బడిగంట మోగింది!

16 Jun, 2018 01:11 IST|Sakshi

అక్షర తూణీరం 

ఉన్నట్టుండి వీధుల్లో కొత్త సందడి మళ్లీ మొదలైంది. ఇంద్రధ నువులు నేలకి దిగివచ్చి నట్టు, గుంపులు కట్టి సీతాకోక చిలకలు వీధుల్లో విహరిస్తు న్నట్టు, ఆధునిక సంగీతం యూనిఫాం ధరించి స్కూల్‌ బస్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ స్కూళ్లు తెరిచారు. బడిగంట మోగింది. పిల్లలు... పిల్లలు... ఎక్కడ చూసినా బడిపిల్లలు. వాళ్లు అక్షర దీపాలు. మన ఆశా కిరణాలు. రెండు నెలలకు పైగా హాయిగా సెలవులనుభవించి, ఇప్పుడే ఒళ్లు విరుచుకుంటూ బడికి అలవాటు పడుతున్నారు. నిన్నమొన్నటి దాకా గడియారం వంక చూడకుండా నిద్ర పోయారు. హోం వర్కులు వాటి తాలూకు అమ్మ నసలు అస్సలు లేవ్‌. ఎప్పుడైనా నిద్రలేచి ఎప్పు డైనా స్నానం పోసుకోవచ్చు. అసలు ఓ పూట నీళ్లు డుమ్మాకొట్టినా ఎవరూ పట్టించుకోరు.

కొత్త డ్రెస్సుల్లో, కొత్త తరగతుల కొత్త పుస్తకాలతో పిల్లలు నవనవలాడుతున్నారు. సై తరగతికి వచ్చినందుకు అంగుష్ఠమాత్రం పెద్ద రికం ప్రదర్శిస్తున్నారు. ఇన్ని రోజుల బ్యాక్‌లాగ్‌ విశేషాలు చెప్పుకోవాలి. అందుకని కబుర్లే కబుర్లు. తాతగారింటికో, నానమ్మ దగ్గరికో వెళితే ఆ సంగతులన్నీ దోస్తులకి పంచాలి. ఇన్నాళ్లలో ఇంటాబయటా చూసిన సినిమా కబుర్లు కల బోసుకోవాలి. ఎగరేసిన గాలిపటాలు, తీర్థంలో తిరిగిన రంగుల రాట్నం, ఆచోటెక్కిన జెయంట్‌ వీలు, మెట్రో రైలు, షూటింగ్‌లో అభిమాన హీరో– అన్నీ ప్రస్తావనకి వస్తాయ్‌. పిల్లల మాటల్ని మాటేసి వినండి. ఏ గొప్ప సంగీతమూ వాటికి సాటి రాదు. రెండేళ్ల వయసు దాటితే వాళ్ల మాటలు కలవవ్‌. అందుకని ఎవరి గ్రూప్‌ వారి దిగా విడిపోతుంది. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్లలన్నాడు మహాకవి. కులం, మతం, గోత్రం, వర్గం, ప్రాంతం తేడా తెలియని వాళ్లు. ఆ దశలో ఉండే అమాయకత్వాలని చిది మేసి పెద్దలు స్వార్థానికి వాడుకుంటారని భయ మేస్తూ ఉంటుంది.

అమ్మ వెనకో, నాన్న వెనకో స్కూటర్‌ మీదో, బైక్‌ మీదో చిన్న చిన్న పిల్లలు కూచుని వెళ్తుం టారు. వాళ్ల భుజాలకో బరువైన సంచీ. మధ్యా హ్నం స్కూల్నించి వచ్చేటప్పుడు ఆ పిల్లలు నిద్రలో జోగుతూ ఉంటారు. నాకెంత భయమే స్తుందో చెప్పలేను. అమ్మనాన్నలని హెచ్చరించే అవకాశం ఉండదు. అయ్యలారా! అమ్మలారా! పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోండి. లేదంటే కలిపి ఓ బెల్ట్‌ పెట్టుకోండి.

పదేళ్ల తర్వాత వీళ్లంతా ఒక ఆకృతి ధరి స్తారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్‌ ఏమైనా అవచ్చు. క్రీడాకారులుగా, కళాకారులుగా రాణిం చవచ్చు. దీని తర్వాత బంగారు కలలు కనే దశ వస్తుంది. కెరియర్‌ పట్ల, జీవితంపట్ల బోలెడు ఆశలు, ఆశయాలు పొటమరిస్తాయ్‌. ఈనాటి ఈ ఇంద్రధనువులు ఒక్కోసారి నిరాశా నిస్పృహలను కలిగిస్తున్నాయి. ఎంట్రన్స్, ఇతర పోటీ పరీక్షా ఫలితాల సీజన్‌ వస్తోందంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయ్‌. అనుకున్న ర్యాంక్‌ రాకపోతే చని పోవాలా? చదువుల్లోనే కాదు, మానసికంగా కూడా గట్టి పడాలి. ఇలాంటి సంఘటనలప్పుడు వారి తల్లిదండ్రులే కాదు, అందరూ విలవిల్లాడు తారు. పదిలం!


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు