నికల్లాగా అసలు చెప్పుకోదగినవే కాకుండా జరగాల్సినవి. కానీ ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ గట్టి పట్టుదలతో పాల్గొనడం, నరేంద్ర మోదీ ఆయనపై ప్రతిదాడికి దిగడం, దిగువ క్షేత్రస్థాయి నుంచి వినవచ్చే అసమ్మతి స్వరాలు కలసి దేశం దృష్టిని ఆ ఎన్నికల మీదకు మరల్చాయి. ఇవి 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌ కావు. కానీ రాబోయే ఒకటిన్నరేళ్ల కాలంలో ఏ పరిణామాలు మన కళ్లకు కట్టనుండవచ్చనేదాన్ని అవి రేఖా మాత్రంగా చూపించాయి.

బీజేపీ సాధించామని చెప్పుకుంటున్న విజయం బాగా అతిశయీకరించి చెప్పుకుంటున్నదేనని ఆ పార్టీకి బాగా తెలుసు. శాసనసభ ఎన్నికల్లో వరు సగా ఆరోసారి విజయం సాధించడం గొప్పే, అందులో  సందేహం లేదు. కానీ 2014లో అది ఘన విజయం సాధించింది. పైగా ఇప్పుడు ప్రధాని, అధికార పార్టీ అధినేత ఇరువురూ గుజరాతీలే. ఈ నేపథ్యం నుంచి చూస్తే ఇది అంత ఘనంగా చెప్పుకోవాల్సిన విజయం కాదు. 1995 నుంచి బీజేపీ శాసనసభ ఎన్నికల్లో జైత్రయాత్రను ప్రారంభించినప్పటి నుంచి చూస్తే గుజరాత్‌లో అది గెలుచుకున్న సీట్లు, ఓట్ల శాతాల దృష్ట్యా ఇది అతి చిన్న విజయం. మరో 2 శాతం ఓట్లు బీజేపీ నుంచి అటు మళ్లితే అది ప్రతిపక్షంలో కూచోవాల్సి ఉండేది. ఈ పరిస్థితి అంటే, ఆ పార్టీ నిర్దేశించుకున్న ‘150 మిషన్‌’ లక్ష్యానికే కాదు, అంతకంటే మరింత వాస్తవికమైనవిగా పార్టీ తన ముందుంచుకున్న లక్ష్యాలకు సైతం చాలా దూరంగానే చతికిల పడిపోవడం అని అర్థం.

కాంగ్రెస్‌ నైతిక విజయం సాధించానని చెప్పుకోవడం తక్కువ అతి శయీకరణేమీ కాదు.  చేజారిన అవకాశం అయితే, చాలా కాలం తర్వాత ఆ పార్టీ ప్రచారంలో సందర్భశుద్ధితో కూడిన పొందిక, ఐక్యత, పోరాట స్ఫూర్తి సూచనలు కనిపించిన మాట నిజం. ఇలాంటి ప్రాథమిక అంశం సైతం ఒక విజయంగా కనిపించడం అనేది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని వ్యక్తంచేసే వ్యాఖ్య అవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన అత్యుత్తమ ఫలితం ఇదే, నిజమే. ప్రత్యేకించి ఇటీవల అక్కడ ఆ పార్టీలో చీలికలు రావడం, ఫిరాయింపులు జరగడం నేపథ్యం నుంచి చూస్తే ఇది చెప్పుకోదగిన  ఫలితమే. అయినాగానీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలకంటే, అది చేజార్చుకున్న అవకాశాలే ఎక్కు వగా గుర్తుండిపోతాయి.   

ఇది నిజానికి కాంగ్రెస్‌కు సరిగ్గా తాను కోరుకునే అవకాశమే అందివచ్చిన సమయం. గుజరాత్‌లో గత నాలుగేళ్లుగా వ్యవసాయ సంక్షోభం వృద్ధి చెందుతూ వచ్చింది. వరుసగా సంభవించిన కరువు కాలాల్లో ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైంది. ఆ తదుపరి రెండేళ్లు సమృద్ధిగా పంటలు పండినా పెద్ద నోట్ల రద్దు, ధరలు పడిపోవడం, ప్రత్యేకించి పత్తి, వేరుశనగ ధరలు కుప్ప కూలడం కలసి రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది. ప్రభుత్వ తలపొగరుతనం పట్ల సామాన్య పౌరుల్లో అసంతృప్తి ప్రారంభమైంది.

ఈ అసంతృప్తిలో కొంత పాటీదార్లు తదితర ఉద్యమాల్లో సంఘ టితమైంది. అధికార పార్టీ పట్ల ఉన్న ఈ అసంతృప్తిని తమ పార్టీకి ఓటు వేసే దిశకు మళ్లించుకోవడం మాత్రమే కాంగ్రెస్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రైతుల గురించి కాంగ్రెస్‌ మాట్లాడటమే కాదు, రుణ మాఫీని సైతం వాగ్దానం చేసింది.  బీజేపీ వ్యతిరేక ఓటర్లు కాగలిగిన వారిలో ఓ చిన్న భాగాన్నయినా అయినా కాంగ్రెస్‌ తమ పార్టీకి ఓటు చేసేవారిగా మార్చగలిగేదే. అదే జరిగి వుంటే గ్రామీణ గుజరాత్‌ నుంచి, ప్రత్యేకించి ఉత్తర గుజరాత్, సౌరాష్ట్రలలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయేది. కాబట్టి ఇది కాంగ్రెస్‌ చేజార్చుకున్న పెద్ద అవకాశం.

