కుట్ర కాదు వ్యూహం

17 Mar, 2018 01:19 IST|Sakshi
సీఎం చంద్రబాబు నాయుడు

అక్షర తూణీరం

‘ఇది తెలుగుదేశంపై కుట్ర. దీని వెనక పెద్దలున్నారు’ అని బాబు అంటున్నారు. కుట్ర అనుకుంటే కుట్ర, వ్యూహం అనుకుంటే వ్యూహం. చదరంగంలో చెక్‌ అన్నా, ఆటకట్టు అన్నా, షా అన్నా ఒక్కటే. పెద్దల్లో అగ్రనేత షా లేరు కదా?

ఈ ఉగాది చంద్రబాబుని పూర్తిగా ఇరుకున పడేసేట్టు కనిపిస్తోంది. మొన్న సంక్రాంతి నాడు సూర్యుని ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా గుర్తించి గౌరవించారు. శివరాత్రి నాడు జటాజూటంలోని గంగని ఏపీ ప్రభుత్వ ఆడపడుచుగా మన్నించారు. మనది చాంద్రమానం కాబట్టి ఉగాది శుభవేళ చంద్రునికో నూలుపోగుగా ఆయనకో స్థానం కల్పి స్తారని ఎదురు చూస్తున్న వేళ ఎదురుదెబ్బ తగిలింది. మావూళ్లో ఒకాయన ఏమన్నాడంటే– ‘‘ఆమని వచ్చింది, మా చంద్రబాబు కోయిలలా కూస్తు న్నాడు. కుహూ కుహూ అని ఒకటే కూత’’ అన్నాడు. నిజమే, ఎన్నిసార్లు చెబుతాడు అదే మాట.

ఎన్నికల సమయంలో సవాలక్ష అనుకుంటారు. ప్రేయసీప్రియులు పెళ్లికి ముందు బోలెడు బాసలు, ఊసులు చేసుకుంటారు. వాటినే ‘స్వీట్‌ నథింగ్‌’ అంటారు ఆంగ్లంలో. ప్రపంచ ప్రసిద్ధ స్టేట్‌ కాపిటల్‌ చంద్రబాబు కల. ఆ కలకి మోదీ ధారాళంగా నిధులు ఇవ్వాల్సిన పనిలేదు. రైతు రుణమాఫీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానం. దానికి కేంద్రం పైసలివ్వక్కర్లేదు. పోలవరం పూర్తి చేస్తారు. దాని సమయం దానికి పడుతుంది. తెలుగు దేశం ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో కూచుని రాష్ట్రానికి ఏ చిన్నదీ సాధించలేకపోయారనే అపప్రథ సామాన్య ప్రజలో ఉంది.

నాలుగేళ్ల సమయాన్ని వృథా చేశారనీ, ఈలోగా మోదీ స్థిమితపడ్డారనీ, ఇంకోరి మాట వినే స్థితిలో లేరని పరిశీలకులు అంటున్నారు. కొందరు అమాయకులు ఏమంటున్నారంటే– అందరికీ కావల్సింది రాష్ట్ర ప్రయో జనాలే అయినప్పుడు, అన్ని పార్టీలను మిళితం చేసి ఏకోన్ముఖంగా పోరాడవచ్చు గదా. వాళ్లు నిజంగా అమా యకులు. జనసేన మంగళగిరి సభలో పవన్‌కల్యాణ్‌ ఫిరంగి పేల్చాడు. ‘మా నాన్న ముఖ్యమంత్రి కాదని’ చిన్న తూటా విసిరాడు. తర్వాత లోకేష్‌బాబు అవినీతి మీ దృష్టికి రాలేదా అని సూటిగా చంద్రబాబుని ప్రశ్నిం చాడు మహాజన సభలో కిమిన్నాస్తి. సరితూగే జవాబు లేదు. ఖండన లేదు. ఛోటా మోటా నాయకులు మాత్రం, ఆయనెవరండీ.. పవన్‌కల్యాణ్‌ మాటల క్కూడా స్పందిస్తారా, గోంగూర అంటున్నారు. మొన్నటిదాకా పవన్‌కల్యాణ్‌ నోటెంట ఏమాట వచ్చినా, మంచి సూచన చేశారంటూ హాజరైన మాట నిజం కాదా.

ఇప్పుడు తేలిగ్గా తీసేసి ‘గోంగూర’ అంటే బ్యాలెన్సవదు. పవర్‌లోకి రాకముందు నుంచే రాష్ట్ర వెల్ఫేర్‌ విషయాల్లో చినబాబే జోక్యం చేసుకుంటున్నాడని వినేవాళ్లం. ఇహ పవర్లోకి వచ్చాక ఇంకో పవర్‌ హబ్‌ ఆవిష్కృతమైందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. రెండో పవర్‌ సెంటర్‌ పుట్టడం అసలు దానికి చేటని గత చరిత్ర చెబుతోంది. ‘కాకి పిల్లకేం తెలుసు ఉండేలు దెబ్బ’ అనే సామెత వేయి సంవత్సరాల నాడు పుట్టింది. ఇప్పుడు అర్జంటుగా ఇంటి ఆవరణలో స్వచ్ఛభారత్‌పై దృష్టి పెట్టాలి.

‘ఇది తెలుగుదేశంపై కుట్ర. దీని వెనక పెద్ద లున్నారు’ అని చంద్రబాబు అంటున్నారు. కుట్ర అను కుంటే కుట్ర, వ్యూహం అనుకుంటే వ్యూహం. అవి శ్వాసం వేళ మోదీకి అవకాశం వస్తుందనీ, అప్పుడు ఉతికి ఆరేస్తారని ఒకచోట విన్నా. చదరంగంలో చెక్‌ అన్నా, ఆటకట్టు అన్నా, షా అన్నా ఒక్కటే. పెద్దల్లో అగ్ర నేత షా లేరు కదా కొంపదీసి?

- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు