అరుదైన అధికారి బీపీఆర్‌ విఠల్‌

24 Jun, 2020 00:53 IST|Sakshi

నివాళి 

93 ఏళ్ల వయసులో కన్నుమూసిన విఠల్‌ తొలితరం ఐఏఎస్‌ అధికారి. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో కీలక పద వులు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో 1972 నుంచి 1982 వరకూ ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా; ఏపీ ప్లానింగ్‌ అండ్‌ డెవ లప్‌మెంట్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా; పదో ఆర్థిక సంఘం సభ్యుడిగా; కేరళ ప్రభుత్వం ఎక్స్‌ పెండీచర్‌ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేశారు. ఐఎంఎఫ్‌ తరఫున సూడాన్, మాలావీ ప్రభుత్వా లకు ఆర్థిక సలహాదారుగానూ ఉన్నారు.

విఠల్‌ పూర్వీకులది శ్రీకాకుళం జిల్లా. తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డారు. విఠల్‌ తండ్రి నిజాం కాలంలో తెలంగాణ వచ్చారు. రాజ మండ్రిలో ఇప్పటికీ వారి ఇంటి పేరిట బారు వారి వీధి ఉంది. 1942లో నిజాం కాలేజీలో చదువును మధ్యలో వదిలేసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో చేరారు.  గాంధీజీ సలహా మేరకు తిరిగి మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదువుకు న్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఆ కళాశాల విద్యార్థి సంఘం తొలి భారతీయ అధ్యక్షుడు ఆయనే. 1949లో హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసులో చేరిన విఠల్, మరు సటి ఏడాది ఐఏఎస్‌కు అర్హత సాధించారు.

1950లో హైద రాబాద్‌ రాష్ట్రంలో మెదక్, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్‌గా పీడిత వర్గాల అభ్యున్నతికి పనిచేశారు. కాసు బ్రహ్మా నందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ప్రభు త్వాల హయాంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మరియు దాని అప్పటి చైర్మన్‌ జె.చొక్కా రావుతో కలిసి క్రియాశీలంగా పనిచేశారు. 1960లో ఉస్మా నియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.

ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధితో సన్ని హిత సంబంధముంది. 1969లో తెలంగాణ ఆందోళన తర్వాత ఫైవ్‌ పాయింట్‌ ఫార్ములా పరిణామంతో, 1972లో జరిగిన ఆంధ్ర ఆందోళన తర్వాత సిక్స్‌ పాయింట్‌ ఫార్ము లాతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న అధికారి విఠల్‌ ఒక్కరే. ఈ రెండు ఫార్ములాల సత్ఫలితాలతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అక్షరాస్యత ఉద్యమంలో భాగంగా 1990లో దేశవ్యాప్తంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితిని కేంద్రం ఏర్పాటు చేయగా– ఆంధ్రప్రదేశ్‌లో ఆ సమితికి విఠల్‌ అధ్యక్షులు గాను, నేను కార్యదర్శిగా, వావిలాల గోపాల కృష్ణయ్య ఉపాధ్య క్షులుగాను పనిచేశాము. ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించి ఆంధ్ర ప్రదేశ్‌లోని 9 మండలాల్లో అక్షరాస్యత కార్యక్ర మాన్ని నిర్వహించాలంది.

సుమారు 4 ఏళ్ల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్టు కింద మిగిలిన రూ.47 లక్షల నిధులను తిరిగి కేంద్రానికి అప్ప గించడంలో విఠల్‌ నిజాయితీని అవగతం చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత నిజామ్‌ ట్రస్ట్, హైదరాబాద్‌ లిటరరీ సొసైటీ, జన విజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సీఈఎస్‌ఎస్‌) సంస్థ స్థాపించారు. అనేక రచ నలు చేశారు. ఆయన పుస్తకం ‘ద తెలంగాణ సర్‌ప్లసెస్‌: ఎ కేస్‌ స్టడీ’ ప్రత్యేక తెలంగాణ డిమాండు బలపడేందుకు దోహ దపడింది. నిర్వహించిన ప్రతి పదవిలోనూ సామాన్యంగా బతకడం విఠల్‌ నైజంగా చెప్పవచ్చు.

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ మొబైల్‌ : 99499 30670

మరిన్ని వార్తలు