సమష్టి వైఫల్యం గురించి హెచ్చరిక
గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ఎలా ఉంటాయి అనే దృష్టి కోణం నుంచి మాత్రమే ఈ ఎన్నికలను చూడకూడదు. ఎన్నికలు ప్రజాస్వామిక రాజకీయాలకు అద్దం పడతాయి. మనం ఈ అనుభవాన్ని, మన ప్రజాస్వామిక రాజకీయాల భవితకు సంబంధించి అవి ఏమి చెబుతున్నాయనే దృష్టి నుంచి అంచనా కట్టాలి. ఈ దృష్టి కోణం నుంచి చూస్తే గుజరాత్‌ ఒక ఆరోగ్యకరమైన హెచ్చరిక. మన సమష్టి వైఫల్యం గురించి చేసిన హెచ్చరిక. సంస్థాగతమైన దుర్బలత్వం మొదటి వైఫల్యం. ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను ప్రకటించడంలో అపరిమితమైన జాప్యం చేసింది. రాహుల్‌ గాంధీ ఇంటర్వ్యూను అడ్డుకుని, బీజేపీ నేతలు అలాంటి ప్రచారాన్నే చేస్తే దాన్ని అది అనుమతించించింది. ఇలా అది తన పక్షపాతాన్ని బహిరం గంగానే ప్రదర్శించింది. శేషన్‌ హయాం తదుపరి ఎన్నికల కమిషన్‌ ఎన్నడూ ఇంతగా పతనం కాలేదు.

రాజకీయాల సారాంశం స్థాయిలో నెలకొన్న శూన్యం రెండో వైఫల్యం. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికను ఎట్టకేలకు మొదటి దఫా పోలింగ్‌కు ఒక రోజు ముందుగానీ విడుదల చేయలేదు. అది కూడా గత్యంతరం లేక విడు దల చేసినదే. అర్ధమనస్కంగా చేసిన కొన్ని వాగ్దానాల దొంతర మాత్రమే అందులో ఉంది. చాలా వరకు అది అక్కడిది, ఇక్కడిది కత్తిరించి తెచ్చి అతికించిన బాపతుదే. కాంగ్రెస్‌ అంతకంటే శ్రద్ధగా రూపొందించిన ప్రణా ళికను సకాలంలోనే విడుదల చేసింది. కానీ అది పాటీదార్లకు రిజర్వేషన్లను వాగ్దానం చేయడం తర్కానికి, చట్టానికి కూడా విరుద్ధమైనది. ప్రచార కాలం అంతటా కాంగ్రెస్‌ ముస్లింల స్థితిగతుల పట్ల ఎలాంటి వైఖరిని తీసుకోకుండా జంకుతూనే ఉండిపోయింది. రాజకీయాలకు, విధానాలకు మధ్య పొంతన లేకుండా పోవడం పెరగడాన్ని ఇది సూచిస్తుంది.

అధమస్థాయి ప్రచారానికి ఆమోదం!
ఇకపోతే మూడో వైఫల్యం మరింత లోతైనది. అది, బహిరంగ చర్చ స్థాయి విషపూరితం కావడానికి సంబంధించినది. పార్టీలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు చాలా అధమ స్థాయివి. కొన్ని సార్లు కాంగ్రెస్‌ కూడా అలాంటి ఆరోపణలకు దిగినా, ప్రధానంగా బీజేపీనే ఆ పని చేసింది. అయితే ఇది సమస్య కాదు. నిస్సిగ్గుగా ఆడిన అబద్ధాలు, వ్యగ్య దూషణలు, కాల్పనిక కథనాలు, కరడుగట్టిన మతతత్వంతోకూడిన అసత్యాలను వ్యాప్తి చేయడం తో కూడిన ఈ అధమ స్థాయి ప్రచారాన్ని సాగించినది దేశంలోని అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తే కావడం మాత్రమే ఈ వైఫల్యం కాదు. మీడియాలో వచ్చిన కొద్దిపాటి విమర్శలు మినహా ఇవన్నీ  దాదాపుగా సాధారణ రాజకీయ ప్రచారంగా చెల్లుబాటు కావడం అసలు వైఫల్యం. ఎన్నికల తర్వాత వెల్లడిం చిన కొన్ని పరిశోధనా ఫలితాలను బట్టి చూస్తే ఈ విద్వేషపూరితమైన ప్రచారం వల్ల బీజేపీ వాస్తవంగా నిర్ణయాత్మకమైన లబ్ధిని పొంది ఉండవచ్చు. ఇదే గనుక 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముందస్తు ట్రైలర్‌ అయితే, రాజకీయ చర్చ స్వభావంలో చాలా తీవ్ర పతనాన్ని మనం చూడబోతున్నాం. విషప్రచారం, శూన్యం పెరుగుతుండటం ఓటర్లను ఎన్నికల ప్రక్రియకు దూరం చేయడం గుజరాత్‌లో పోలింగ్‌ పడిపోవడంగా కొంత వరకైనా ప్రతిఫలించి ఉండవచ్చు.  

గుజరాత్‌ ఎన్నికలు మన రాజకీయాల భయానక భవితను చూపుతున్న చిన్న అద్దంలాంటివి. ప్రభుత్వంలోను, ప్రతిపక్షంలోను ఉన్న మన నేతలు భారతదేశం అనే భావన  పట్ల ఎలా ద్రోహానికి పాల్పడ్డారో ఆ అద్దం చూపింది. ప్రత్యామ్నాయం అవసరం ఏమిటో ఈ ఎన్నికలు మరోసారి నొక్కిచెప్పాయి.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు
యోగేంద్ర యాదవ్‌
మొబైల్‌ : 98688 88986  

మరిన్ని వార్తలు